ఆ తప్పుడు కేసులను ఎత్తివేయాలి
- రోహిత్ కేసులో పోలీసుల తాత్సారంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
- ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రౌండ్‌టేబుల్ సదస్సు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి చెలరేగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. వాటన్నింటినీ ఎత్తివేయాలని హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కృష్ణ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు నిరంకుశత్వంపై ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపాలని, రోహిత్ దళితుడేనని నేషనల్ ఎస్సీ కమిషన్, గుంటూరు తహసీల్దారు, గుంటూరు జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పిన తరువాతైనా పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీసీని రీకాల్ చేస్తానని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. కాకి మాధవరావు మాట్లాడుతూ ఎ.కె.రూపన్వాల్‌ని న్యాయమూర్తిగా సంబోధించలేనని, ఆయనకు న్యాయపరిజ్ఞానం లేకపోగా, కనీసం మానవత్వం కూడా లేదని ఆరోపించారు.
విద్యార్థులకు అండగా ఉంటాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాల్సిన యూనివర్సిటీలను పోలీసు క్యాంపులుగా మార్చడంవల్ల ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలోకి అడుగుపెడుతున్న తొలితరం దళిత, బీసీ విద్యార్థులు భీతిల్లి పోతున్నారన్నారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి జేఏసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. అప్పారావు వీసీగా కొనసాగడం దేశానికే అవమానమని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ఈ వివక్షపై విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొ. డి నరసింహరెడ్డి మాట్లాడుతూ అన్యాయం జరుగుతోంటే ప్రేక్షకపాత్ర వహించడం తగదని మేధావులకు హితవు పలికారు.