రోహితే నా ఆదర్శం
* అఫ్జల్ గురు కాదు: విద్యార్థి నేత కన్హయ్య
* నేను దేశవ్యతిరేకిని కాదు
* రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి గురువారం బెయిలుపై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల నాకు ఆదర్శం.
నేను ఉగ్రవాదిని కాను. నేను దేశ వ్యతిరేకిని కాదు. దేశ సరిహద్దును రక్షిస్తున్న జవాన్లు, దేశ ప్రజలందరికీ అన్నం పెట్టేందుకు శ్రమిస్తున్న రైతుల కోసం పోరాడే నిజమైన రైతు బిడ్డను. దేశంలో పేదరికం, అవినీతి నుంచి స్వేచ్ఛ లభించాలని మేం (విద్యార్థులు) కోరుకుంటున్నాం. న్యాయం కోరే వాళ్ల గొంతు నొక్కేందుకు బ్రిటిషర్లు రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించేవారు. విద్యార్థుల వాణిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజద్రోహం చట్టాన్ని వాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజ్యాంగం ప్రకారం అఫ్జల్ గురు భారతీయుడు. అతనికి జరిగినదంతా (ఉరిశిక్ష విధింపు) దేశ చట్టం ప్రకారమే జరిగింది.
మీరు (ప్రభుత్వం) ఎంత మంది రోహిత్‌లను చంపితే ఇంటింటి నుంచి అంతమంది రోహిత్‌లు పుట్టుకొస్తారు’ అని అన్నారు. రాజకీయాల్లో వస్తారా అని అడగ్గా.. ‘నేను రాజకీయ నాయకుడిని కాను. పీహెచ్‌డీ విద్యార్థిని. రాజకీయాల్లోకి వచ్చే లేదా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. చదువే నా లక్ష్యం. చదవాలని కోరిక వున్నా చదవలేకపోతున్న వారి కోసం పోరాడ్డమే నా పని’ అని పేర్కొన్నారు. ఏబీవీపీ ప్రచారం చేస్తున్న అఖండ భారత్ విధానానికి తాను వ్యతిరేకినన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. దీనిపై ఆరెస్సెస్ ప్రభావం ఉండదని విశ్వసిస్తున్నానని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
దేశ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను నాగ్‌పూర్‌లో కూర్చున్న ఆరెస్సెస్ నాయకులు నిర్ణయించజాలరన్నారు. ‘మా సిద్ధాంతానికి అనుగుణంగా గొంతెత్తితే.. తరచూ జైలుకు వెళ్లి రావటం తప్పకపోవచ్చు’ అని తెలిపారు.
మా తరఫున ప్రచారం చేస్తారు: లెఫ్ట్
కన్హయ్య వామపక్ష కార్యకర్త కనుక సహజంగా ఆయన వచ్చే ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తరఫున ప్రచారం చేస్తారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. కన్హయ్య ప్రచారం చేయాలని డిమాండ్ల వస్తున్నాయని సీపీఐ నేత డి.రాజా తెలిపారు.
ఐఐఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా
న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ.. జేఎన్‌యూ, ఎఫ్‌టీఐఐల్లో జరిగిన నిరసనలకు సహకరించినందుకు ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ సేన్‌గుప్తా రాజీనామా చేశారు.
‘జోక్యం’ నుంచి ఆజాదీ కావాలి: కేజ్రీవాల్
‘లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నుంచి ఆజాదీ కావాలి, కేంద్ర జోక్యం నుంచి ఆజదీ కావాలి’ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కన్హయ్య తరహా నినాదాలతో ట్వీట్ చేశారు.