రోహిత్ మృతిపై విద్యార్థి జేఏసీ, ఫ్యాకల్టీ సభ్యుల డిమాండ్
ఇన్‌చార్జి వీసీతో చర్చలు
నాలుగో రోజుకు చేరిన టీచర్స్ ఫోరం దీక్షలు
హైదరాబాద్: రోహిత్ ఘటనపై హెచ్‌సీయూ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ పెరియస్వామి ఆదివారం విద్యార్థి జేఏసీ సభ్యులు, అధ్యాపకులతో చర్చలు జరిపారు. వర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రోహిత్ స్మారకార్థం వర్సిటీలో ఏటా ఉపన్యాస కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని జేఏసీ సభ్యులు ప్రతిపాదించారు. రోహిత్ ఘటనపై నిజనిర్ధారణకు వర్సిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. క్రమశిక్షణ సంఘాన్ని మార్చి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని, పరిపాలన విభాగ పదవులకు రాజీనామా చేసిన ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీలను తిరిగి విధుల్లో తీసుకోవాలని, వారి రాజీనామా పత్రాలను తిరస్కరించాలన్నారు. అలాగే వర్సి టీ స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లేలా వ్యవహరించిన వీసీ అప్పారావుపై కేంద్ర మానవ వనరుల శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ)కి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. తరగతులకు నష్టం కలగని విధంగా సెమిస్టర్ కాల వ్యవధిని పొడిగించాలన్నారు. ఫ్యాకల్టీ, జేఏసీ నాయకుల ప్రతిపాదనలను చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు.
అప్పారావును తొలగించాల్సిందే..
ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వర్సిటీలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. అధ్యాపకులు తిరుమల్, అనుపమ, కేవై రత్నం, లీమావాలీ దీక్షలు కొనసాగిస్తున్నారు. వీసీ అప్పారావును శాశ్వతంగా తొలగించాలని, సెలవులో ఉన్న ఇన్‌చార్జి వీసీ శ్రీవాత్సవను తిరిగి విధుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేదాకా దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
నిజనిర్ధారణ కమిటీ వేయాలి
Published Mon, Feb 1 2016 4:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement