ఇది విద్యాహక్కుకు భంగం కాదా?
విశ్లేషణ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థి తులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం. రెండుమాసాల సెలవు అనంతరం తిరిగి విధులకు ఎందుకు హాజరు కావలసి వచ్చిందో ఆయన చెప్పిన కారణాలు విశ్వసించదగిన మీడియాలోనే వార్తలుగా వచ్చాయి.
అది ఆయన మాట లలోనే: ‘రెండుమాసాలంటే సుదీర్ఘకాలం. చేయవలసిన పని చాలా ఉండిపోయింది’. ఇంకా, ఆయనను మళ్లీ విధులకు హాజరయ్యేటట్టు పురికొల్పిన మరో అంశం, ‘‘ఆయన సహోద్యోగులు పట్టుపట్టడం’’ కూడా. అంతేకాకుండా తన పునరా గమనానికి మరోకారణం- రూపన్‌వాల్ జుడీషియల్ కమిషన్ ‘‘దాదాపు’’ తన పనిని పూర్తి చేసిందని తాను భావించడం.
వైస్‌చాన్స్‌లర్ గుర్తించడంలో విఫలమైనది, మొత్తం ప్రపంచం గుర్తించిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే-కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా, విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది. చివరిగా- వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్‌వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్‌చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు? చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలు స్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా?
ఇన్ని వాస్తవలు పరిశీలించిన తరువాత ఓ అంతిమ నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. అదేమిటంటే- ఏమరేమనుకున్నా ఫర్వాలేదన్నంత రీతిలో అధికార దాహం ఉన్న వైస్‌చాన్స్‌లర్‌కు తప్పుడు నిర్ణయంతో అప్పగించిన బాధ్యత నుంచి విశ్వవిద్యాలయం పాలనా వ్యవహారాలు చూసే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆయన మాటతోనే తప్పించింది. లేదా వైస్ చాన్సలర్‌ను తొలగించినట్టు ఒక ఆట ఆడింది. కాబట్టి ఇప్పుడు వైస్‌చాన్స్‌లర్‌ను సస్పెండ్ చేయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరే హక్కు మనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన లోటుపాట్ల మీద దర్యాప్తును నిలుపు చేయమని కోరవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం వ్యవహారాలను నిర్వ హించే బాధ్యతను మళ్లీ ఇన్‌చార్జి వీసీకి అప్పగించమని కోరే హక్కు కూడా మనకు వచ్చింది. ఇది మాత్రమే విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ఉపకరిస్తుంది.
ఇన్‌చార్జి వీసీ నియామకంతోనే ఆయనకు పూర్తి స్థాయి అధికారాలను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెంటనే అప్ప గించాలి కూడా. విద్యా విషయక కార్యకలాపాలు కూడా సాగించే అధికారాలను దఖలుపరిచే సమగ్ర ఆదేశాలను జారీ చేయాలి. దానితోనే డాక్టర్ అప్పారావు వైస్‌చాన్స్‌లర్‌గా కొనసాగడం కోసం చెప్పుకోవడానికి సాకు ఏదీ మిగలదు. ఈ పని నిర్వర్తించ డంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విఫలమైతే, ఈ దోబూచు లాట వెనకాల ఆ మంత్రిత్వ శాఖ ఉందని ఇప్పటికే భావిస్తున్న అనేక వర్గాల దృష్టిలో దోషిగా నిలబడవలసి దుస్థితిని తనకు తనే తెచ్చుకోవచ్చు.
ఈ వైఫ ల్యాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా నిర్ధారించుకోవలసివస్తుంది. అంటే విద్యాహక్కును ఉల్లంఘించినట్టు నిర్ధారణకు రావలసి ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 12(1), (2) కింద హెచ్‌సీయూ విద్యార్థులకు ఆ హక్కును నిరాకరించి నందుకు దోషిగా నిలబడవలసి ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రేక్షకపాత్ర వహించిన దోషం కూడా ఉంటుంది. వీటితో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారం చెల్లించవలసి ఉంటుంది. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా లేదా కమిషన్ తనకు తానుగా కేసును పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న అవకతవకలకు తోడు ఈ పాపాన్ని కూడా మూట గట్టుకోరాదు.
- కె.ఆర్. వేణుగోపాల్
వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి
మొబైల్: 9052469165