తరిమి తరిమి కొట్టారు
- హెచ్‌సీయూలో విద్యార్థులపై మళ్లీ విరిగిన లాఠీ
- వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో ఉద్రిక్తత
- పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళన.. వీసీ నివాసంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వీసీ నివాసం ముందు నిరసన
- విద్యార్థులను చెదరగొట్టేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిన ఖాకీలు
- ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు
- వీసీకి మద్దతుగా నిలిచిన నాన్‌టీచింగ్ స్టాఫ్, ఏబీవీపీ, లైఫ్‌సైన్స్ విద్యార్థులు
- రెండు కేసులు నమోదు.. అదుపులో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు
- నేడు వర్సిటీలో రోహిత్ తల్లి దీక్ష.. కన్హయ్య కుమార్ రాక
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ మళ్లీ రణరంగమైంది! విద్యార్థులపై లాఠీలు విరిగాయి. ఖాకీలు విచక్షణారహితంగా దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఒక్కసారిగా విరుచుకుపడి విద్యార్థులను తరిమితరిమి కొట్టారు. ఈ లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. రోహిత్ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వర్సిటీకి మంగళవారం వైస్ చాన్స్‌లర్(వీసీ) అప్పారావు రావడం, రహస్యంగా బాధ్యతలు చేపట్టడం ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.
వీసీ నివాసంపై విద్యార్థుల దాడి, వారిపై పోలీసుల లాఠీచార్జి, ప్రతిగా విద్యార్థుల రాళ్లదాడితో యూనివర్సిటీ రోజంతా అట్టుడికిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 26 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ప్రొఫెసర్లనూ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీసీకి మద్దతుగా నిలిచిన నాన్-టీచింగ్ స్టాఫ్ మంగళవారం సాయంత్రం నుంచి సహాయ నిరాకరణ పేరుతో మెస్‌ల బంద్‌కు పిలుపునిచ్చారు.
కాక రేపిన వీసీ రాక
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ పొదిలె అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కొందరు విద్యార్థులు దాడికి యత్నించారు. దీన్ని ఖండిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. అప్పారావు నివాసంలోనే ఉండడం గమనించిన విద్యార్థులు అటువైపు చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వీసీకి మద్దతుగా ఏబీవీపీ, నాన్ టీచింగ్ స్టాఫ్
విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో కొందరు నాన్ టీచింగ్ ఉద్యోగులు వైస్ చాన్స్‌లర్‌కు మద్దతుగా నిలిచారు. వీసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ సిబ్బంది తాము వర్సిటీ మెస్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనల క్రమంలో హెచ్‌సీయూ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అలోక్‌పాండే అస్వస్థతకు లోనై కుప్పకూలారు. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది వర్సిటీలోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. వీసీకి స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్స్ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచారు. నివాసంలో వారు వీసీ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, వ్యతిరేకంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఏఎస్‌ఏ మధ్య తోపులాట జరిగింది.
లాఠీలతో విరుచుపడ్డ పోలీసులు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వీసీ నివాసం వద్దే ఆందోళనలు చేపట్టారు. 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకునే సమయంలో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుపోయారు. విద్యార్థినులను మహిళా పోలీసులు వారి జడలు పట్టుకుని లాక్కెళ్లారు. లాఠీచార్జిలో భాస్కర్, షోహన్, సంజయ్, వరుణ్, అక్షిత, హాసిని, ఫైజల్ అనే విద్యార్థులతోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి.
విద్యార్థులకు మద్దతు పలికేందుకు వెళ్లిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు గేట్ వద్దే అడ్డుకున్నారు. హెచ్‌సీయూలో బుధవారం జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వర్సిటీలకు చెందిన విద్యార్థులు మంగళవారమే హెచ్‌సీయూకు చేరుకున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కూడా వారినీ అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు కార్డులు సమర్పించాలని, అప్పుడే వదులుతామంటూ వేధించారు. మొత్తమ్మీద యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వర్సిటీలో పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైతం తొలిసారిగా వర్శిటీకి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు.