KR Venugopal
-
‘సామాజిక న్యాయ’ రూపశిల్పి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేసి దళితుల, ఆదివాసీల, మైనారిటీల, వెనకబడిన వర్గాల సామాజికార్థిక హక్కుల కోసం అహరహం శ్రమించిన మహనీయుడు పీఎస్ కృష్ణన్ 87 ఏళ్ల వయసులో ఆదివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. 1956 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణన్ మరణంతో ఈ వర్గాలు తమ హక్కుల కోసం అంకితభావంతో కృషి చేసిన ఒక చాంపియన్‌ను కోల్పోయాయని చెప్పాలి. ఆయన నిర్వహించిన శాఖలు, ముఖ్యంగా కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శి పదవి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘సామాజికయుక్తమైనవి’. సమానత్వం, సమన్యాయం గురించి ప్రవచించే ఈ దేశ రాజ్యాంగం... అందుకు విరుద్ధమైన పోకడలతో నిర్మితమై ఉన్న మన సమాజాన్ని శాంతియుతంగా మార్చడానికి వీలైన సాధనమని 50వ దశకంలో తనతోపాటు సర్వీస్‌లో చేరిన తన సహచరులకు, ఇతరులకు ఆరు దశాబ్దాలపాటు తన ఆచరణద్వారా నిరూపించిన గొప్ప వ్యక్తి కృష్ణన్. ఆ విషయంలో ఆయన డాక్టర్ అంబేడ్కర్‌కు ఏకైక సాధికార అనుచరుడు. షెడ్యూల్ కులాలకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రణాళిక(స్పెషల్ కాంపోనెంట్) రూపశిల్పి కృష్ణన్. రాష్ట్రాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రణాళికలకు కేంద్రం సాయం అందించడం, రాష్ట్రాల్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్పొరేషన్లకు నేరుగా కేంద్ర సాయాన్ని అందించడం వంటివి 1978–80 మధ్య ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. 1989లో వచ్చిన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధ) చట్టం ఆయనే రూపొందించారు. మానవ మలాన్ని మోసుకెళ్లే అత్యంత అమానుషమైన పనికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన మండల్ కమిషన్ సిఫార్సులు అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వం, అనితర సాధ్యం. ఈ సిఫార్సులను హేతుబద్ధీకరించి, వాటిల్లోని వైరుధ్యాల పరిష్కారానికి కృష్ణన్ ఎంతో శ్రమించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం, కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖగా నామకరణం చేసింది కూడా ఆయనే. భారత సమాజంలోని అనేకానేక ఉపజాతులకు చరిత్రలో జరిగిన అన్యాయం గురించి ఆయనకున్న పరిజ్ఞానం అపారమైనది. వాటిపై వచ్చే ప్రశ్నలకైనా, ఇక్కడి సామాజిక జీవనం గురించిన ప్రశ్నలకైనా ఆయన ఎంతో సాధికారికంగా, సులభగ్రాహ్యంగా జవాబిచ్చేవారు. ఆ రంగంలో ఆయన చేసిన విస్తృత అధ్యయనం అందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో ఉండే ప్రణాళిక, విధాన రూపకల్పన సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయన విజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాయి. పాలనా వ్యవహారాల రంగంలో పనిచేసే మన ఉన్నత విద్యాసంస్థలు ఆయన చేసిన పరిశోధన పత్రాలను, ఆయన ఇతర రచనలను సేకరించి భవిష్యత్తరాల ప్రభుత్వోద్యోగులకు, దళిత అధ్యయనాలపై పనిచేస్తున్న యువతరానికి మార్గదర్శకంగా వినియోగిస్తే మన సమాజానికి లబ్ధి చేకూరుతుంది. సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా ఈ దేశంలో శాంతియుత పరివర్తన సాధ్యమేనని స్వప్నించిన డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ఇది తోడ్పడుతుంది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న కృష్ణన్ సతీమణి శాంతి కృష్ణన్, ఆయన భావాలను పుణికిపుచ్చుకున్న కుమార్తె శుభదాయని ఆయన అపారమైన పరిశోధన పత్రాలను, ఇతర రచనలను అందించి ఇందుకు సహకరించగలరని నా దృఢమైన విశ్వాసం. కె.ఆర్.వేణుగోపాల్ వ్యాసకర్త మాజీ ఐఏఎస్ అధికారి, ప్రధాన మంత్రి కార్యదర్శి(రిటైర్డ్) -
ఇది విద్యాహక్కుకు భంగం కాదా?
విశ్లేషణ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థి తులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం. రెండుమాసాల సెలవు అనంతరం తిరిగి విధులకు ఎందుకు హాజరు కావలసి వచ్చిందో ఆయన చెప్పిన కారణాలు విశ్వసించదగిన మీడియాలోనే వార్తలుగా వచ్చాయి. అది ఆయన మాట లలోనే: ‘రెండుమాసాలంటే సుదీర్ఘకాలం. చేయవలసిన పని చాలా ఉండిపోయింది’. ఇంకా, ఆయనను మళ్లీ విధులకు హాజరయ్యేటట్టు పురికొల్పిన మరో అంశం, ‘‘ఆయన సహోద్యోగులు పట్టుపట్టడం’’ కూడా. అంతేకాకుండా తన పునరా గమనానికి మరోకారణం- రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ ‘‘దాదాపు’’ తన పనిని పూర్తి చేసిందని తాను భావించడం. వైస్‌చాన్స్‌లర్ గుర్తించడంలో విఫలమైనది, మొత్తం ప్రపంచం గుర్తించిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే-కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా, విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది. చివరిగా- వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు? చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలు స్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా? ఇన్ని వాస్తవలు పరిశీలించిన తరువాత ఓ అంతిమ నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. అదేమిటంటే- ఏమరేమనుకున్నా ఫర్వాలేదన్నంత రీతిలో అధికార దాహం ఉన్న వైస్‌చాన్స్‌లర్‌కు తప్పుడు నిర్ణయంతో అప్పగించిన బాధ్యత నుంచి విశ్వవిద్యాలయం పాలనా వ్యవహారాలు చూసే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆయన మాటతోనే తప్పించింది. లేదా వైస్ చాన్సలర్‌ను తొలగించినట్టు ఒక ఆట ఆడింది. కాబట్టి ఇప్పుడు వైస్‌చాన్స్‌లర్‌ను సస్పెండ్ చేయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరే హక్కు మనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన లోటుపాట్ల మీద దర్యాప్తును నిలుపు చేయమని కోరవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం వ్యవహారాలను నిర్వ హించే బాధ్యతను మళ్లీ ఇన్చార్జి వీసీకి అప్పగించమని కోరే హక్కు కూడా మనకు వచ్చింది. ఇది మాత్రమే విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ఉపకరిస్తుంది. ఇన్చార్జి వీసీ నియామకంతోనే ఆయనకు పూర్తి స్థాయి అధికారాలను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెంటనే అప్ప గించాలి కూడా. విద్యా విషయక కార్యకలాపాలు కూడా సాగించే అధికారాలను దఖలుపరిచే సమగ్ర ఆదేశాలను జారీ చేయాలి. దానితోనే డాక్టర్ అప్పారావు వైస్‌చాన్స్‌లర్‌గా కొనసాగడం కోసం చెప్పుకోవడానికి సాకు ఏదీ మిగలదు. ఈ పని నిర్వర్తించ డంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విఫలమైతే, ఈ దోబూచు లాట వెనకాల ఆ మంత్రిత్వ శాఖ ఉందని ఇప్పటికే భావిస్తున్న అనేక వర్గాల దృష్టిలో దోషిగా నిలబడవలసి దుస్థితిని తనకు తనే తెచ్చుకోవచ్చు. ఈ వైఫ ల్యాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా నిర్ధారించుకోవలసివస్తుంది. అంటే విద్యాహక్కును ఉల్లంఘించినట్టు నిర్ధారణకు రావలసి ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 12(1), (2) కింద హెచ్‌సీయూ విద్యార్థులకు ఆ హక్కును నిరాకరించి నందుకు దోషిగా నిలబడవలసి ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రేక్షకపాత్ర వహించిన దోషం కూడా ఉంటుంది. వీటితో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారం చెల్లించవలసి ఉంటుంది. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా లేదా కమిషన్ తనకు తానుగా కేసును పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న అవకతవకలకు తోడు ఈ పాపాన్ని కూడా మూట గట్టుకోరాదు. - కె.ఆర్. వేణుగోపాల్ వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి మొబైల్: 9052469165 -
ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు
ఆయన నక్సలైటు కాదు. కానీ పోరాడాడు. కలెక్టర్‌గా ఉంటూ వర్గపోరాటం చేశాడు. ఈమాట ప్రజలకైతే పొగడ్తే కానీ, ప్రభుత్వం దృష్టిలో వర్గపోరాటం తీవ్రవాదులు చేసేది. కానీ కేఆర్ వేణుగోపాల్ గారిపై ప్రభుత్వం ఈ అభియోగం మోపింది- కలెక్టర్ వర్గపోరాటం చేస్తున్నాడని. అంబేడ్కర్‌తో స్ఫూర్తి నొంది, అణగారిన వర్గాల పక్షపాతిగా నిలిచిన వేణుగోపాల్ నాడూ నేడూ అదే పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ రోజు అదే పేద ప్రజల కోసం ఉడకని మెతుకులు ఏరుకుంటూ బాలింతలకు, చిన్నారులకు నాలుగన్నం మెతుకులు పెట్టండహో అంటూ అక్షరం అక్షరం అభ్యర్థిస్తున్నాడు. కేఆర్ వేణుగోపాల్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్) అమలు తీరుతెన్నులపై రాసిన ‘ఉడకని మెతుకు’ పుస్తకావిష్కరణ సభ సందర్భంగా సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ముగ్గురు ప్రధానులు- చంద్రశేఖర్, వి.పి.సింగ్, పి.వి. నరసింహారావుల దగ్గర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, దేశ ప్రతినిధి వర్గానికి ఐక్యరాజ్యసమితిలో నేతృత్వం, కశ్మీర్ సమస్యలో ప్రత్యేకదూత... వాటిలో మీకు అత్యంత ఆనం దాన్నిచ్చే అంశం? జవాబు: వీపీ సింగ్ లాంటి గొప్ప ప్రధానుల దగ్గర పనిచేయ డం నాకు ఆనందదాయకం. అయితే ప్రజలకు నిరంతరం మేలు చేసే గొప్ప పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీఎస్‌కి అంకురార్పణే నాకు అత్యంత ఆనందా న్నిచ్చిన అంశం. ఈ దేశంలో దీని కన్నా గొప్ప పథకం మరొక టుంటుందని నేను భావించడం లేదు. ఆరోగ్యవంతమైన భావిభారత పౌరుల కోసం నిర్దేశించిన పథకం ఇది. గర్భి ణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించడమే ఈ పథకం రూపకల్పనకి ప్రధాన కారణం. 1970-72 ప్రాంతంలోనే దుర్గాబాయ్ దేశ్ ముఖ్ తెలంగాణలోని మహబూబ్ నగర్లో పైలట్ ప్రాజె క్టుగా దీన్ని మొదట ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1975లో ఇందిరాగాంధీ మొత్తం దేశంలోని 33 బ్లాకుల్లో దీన్ని ఆచర ణలో పెట్టారు. ప్రశ్న: ‘ఉడకని మెతుకు’ రాయడానికి ప్రేరేపించిన అంశాలేవి? జవాబు: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోపోతే అంగవైకల్యం కలిగి, అనారోగ్యకరమైన తరం జన్మిస్తుంది. పిల్లలే దేశ భవిష్యత్తు. దురదృష్టవశాత్తూ ఈ పథకం చచ్చిపోయింది. పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించేందుకు నేనే స్వయంగా గ్రామాల్లో తిరిగాను. అవినీతి ఈ పథకాన్ని అధఃపాతాళానికి తొక్కేసింది. అంగన్ వాడీ కార్యకర్తల నియామకమే అవినీ తిలో కూరుకుపోయింది. అనంతపురంలోనైతే అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగానికి 30 వేలు లంచం అడుగుతున్నారు. ప్రకాశం జిల్లాలో 70 వేలు. శ్రీకాకుళంలో లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇక మూడు వేల రూపాయలు తీసుకొని బానిస చాకిరీ చేసే అంగన్వాడీ కార్యకర్తల కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 154 అంగన్వాడీలను తనిఖీ చేశాం. చివరకు బాలింతల, పిల్లల బరువుతూచే యంత్రాలు సైతం అక్కడ అందుబాటులో లేవు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే కాదు అధికారులు అప్రమత్తంగా లేకపోతే, చిత్తశుద్ధితో పనిచేయకపోతే ప్రజలకు మేలు చేసే ఏ పథకం అయినా ఇలాగే నిర్జీవంగా మారిపోతుంది. ప్రశ్న: ఐసీడీఎస్‌తోపాటు ఇంకేదైనా ప్రభుత్వ పథక రూపకల్పనలో నైనా మీరు భాగస్వాములయ్యారా? జవాబు: ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ, నేను పీవీ నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగా పనిచేసేటప్పుడు ఇంతకన్నా అద్భుత మైన ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాం. 1991 నుంచి రెండేళ్లపాటు అనేక చర్చల తర్వాత 1993లో దీన్ని తీసుకొచ్చాం. కూలితో పాటు కూలీలకు అవసరమైన తృణధాన్యాలను కూడా ప్రభుత్వమే ఈ పథకం ద్వారా అం దిస్తుంది. కూలీలు తినడానికి ఎంత అవసరమైతే అంత ఇవ్వాలన్నది సూత్రం. ఇప్పుడున్నది మాత్రం ఎటువంటి హామీ లేని ఉపాధిహామీ పథకం. ప్రశ్న: దళితుల సమస్యల పట్ల మీకున్న నిబద్ధత, సాహసం కారణంగా మీమీద ప్రభుత్వమే కేసు పెట్టింది. ఆ అనుభవాలు చెపుతారా? జవాబు: గుంటూరు జిల్లా తోట్లవల్లూరులో అగ్రకుల భూస్వాములు ఆక్రమించిన లంక భూములను లాక్కొని దళితులకు స్వాధీ నం చేశాను. దురాక్రమణలోని భూముల్లో పంటలను ధ్వం సం చేసే హక్కు ప్రభుత్వమే కల్పించింది. అయితే నేను భూములు పేద దళితులకు పంచటమే కాకుండా అగ్రకు లస్థులు వేసిన 75 ఎకరాల్లోని పంటను సైతం దళితులకు పం చాను. భూస్వాములు కోర్టుకి వెళ్ళారు. కృష్ణా జిల్లా ఉయ్యూ రు దగ్గర దళిత మహిళలు బహిర్భూమికి వెళ్ళకుండా ప్రభు త్వ భూమికి అగ్రకుల పెత్తందార్లు కంచె వేశారు. దాన్ని పెరి కివేసి దళిత మహిళల పక్షాన నిలబడ్డాను. ఈ కేసులో నన్ను కలెక్టరుగానే పనికిరానని, నేను దళితుడినని అందుకే వారి పక్షాన పోరాడుతున్నానని అభియోగం మోపారు.అది నాకు బిరుదే. ప్రభుత్వాధి కారిగా ఉండేవాళ్లు చేయాల్సింది ప్రజల పక్షం వహించడమే. పెత్తందార్లు, భూస్వాములకు కొమ్ము కాయడం కాదు. ప్రశ్న: నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో మీరు పనిచేశారు. వారిపై మీ అభిప్రాయం? జవాబు: 70 వ దశకంలో భూసంస్కరణల చట్టం చేశారు. దళితులు, ఆదివాసీలకు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోకూడదు. కానీ ఇది ఈ రోజుకీ అమలు జరగడంలేదు. తీవ్రవాదాన్ని నేను సమర్థించను. కానీ, ప్రజల హక్కులు అణచివేసినప్పుడు తిరుగుబాటు వస్తుంది. ఎటువంటి అణచివేతకు తావు లేకుండా ప్రభుత్వం పనిచేయాలి. ప్రశ్న: మతోన్మాదం మీద, కులం మీద మీ అభిప్రాయం? జవాబు: ఈ దేశంలో ఐక్యత ఉందని మీరు నమ్ముతారా? ఇక్కడ కేవలం హిందువులే బ్రతకాలా? క్రైస్తవులు, ముస్లింలు ఉండకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేదుకదా? ఈ మధ్య క్రైస్తవులపై దాడులు చేయొచ్చని ఒక ప్రకటన చదివాను. ఇలాంటి ప్రకటనలు ఎటువంటి భద్రతనిస్తాయి? మతో న్మాదం, కులతత్వం దేశ అభివృద్ధికి అడ్డుగోడగా తయా రయ్యాయి.. దాన్ని బద్దలు కొట్టాలి. దళితుల పక్షాన నిలబడినందుకే ఎన్నో కేసులను ఎదుర్కొన్నాను. పేదల పక్షం వహించినందుకు శంకరన్ గారికి, కాకి మాధవరావు గారికి నక్సలైట ముద్రవేస్తే, నేను వర్గపోరాటం చేస్తున్నానని ఆరోపించారు. ఏమైనా నాది అణగారిన వర్గాల పక్షమే, దళితుల పక్షమే. ప్రత్యేకించి దళిత మహిళల, నోరులేని చిన్నా రుల పక్షమే. అందుకే వారికే ‘ఉడకని మెతుకు’ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను. అత్తలూరి అరుణ