రణరంగంగా మారిన హెచ్సీయూ
హైదరాబాద్: కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలల అనంతరం వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ అప్పారావు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దీంతో వీసీ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాంపస్లో ఆయన చాంబర్ను ధ్వంసం చేశారు. హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా వీసీ ఇంటి వద్ద కొంతమంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేశారు. కాగా ఈరోజు ఉదయం నుంచే హెచ్ సీయూ క్యాంపస్ లో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు...పోలీసులపై రాళ్లు రువ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులు, పలువురు మీడియా ప్రతినిధులు గాయాపడ్డారు. దీంతో హెచ్ సీయూ రణరంగంగా మారింది. మరోవైపు ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తాజా సంఘటనలపై వీసీ అప్పారావు స్పందిస్తూ విద్యార్థులు దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టులను ఆశ్రయించవచ్చని అన్నారు. తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని, చట్టాలను అందరూ గౌరవించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, వర్సిటీలో మంచి వాతావరణం కల్పించడానికి తాను బాధ్యతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం హెచ్ సీయూలో పర్యటించనున్నాడు.