ఫీజు ప్లీజ్!
- ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులివ్వని ప్రభుత్వం
- విద్యార్థుల సర్టిఫికెట్లను అట్టిపెట్టుకుంటున్న కళాశాలలు
- ఉద్యోగం వచ్చినా వెళ్లలేని స్థితి
- ఆందోళనలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఫీజురీయింబర్స్‌మెంట్‌పై సర్కారు చేస్తున్న జాప్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కోర్సు చదువుతున్న విద్యార్థుల సంగతి అటుంచితే.. చదువు పూర్తిచేసి ఉద్యోగాల బాట పట్టే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. చదువు ముగిసినా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. ఫీజు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లివ్వమని తేల్చిచెప్పడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది.
పరిశీలన స్థాయిలోనే..
కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై గందరగోళం నెలకొంది. స్థానికత నిబంధనలంటూ కొంతకాలం గడిపిన సర్కారు.. 2014-15 విద్యాసంవత్సరం ముగిసే సమయంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు తెరలేపింది. ఈ క్రమంలో కోర్సు ముగిసిన తర్వాత ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వృత్తి విద్యనభ్యసిస్తున్న వారంతా దాదాపు కోర్సు చివరి దశలు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా జూన్ 17వరకు దరఖాస్తుల కాలం ముగిసిన తర్వాత సర్కారు.. ఇప్పుడు పరిశీలన పేరిట జాప్యం చేస్తోంది.
తలలు పట్టుకుంటున్న ఇంజినీర్లు..
కోర్సు ముగిసిన వెంటనే ఉద్యోగాల బాటపట్టేవారిలో ఇంజినీరింగ్ విద్యార్థులే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో పలు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అర్హత సర్టిఫికెట్ల ఆవశ్యకత ఉంటుంది. కానీ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ కాలేజీల్లోనే ఉన్నాయి. ఫీజు చెల్లిస్తే తప్ప వాటినివ్వమని తెగేసి చెప్పడంతో ఆయా విద్యార్థులు తలలుబాదుకుంటున్నారు. ఒకవైపు ప్రవేశాల శాతం తగ్గిపోతుండడంతో ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటున్నామని, ఈ పరిస్థితిలో విద్యార్థులపై ఒత్తిడి తేవాల్సివస్తోందని ఓ కళాశాల డెరైక్టర్ ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
బకాయిలు రూ.699 కోట్లు
జిల్లాలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంక్షేమశాఖలు భారీగా బకాయి పడ్డాయి. విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో, కాలేజీలకు ఫీజుల రూపంలో ఏకంగా రూ. 689కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో అధికంగా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ బీసీలకు రూ. 301.5కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈబీసీలకు 310.2కోట్లు చెల్లించాలి. 2014-15 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు కేవలం రూ. 31కోట్లు మాత్రమే విడుదలైనప్పటికీ.. పైమొత్తం బకాయి పడింది. అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి సంస్థ రూ.58 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ 29కోట్ల బకాయిలున్నాయి. బకాయిలు భారీగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం.