certificates
-
దర్జాగా సర్టిఫికెట్ల దందా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. సర్వీసు చార్జీల కింద రూ.45 తీసుకోవాల్సి ఉండగా సర్టిఫికెట్‌కు రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ముందుగా నిర్వహించే జేఈఈ మెయిన్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే పిల్లల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్రాల నిర్వాహకులు భారీ దందాకు తెరలేపారు. తల్లిదండ్రులకు అవసరం కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొన్నిచోట్ల రూ.4,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది, అంటెండర్లతో కుమ్మౖMð్క ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జేఈఈ మెయిన్ అని కాకుండా సాధారణ రోజుల్లో సైతం తహశీల్దార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకుని కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టకపోతే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచేస్తున్నారని, కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులుండటం గమనార్హం. పౌరసేవకు ఎగనామం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం పౌరసేవల పరిధిలోకి తెచ్చింది. నామమాత్రపు రుసుంతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. అయితే దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు తహసీల్ కార్యాలయాల సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రూ.45 సర్వీసు చార్జీ ఉండే ఓబీసీ సర్టిఫికెట్ కావాలంటే పట్టణ ప్రాంతాల్లోని పలుచోట్ల రూ.4,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. తామే ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, ఆమోదించేలా చూస్తామని చెప్పి వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 70 వేల మంది తల్లిదండ్రులపై ప్రభావం అక్టోబర్ 28వ తేదీన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ అయింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనుంది. కాగా ఏదైనా రిజర్వేషన్ వర్తించాలంటే సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 వేల మంది హాజరు కానుండగా, అందులో దాదాపు 70 వేలమందికి ఈ సర్టిఫికెట్లు అవసరమని అంచనా. దీనిని అసరాగా చేసుకొని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్ కార్యాలయాల సిబ్బంది దందాకు తెరతీశారు. సొమ్ము దండుకున్నా దబాయింపులేహైదరాబాద్లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి కోసం (జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేందుకు) ఓబీసీ సర్టిఫికెట్ అవసరమైంది. దరఖాస్తు చేద్దామని స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడి నిర్వాహకుడు.. ‘మేమే దరఖాస్తు చేస్తాం.. దరఖాస్తు ఫారాన్ని మేమే తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఆన్లైన్లో ఆమోదం పొందేలా చేస్తాం.. అందుకు రూ.1,000 ఖర్చు అవుతుంది’అని చెప్పాడు. రూ.45 దరఖాస్తుకు అంత చెల్లించాలా? అని శ్రీనివాస్.. బాలానగర్‌లోని మరో మీ సేవ కేంద్రానికి వెళ్లి అడగ్గా అక్కడా ఇదే సమాధానం ఎదురైంది. గత్యంతరం లేక రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేశాడు. 12 రోజులు గడిచినా దరఖాస్తును కార్యాలయ సిబ్బంది కనీసం ఓపెన్ కూడా చేయలేదు. మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని అడిగితే ‘అవుతుందిలే.. చేస్తాం.. తహసీల్దార్ కార్యాలయంలో చేయించే వ్యక్తి బిజీగా ఉన్నాడు..’అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిషోర్ అనే వ్యక్తిని కలిశారు. అతను ‘మీరు నేరుగా ఎలా వస్తారు..’అంటూ మండిపడ్డాడు. దీంతో శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని సంప్రదించారు. అంతా కుమ్మక్కే కావడంతో.. ‘మీ దరఖాస్తు ఫారమే లేదు. మీరివ్వలేదు..’అంటూ వాళ్లు బుకాయించారు. రెండురోజులు తిరిగి విసిగిపోయిన శ్రీనివాస్ చివరకు తహసీల్దార్‌ను కలిసి పరిస్థితి వివరించాడు. ఆన్లైన్ ఫారం ప్రింట్ తీసి ఫైల్ సిద్ధం చేయాలని తహసీల్దార్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అయినా వారు పలు కొర్రీలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మళ్లీ తహసీల్దార్‌ను కలవడంతో ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ అయ్యింది. -
ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19 నుంచి ఆయుష్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలనఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. -
ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: పేరు మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం తన విద్యా సర్టిఫికెట్లలో ఆ మేరకు మార్పు చేయట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి చివరకు న్యాయం లభించింది. రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఎస్ఎస్సీ బోర్డు కొత్త సర్టిఫికెట్ జారీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పిటిషనర్ విజ్ఞప్తిని సర్కార్ అంగీకరించినందున విచారణ ముగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదీ నేపథ్యం.. తన పేరు మార్చుకున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు సర్టిఫికెట్లలో మార్పులు చేయట్లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వి. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్య 1961 నాటి జీవో 1263 ప్రకారం చట్టవిరుద్ధమన్నారు. ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆ విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో పేరు మార్చడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు గత విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.అరవింద్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కోరినట్లు మారిన పేరుపై రెండు వారాల్లో సర్టిఫికెట్ జారీ చేస్తామని ఎస్‌జీపీ బదులిచ్చారు. దీంతో ధర్మాసనం.. పిటిషన్లో విచారణను ముగించింది. -
సర్టిఫికెట్లు ఇప్పించండి
భైంసా: బాసర ట్రిపుల్ఐటీ పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ తన సర్టిఫికెట్లు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో క్యాంపస్ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనెల 22న హైకోర్టును ఆశ్రయించాడు. సర్టిఫికెట్లు లేక తాను ఉద్యోగరీత్యా విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లలేకపోతున్నానని పిటిషన్లో పేర్కొన్నాడు. గురువారం కోర్టు పిటిషన్‌పై విచారణ జరిపింది. నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం పేరడిపెల్లి గ్రామానికి చెందిన ఫణికుమార్ 2017లో ట్రిపుల్‌ఐటీలో చేరాడు. 2023 వరకు ఇంజినీరింగ్ పూర్తిచేశాడని, సెమ్ టాపర్‌గా డైరెక్టర్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రూ.86 వేల ఫీజు బకాయిలు ప్రభుత్వం మంజూరు చేసినా ఆ నిధులు ఇంకా క్యాంపస్‌కు జమకాలేదని తెలిపారు. దీంతో ఒరిజినల్ డిగ్రీ, టీసీ, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని వివరించారు. ఎంతో మంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉందని కోర్టుకు తెలిపారు. చాలా మంది సొంతంగా డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ల తీసుకెళ్లారని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో సంప్రదించాలని న్యాయస్థానం పిటిషనర్‌కు సూచించింది. ట్రిపుల్ ఐటీకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆర్టీయూకేటీ ఇన్చార్జి వీసీ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదలచేశారు. బాసర పూర్వ విద్యార్థి హైకోర్టులో కేసు ఫైల్‌చేసిన నేపథ్యంలో న్యాయస్థానం సూచనలుపాటిస్తూ విశ్వవిద్యాలయ నియమనిబంధనలు అనుసరిస్తూ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘డిజీ’ లాకర్‌తో సర్టీఫికెట్లు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్వ్యూకి వెళ్లే విద్యార్థి చేతిలో ఫైల్...అందులో విద్యాభ్యాసానికి చెందిన అన్ని సర్టిఫికెట్లు... అవన్నీ ఆర్డర్లో ఉన్నాయా లేదా? అని ముఖంలో కంగారు... అయితే.. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఏఐ సాంకేతికతతో మారబోతోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెబుతోంది. మౌస్ క్లిక్‌తో క్లౌడ్‌కు కనెక్ట్ అవ్వడం... టెన్త్ దగ్గర్నుంచీ పీహెచ్డీ దాకా డిజిటల్‌గా చూసే విధానానికి నాంది పలుకుతోంది.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డీజీ’లాకర్‌ను అందుబాటులోకి తేవాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టులను మొదలు పెట్టాయి. ఇందులోని సవాళ్లను పరిశీలించిన తర్వాత మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో డిజీ లాకర్స్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఎందుకీ లాకర్స్? దీనిద్వారా విద్యార్థి సర్టీఫికెట్లన్నీ డిజిటల్‌గా పొందే వీలుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తేలికగా క్లౌడ్ ద్వారా సర్టీఫికెట్ల ధ్రువీకరణ చేయొచ్చు. నకిలీ సర్టిఫికెట్లు ఉండే అవకాశమే ఉండదు. విద్యారి్థకి టెన్త్ క్లాస్ నుంచే ఒక యూనిక్ ఐడీ కోడ్ ఇస్తారు. దీనిద్వారా క్లౌడ్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి టెన్త్, ఇంటర్ బోర్డ్‌లు, యూనివర్సిటీలు సంబంధిత ఐడీకీ సర్టీఫికెట్లను అప్లోడ్ చేస్తాయి. డీజీ లాకర్ వ్యవస్థ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధీనంలో, పూర్తి సురక్షితంగా ఉంటుంది.దీంతో సర్టిఫికెట్లు దెబ్బతిన్నాయని, పోయాయని ఆందోళన పడాల్సిన అవసరమే ఉండదు. విదేశీలకు వెళ్లినా కేవలం యూఆర్ఎల్ లింక్ ద్వారా సర్టీఫికెట్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం 2024 పాస్ అవుట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పదేళ్లలోపు చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు కూడా యూజీసీ భరిస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాక్టికల్‌గా ఎన్నో సవాళ్లు.. డిజీ లాకర్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రాక్టికల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆధార్ నంబర్‌ను దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌కు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో... దాన్నే లాకర్‌కు ఇవ్వాలి. కానీ విద్యార్థుల్లో చాలామంది తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తున్నారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగం అధికారి సాహూ తెలిపారు. మరోవైపు టెన్త్, ఇంటర్ బోర్డ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక యంత్రాంగం ఇప్పటివరకూ లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో జరిగే దోస్త్ డేటాను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజీ లాకర్ ఎలా పనిచేస్తుంది? విద్యార్థి అన్ని సర్టీఫికెట్లు ఒక క్లౌడ్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. విద్యార్థి డీజీ లాకర్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. డీజీ లాకర్ విభాగం ఇచ్చే లాగిన్ పాస్‌వర్డ్‌ను మార్చుకుని భద్రపర్చుకుంటాడు. అవసరమైన సర్టీఫికెట్లను తను ఇంటర్వ్యూ లేదా అడ్మిషన్ పొందే సంస్థలకు మౌస్క్లిక్ లింక్ ద్వారా పంపుకోవచ్చు. యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆయా సంస్థలు సర్టీఫికెట్లన్నీ ఆన్లైన్లోనే తనిఖీలు నిర్వహిస్తాయి. ఒక విభాగాన్ని పరిశీలిస్తున్నాం డిజీ లాకర్‌కు విద్యార్థుల డేటాను డిసెంబర్ నాటికి అప్లోడ్ చేయమని యూజీసీ తెలిపింది. ఇందులో భాగంగా పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఉపయుక్తమైన ప్రాజెక్టు. అయితే, తొలి దశలో అనేక సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. – డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి (రెక్టార్, జేఎన్టీయూహెచ్) తొలుత పీజీ విద్యార్థుల సమాచారండిజీ లాకర్ పరిధిలో తొలి విడతగా పీజీ విద్యార్థుల సమాచారం తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి తర్వాత దశకు వెళ్తాం. విద్యార్థుల సర్టీఫికెట్లు సురక్షితంగా, తేలికగా పొందేందుకు డీజీ లాకర్ తోడ్పడుతుంది. – ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్) -
సర్టిఫికెట్లు మున్నేరుపాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి. టెన్త్ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా.. కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక వచ్చేసరికి వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. మరికొందరికి చెందిన సర్టిఫికెట్లు పూర్తిగా తడిసిపోయాయి. అలాగే పుస్తకాలు, కోచింగ్ మెటీరియల్, స్కూల్ యూనిఫారాలు, కంప్యూటర్లు/ల్యాప్‌టాప్‌లు కొట్టుకుపోవడం లేదా బురదమయం అయ్యాయి. దీంతో విద్యార్థులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. పైచదువులకు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనేందుకు సర్టిఫికెట్లు లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతున్నారు.చదువుల తల్లులకు ఎంత కష్టం.. ఖమ్మం మున్నేటి ఒడ్డున వెంకటేశ్వరనగర్‌లో గట్టు రేణుక టైలరింగ్ చేస్తూ ఇద్దరు కూతుర్లను ఉన్నత విద్య చదివించింది. వారిలో తేజశ్రీ మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయగా.. పావని అదే కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ మెరిట్ స్టూడెంట్స్ కావడంతో ఉచిత సీట్లు సంపాదించారు. తేజశ్రీకి చెందిన ఎంబీబీఎస్, ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. ఎంబీబీఎస్ స్టడీ మెటీరియల్ బురదమయమైంది. పావని సర్టిఫికెట్లు బురదలో కూరుకుపోయాయి. లాప్‌టాప్‌తోపాటు స్టడీ మెటీరియల్ కలిపి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఇంట్లో 90 శాతం మేర సామగ్రి కొట్టుకుపోవడంతో తమను ఆదుకోవాలని రేణుక, వారి పిల్లలు అధికారులను వేడుకుంటున్నారు.ఉద్యోగానికి రమ్మనే లోపే.. ఖమ్మం వెంకటేశ్వరనగర్‌కు చెందిన పోరండ్ల వినయ్‌కుమార్ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఆయనకు ఈ నెల 2న సరి్టఫికెట్లతో రావాలని పిలుపు వచ్చింది. ఇంతలోనే ఆదివారం (1వ తేదీన) వారి ఇంటిని వరద తాకింది. గంటగంటకు వరద తీవ్రత పెరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వినయ్‌కుమార్ తల్లిదండ్రు లతో కలిసి పునరావాస కేంద్రానికి వెళ్లగా ఆయన సరి్టఫికెట్లు కొట్టుకుపోయాయి. రూ.70 వేల విలువైన రెండు లాప్‌టాప్‌లు కూడా మున్నేటి పాలయ్యాయి. స్టీల్ షాపులో పనిచేస్తూ తనను తల్లిదండ్రులు చదివించారని.. ఇప్పుడు ఉద్యోగానికి ఎలా అర్హత సాధించాలో తెలియడం లేదని వినయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఇక ఆన్లైన్లోనే.. ఆ సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు మాన్యువల్‌గా రెవెన్యూవర్గాలు జారీ చేస్తున్న 9 రకాల సర్టీఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విద్య, ఉద్యోగార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలకు తోడు రెవెన్యూ సంబంధిత రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారానే ఆన్లైన్లో ఇస్తున్నారు. అయితే, ఈ సర్టీఫికెట్లు ఏడాదిలోపు రెండోసారి తీసుకుంటే మాత్రం మాన్యువల్‌గా తహసీల్దార్ కార్యాలయాలే ఇస్తున్నాయి. ఇప్పుడు ఏడాదిలోపు తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్యాప్ సర్టీఫికెట్, పేరు మారి్పడి పత్రం, స్థానికత నిర్ధారణ, క్రీమీలేయర్–నాన్క్రీమీలేయర్, మార్కెట్‌వాల్యూ సర్టీఫైడ్కాపీ, ఖాస్రా, సెస్లా పహాణీలు, ఆర్వోఆర్–ఐబీ రికార్డులు ఇక నుంచి మీసేవకేంద్రాల ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారం, సర్టీఫికెట్ ఫార్మాట్లను తమకు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగా ముందుకెళ్లాలని సీసీఎల్ఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సర్టీఫికెట్ల కోసం మీసేవకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచే వాటిని జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. -
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా తొలిసారి.. 14 మందికి భారత పౌరసత్వం సర్టిఫికెట్‌ను బుధవారం అందజేసింది.సీఏఏ చట్టం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.కాగా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది.2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. అనంతరం దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. సీఏఏ అమలుపై గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
పంట ఏదైనా.. మూడింతల ఆదాయం
సాక్షి, అమరావతి: అన్నదాత కల ఫలిస్తోంది. నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు పంటల్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతోంది. పండించిన పంటకు ప్రీమియం ధర దక్కుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జారీ చేస్తున్న గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్‌తో రైతుల తలరాత మారుతోంది. సర్టిఫికెట్స్ జారీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లూ ధ్రువీకరించే వ్యవస్థ లేక సాగు విధానాలను బట్టి పంట ఉత్పత్తులను ధ్రువీకరించే వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నప్పటికీ అత్యధిక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను దేశీయంగానే విక్రయించు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ సేంద్రియ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయాలని, రెండో దశలో పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్యూసీఐ గుర్తింపుతో.. ఇండో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ ఎస్వోపీసీఏకు ఇటీవలే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అక్రిడిటేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోనే గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మలిదశలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఎపెడా (ప్రొసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) నుంచి అక్రిడిటేషన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్టిఫికేషన్ జారీపై ఎంపిక చేసిన అధికారులు, రైతులకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో),భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో వివిధ స్థాయిల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్ పొందేందుకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా.. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా.. తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వార్ని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా నియమించారు. నంద్యాల జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఈ రైతు పేరు కురాకుల ఓబులేసు. రెండెకరాల్లో కొర్రలు సాగు చేశాడు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం గుర్తించిన క్లస్టర్లో ఆయన పొలం కూడా ఉంది. పొలం బడిలో చెప్పినట్టుగా తగిన మోతాదులో ఎరువులు వినియోగించాడు. ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారీ చేశాడు. మొత్తంగా ఎకరాకు రూ.4,500 పెట్టుబడి అయ్యింది. 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక పురుగు మందుల అవశేషాల పరీక్ష చేయించాడు. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేవని ల్యాబ్‌లో నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. కొర్రలు కనీస మద్దతు ధర రూ.2.500 ఉండగా.. ఈ సర్టిఫికేషన్ వల్ల క్వింటా రూ.7వేలకు అమ్ముకోగలిగాడు. పెట్టుబడి రూ.9 వేలు పోగా.. నికరంగా రూ.47 వేల ఆదాయం వచ్చింది. ఓబులేసు మాట్లాడుతూ.. ‘గతంలో పంటల్ని కనీస మద్దతు ధరకు కూడా కొనేవారు కాదు. ఈ ఏడాది గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల మంచి ఆదాయం వచ్చింది’ అంటూ ఆనందంగా చెప్పాడు. ఎమ్మెస్పీ కంటే రెండింతల ఆదాయం.. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్లలో ఎంపిక చేసిన రెండు క్లస్టర్స్‌లో 49 మంది రైతులు 63 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితుల కారణంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,500 కాగా.. రైతులు క్వింటాకు రూ.2,900 నుంచి రూ.4,500 చొప్పున అదనంగా లబ్ధి పొందగలిగారు. 33 మంది రైతులు క్వింటా రూ.5,400 చొప్పున 161 క్వింటాళ్లను, ఏడుగురు రైతులు క్వింటా రూ.6 వేల చొప్పున 43 క్వింటాళ్లు, ఐదుగురు రైతులు క్వింటా రూ.6,300 చొప్పున 28 క్వింటాళ్లు, ఓ రైతు క్వింటా రూ.7 వేల చొప్పున 6 క్వింటాళ్లను విక్రయించారు. ఇలా ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.7.51 లక్షల ఆదాయాన్ని పొందారు. సర్టిఫికేషన్‌తో వ్యాపారులు సైతం పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోత కొచ్చిన కొర్రలను రైతులు ఎమ్మెస్పీకి రెండింతల ధరకు అమ్ముకోగలిగారు. 0.1 శాతం కంటే తక్కువ అవశేషాలు నాలుగేళ్లుగా వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని గడచిన ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాల్లో ‘గ్యాప్ క్లస్టర్స్’ను ఎంపిక చేశారు. ఈ క్లస్టర్లో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం 1,487.47 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ, మిరప, అరటి, పసుపు, కూరగాయ పంటలను గుర్తించారు. వ్యవసాయ పంటలు సాగు చేసే 622 మంది రైతులతో 20, ఉద్యాన పంటలు సాగు చేసే 190 మందితో 13 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఏపీ ఎస్‌ఓపీసీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. గడచిన ఖరీఫ్ సీజన్ నుంచే గ్యాప్ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగించేలా అవగాహన కల్పించారు. వివిధ దశల్లో రైతు క్షేత్రాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. పురుగు మందుల అవశేషాల స్థాయి 0.1శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. 99.99 శాతం ఆర్గానిక్ ఉత్పత్తులుగా గుర్తిస్తూ వారికి సర్టిఫికేషన్ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మలి దశలో రైతులను మార్కెటింగ్ ఏజెన్సీలు, ఎగుమతిదారులతో అనుసంధానం చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్‌తో వారు పండించే ఉత్పత్తులకు మార్కెట్లో ప్రీమియం ధర లభించడంతోపాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా సర్టిఫికేషన్ జారీ గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి క్యూసీఐ అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్‌తో మన రైతులు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఏర్పడింది. గడచిన ఖరీఫ్‌లో 1,487 ఎకరాల్లో 812 మంది రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్టిఫికేషన్ జారీ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – త్రివిక్రమ్‌రెడ్డి, ఎండీ, ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్!
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువుల నియామకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పా ట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే అర్హత పరీక్షలన్నీ నిర్వహించిన బోర్డు... మెజార్టీ సబ్జెక్టు లకు సంబంధించి తుది కీలను సైతం విడుదల చేసింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేట గిరీలకు సంబంధించి కోర్టు పరిధిలో కేసులుండటంతో ఆయా పరీక్షల తుది కీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఫైనల్ కీలు ఖరారు చేసిన సబ్జెక్టులకు సంబంధించి మెరిట్ జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. 9,210 పోస్టుల భర్తీకి.. గురుకుల విద్యా సంస్థల్లో ప్రధానంగా 9 విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్ఈఐ ఆర్బీ 9 రకాల ప్రకటనలు జారీ చేసింది. ఇందులో 61 సబ్జెక్టుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేస్తూ మెరిట్ జాబితాలు విడుదల చేస్తారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టీఫికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తొలుత జిల్లాల వారీగా పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం... మరోవైపు రెండు వారాల పాటు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తుండడంతో హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు పరిశీలన కేంద్రం ఏర్పాటు, నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో తేదీల ఎంపిక... వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థి ముందుగా టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్తికి అనుకూలంగా ఉన్న ఒక రోజును ఎంపిక చేసుకుని ఆమేరకు పరిశీలనకు హాజరుకావాలి. ఈనెల మూడో వారం నాటికి మెరిట్ జాబితాలు రెడీ చేసేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మెరిట్ జాబితాలు ఖరారైన తదుపరి వారంలోనే పరిశీలన ప్రక్రియ ప్రారంభించనుంది. -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస
వరంగల్ డెస్క్: ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, జయశంకర్భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ నగరంలోని ముంపుకాలనీల వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. వరధ ఉధృతికి ఇంట్లోని భూమి పట్టాదార్పాస్పుస్తకాలు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా అన్ని రకాల విలువైన పత్రాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల తడిసి పనికి రాకుండాపోయాయి. ఈ క్రమంలో తమకు కనీసం ధ్రువీకరణపత్రం కూడా లేకుండాపోయిందని పలువురు వరద బాధితులు అంటుండగా, పై చదువులకు ఎలా వెళ్లేది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటో వరంగల్ నగరంలోని బీఆర్‌నగర్.వరద బాధితులు ఇలా ఇంట్లో తడిసిన అన్ని పత్రాలను మంచంపై పరిచి ఆరబెట్టారు. ఇటీవల వరదలకు ఈ కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో కాలనీవాసులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గాక ఇంటికి చేరుకున్న వారికి ఏ వస్తువు చూసినా బురదతో నిండి ఉంది. ఇంట్లోని ధ్రువీకరణ పత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలుఅన్నీ తడిసిపోయాయి. సర్వే చేస్తున్నాం మోరంచపల్లి గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే ఆధారంగా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు వచ్చేలా కృషి చేస్తాం. తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తాం.. కొండాయి, మోరంచపల్లి, వరంగల్‌లో.. గత 27వ తేదీన వరద బీభత్సానికి కొండాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను వదిలి ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇళ్లల్లో దాచుకున్న ధ్రువీకరణపత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇక వరంగల్ నగర పరిధిలో వరద ముంపునకు గురైన బీఆర్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, గోపాల్పూర్, నయీంనగర్ ప్రాంతాల్లోని వారిదీ ఇదే పరిస్థితి. అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి ట్రంకు బాక్సులో పెట్టుకున్న పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లన్నీ కొట్టుకుపోయాయి. నా పై చదువుల పరిస్థితి ఏమిటీ? ఇంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. నా సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలి. -ప్రవీణ్‌కుమార్, దొడ్ల, ములుగు జిల్లా -
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
ముగిసిన నూజివీడు ట్రిపుల్ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
నూజివీడు/వేంపల్లె: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 540 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించి పిలవగా అందులో 475 మంది హాజరయ్యారు. వారందరికీ సీట్లు కేటాయించారు. రెండు రోజుల్లో 1,085 మందికి గాను 956 మందికి అడ్మిషన్లు కల్పించారు. కౌన్సెలింగ్‌కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి ఉండొచ్చని ట్రిపుల్ఐటీ అధికారులు భావిస్తున్నారు. మరో 129 సీట్లు మిగిలిన నేపథ్యంలో 4 ట్రిపుల్ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత రెండో జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభమైంది. టాప్‌లో నిలిచిన విద్యార్థులు కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన ఆకుల ప్రేమ్‌సాయి, కడప జిల్లా సోములవారిపల్లె గ్రామానికి చెందిన శీల హరిణి, కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన సోమల వెంకటరామ శరణ్య, నంద్యాల జిల్లా అవుకు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ సమీర్, ప్రకాశం జిల్లా దొర్నాల గ్రామానికి చెందిన బండారు కార్తీక్‌లు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, వైస్ చాన్స్‌లర్ విజయ్‌కుమార్‌ల చేతుల మీదుగా అడ్మిషన్ల పత్రాలను పొందారు. మొదటి రోజు 444మంది అడ్మిషన్లు పొందారు. -
‘సురక్ష’ శిబిరాల్లో 30.98 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాల్లో బుధవారం వరకు విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సహా మొత్తం 30,98,697 వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికీ పథకాలు అందజేసేందుకు జగనన్న సురక్ష పేరుతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల విద్య నుంచి పీహెచ్డీ వంటి వాటివరకు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగే ఈ సమయంలో విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకునే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ శిబిరాల్లో అప్పటికప్పుడే సర్విసు చార్జీలు లేకుండా అందజేస్తున్నారు. జూలై 1న మొదలు పెట్టిన ఈ శిబిరాలు సచివాలయాల వారీగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు.. ఆదివారాలు మినహా 10 రోజులు 6,997 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మొత్తం 34,39,585 సర్విసులకు సంబంధించి అధికారులకు వినతులు అందాయని తెలిపారు. వాటిలో 90 శాతానికిపైగా.. 30.98 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కారించారని పేర్కొన్నారు. వీటిలో హౌస్హోల్డు జాబితాలో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్థులకు ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, కౌలు రైతులకు సీసీఆర్సీల జారీ వంటివి పెద్దసంఖ్యలో ఉన్నట్టు వివరించారు. ఒక్కరోజే.. 5,54,009 వినతుల పరిష్కారం ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,54,009 వినతులను అధికారులు పరిష్కరించారు. బుధవారం 573 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జరిగిన శిబిరాల్లో 2,44,582 మంది వినతులు పరిష్కరించారు. -
అభాగ్యులకు అండగా..
సాక్షి, నెట్వర్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమస్యకు పరిష్కారం ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్‌కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయ్యింది. దీంతో ఆమె పింఛన్ ఆగిపోయింది. ‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్ మెహరున్నీసా, వలంటీర్లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్‌కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్‌కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్‌ను తొలగించారు. ఆ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నిరక్షరాస్యులకు ఎంతో మేలు ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్ ఇతని పేరు శర్మాస్ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డు పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్ ఇంటికి వచ్చినపుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్.. సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా -
అప్పటికప్పుడే... 10.86 లక్షల సమస్యలకు పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది. సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి. -
జగనన్న సురక్ష: ఇక రావనుకున్న సర్టిఫికెట్లు వచ్చాయి
ఆమె ఓ మధ్య తరగతి గృహిణి. బొటాబొటిగా ఉండే సంపాదనతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం అందితే తమ కుటుంబానికి భరోసాగా ఉంటుందని విశాఖ జ్ఞానాపురానికి చెందిన సంతోష్‌కుమారి ఆశ. కానీ ఆమెకు చాలా కాలంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇంక విసుగొచ్చేసింది. దాంతో ఆ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడమే మానేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘జగనన్న సురక్ష’ ద్వారా ఎవరికి ఏం కావాలన్నా ప్రభుత్వం మంజూరు చేస్తుందని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు కోసం తాను పడ్డ కష్టాలు వారికి తెలిపింది. వెంటనే వారు వివరాలు అడిగారు. వివరాలన్నీ ఇచ్చి.. ఇప్పుడు కూడా ఆ ధ్రువీకరణ పత్రాలు రావులే అని భావించింది. అయితే రోజుల వ్యవధిలోనే ఆమెకు ఫోన్ వచ్చింది. ‘రేపు సురక్ష క్యాంపు ఉంది. మీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి తీసుకెళ్లండి’ అని ఆ ఫోన్లో సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మలేకపోయింది. తర్వాత రోజు క్యాంపునకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని మురిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏళ్ల తరబడి లేనిది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తాయని అనుకున్నాను. క్యాంపులో పాల్గొన్నాను. నా పేరు పిలిచి.. నాకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు. విసుగొచ్చేలా తిరిగినా రానివి పైసా ఖర్చు లేకుండా రావడం నిజంగా మాలాంటి వారికి ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి పని ఇంటి తలుపు ముంగిటే జరుగుతుందని అందరూ అంటే.. ఏదో అనుకున్నాను. నాకూ అలా జరగడంతో.. ప్రజలంతా జగనన్నని సీఎంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైంది’’ అని ఆనందం వ్యక్తం చేసింది. -
1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సచివాలయాల వారీగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఈ నెల 24 నుంచే ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్‌్కలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆయా డెస్‌్కల్లో మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా పొందుపరిచారు. ♦ గ్రామ సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపుల నిర్వహణ కోసం మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలో ముగ్గురేసి మండల స్థాయి అధికారులు ఉంటారు. ఒక మండల పరిధిలో 24 కంటే ఎక్కువగా సచివాలయాలు ఉంటే అవసరమైన పక్షంలో మూడో బృందాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును స్థానిక అధికారులకే అప్పగించారు. ♦ అత్యధిక వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, పట్టణాల్లో దగ్గరగా ఉండే సచివాలయాలను క్లస్టర్‌గా వర్గీకరిస్తారు. ఆ క్లస్టర్ల వారీగా క్యాంపులు నిర్వహిస్తారు. అయితే, క్లస్టర్ పరిధిని గరిష్టంగా ఐదు వార్డు సచివాలయాలకే పరిమితం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ♦ క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామ సచివాలయాల భవనాల్లోనే ఈ క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో సచివాలయం ఉంటే ఇతర ప్రభుత్వ భవనాల్లో క్యాంపులు నిర్వహిస్తారు. ♦ ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, వలంటీర్లకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు. సర్వీసు చార్జీలు లేకుండా అందజేసే సేవలివే.. ♦ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు) ♦ ఆదాయ ధ్రువీకరణ పత్రం ♦ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ♦ మరణ ధ్రువీకరణ పత్రం ♦ మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూకొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు), మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (ఆన్లైన్లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు) ♦ వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) ♦ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ♦ ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ ♦ కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ♦ కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన ♦ ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు. -
2,000 నోటు.. సవాలక్ష ప్రశ్నలు!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నాటితో పోలిస్తే చిన్న లైన్లు, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలపరమైన గందరగోళం మధ్య రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. పాన్ లేదా ఆధార్ వంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఫారంలు తప్పనిసరని ఆర్బీఐ సూచించకపోయినా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది అవి కావాల్సిందే అనడంతో ఖాతాదారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఎల్రక్టానిక్ ఎంట్రీలు చేసుకుని నోట్లను మార్చగా, మరికొన్ని మాత్రం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలేమీ అడగకుండా రిజిస్టరులో పేరు, మొబైల్ నంబరు రాయాలంటూ కస్టమర్లకు సూచించాయి. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డులను చూపించాలని అడిగినట్లు కొందరు కస్టమర్లు తెలిపారు. అలాగే, మరికొన్ని బ్యాంకులు నోట్లను మార్చలేదని, దానికి బదులుగా తమ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా సూచించాయని వివరించారు. అయితే, 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు (డీమానిటైజేషన్) కనిపించినంతగా చాంతాడంత లైన్లు ఈసారి కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావొచ్చనే అంచనాలతో కూర్చునేందుకు, తాగు నీటికి ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది రాలేదు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) నోట్లను మార్చుకునేందుకు దాదా పు 130 రోజుల పైగా వ్యవధి ఉండటం ఇందుకు కారణమని పరిశీలకులు తెలిపారు. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నాలుగు నెలల సమయం ఉండటంతో డీమానిటైజేషన్‌తో పోలిస్తే అంత హడావుడి ఏమీ లేదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు వివరించారు. రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఎటువంటి ఫారం లేదా పత్రం అవసరం లేదంటూ ఎస్బీఐ తమ శాఖలకు అధికారికంగా మెమో పంపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి ఫారం నిర్దేశించకపోయినా, తమ ఖాతాదారులు కాకపోతే మాత్రం ఐడీ ప్రూఫ్ మాత్రం అడుగుతోంది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఇక కోటక్, హెచ్ఎస్బీసీ వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులు కాని వారి దగ్గర్నంచి ఫారం/ఐడీ ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రం తాము ఎటువంటి ఫారం లేదా ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చెల్లుబాటవడం కొనసాగుతుంది. సెపె్టంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చు లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. (అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) సమర్థించుకున్న ఆర్బీఐ.. రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ఢిల్లీ హైకోర్టులో ఆర్బీఐ సమర్థించుకుంది. ఇది డీమానిటైజేషన్ కాదని చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపింది., నిర్వహణ సౌలభ్యం కోసమే నోట్ల మార్పిడిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా నోట్లను మార్చుకోవచ్చన్న ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే లాయరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆర్బీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. ధ్రువీకరణ పత్రాల ప్రసక్తి లేకపోతే మాఫియా, నక్సల్స్ మొదలైన వారి వల్ల ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనరు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్‌కే పరిమితం చేసి, హైస్కూల్‌కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం జగన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. చదివిన చదువు వృథా పోలేదు. తమ బతుకులు ఇంతేనని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. 1998లో డీఎస్సీ రాయగా అది చెల్లదంటూ అందులో ఎంపికైన వారికి నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. దీనిపై వారు 22 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు. చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’ తమకు అన్యాయం జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. 1998 డీఎస్సీలో అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్ ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోలేదు. విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చినప్పుడు డీఎస్సీ అభ్యర్థులు ఆయనను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం రాగానే సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు అనంతరం 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు అన్ని చర్యలూ పూర్తి చేశారు. ఫలితంగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1998 డీఎస్సీ అభ్యర్థులు 2,807 మంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. అర్హులందరూ అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఆరు నుంచి 14వ తేదీలోగా వాటి వెరిఫికేషన్ పూర్తి కానుంది. అనంతరం అర్హులైన అందరినీ ఈ నెల 14వ తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. 6 నుంచి క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కాకినాడ సిటీ/రాయవరం: ఈ నెల 6, 7 తేదీల్లో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరై పోస్టు పొందని అభ్యర్థులు 560 మంది ఉన్నారు. వీరిలో ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, డీఎస్సీ ఇంటర్వ్యూ లెటర్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, హాల్ టికెట్/ర్యాంకు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్ఎస్సీ/ఇంటర్/డిగ్రీ/పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, డీఈడీ/బీఈడీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికెట్లు, ఏజెన్సీ ఏరియా సరి్టఫికెట్లు (వర్తిస్తే), పీహెచ్సీ సర్టిఫికెట్లు (అవసరమైన వారు), టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (అనుభవం ఉన్నవారు) తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. వీరందరూ మూడు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు కూడా అందజేయాలని డీఈఓ తెలిపారు. అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. హాల్ టికెట్ నంబర్ 4100047 నుంచి 4102488 వరకూ ఉన్న అభ్యర్థులు 6వ తేదీన, 4102489 నుంచి 4105490 వరకూ ఉన్న అభ్యర్థులు 7వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈఓ సుభద్ర సూచించారు. -
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు వారి ఇంటి అడ్రస్ ప్రకారం..స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, టెంపరరీ వీసా, పర్మినెంట్ రెసిడెన్షియల్ (పీఆర్) లేదా విదేశాలకు ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ అవసరం. ఇంతకు ముందు, విదేశాల్లో నివసించే వారి విషయంలో ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ లేదా, ఇండియన్ ఎంబసీ/హైకమిషన్ కార్యాలయంలో ఆన్లైన్లో పీసీసీ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద పీసీసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ధరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకుముందు పీసీసీ అపాయింట్మెంట్ స్లాట్ల లభ్యతను కూడా మెరుగుపరుస్తామని ప్రకటన చేయగా.. తాజాగా పీసీసీపై ప్రకటన చేయడం పట్ల పాస్‌పోర్ట్ ధర ఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 428 పీసీసీ కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖల చొరవతో పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందనున్నాయి.కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. -
ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడంతో.. విద్యార్థి అఘాయిత్యం
జన్నారం: కాలేజీ ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని కళాశాల యాజమాన్యం చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో జరిగింది. విద్యార్థి తండ్రి జక్కుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్(19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. ఇటీవల ఎంసెట్ రాశాడు. ఈనెల 28న జగిత్యాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కౌన్సెలింగ్‌కు ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం ఉండటంతో అంజిత్ తండ్రి శ్రీనివాస్ ఇటీవల కళాశాలకు వెళ్లాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా ఫీజు బకాయి రూ.30 వేలు ఉందని, వాటిని చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. తమ వద్ద అంత డబ్బు లేదని, కౌన్సెలింగ్ తర్వాత చెల్లిస్తామని శ్రీనివాస్ వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకున్న అంజిత్ మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నెల 27న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, సోమవారం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మృతుని తండ్రి శ్రీనివాస్ కోరాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించిన ప్రభుత్వం
-
యూజర్ ఫ్రెండ్లీ అంటూ గొప్పలు.. ప్రజలకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: కాగిత రహిత పాలనలో తమను మించిన వారు లేరని, అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా మారింది. అన్నీ ఆన్లైన్ ద్వారానే అని చెబుతున్నప్పటికీ.. సవ్యంగా పనిచేయాల్సిన జీహెచ్ఎంసీ సర్వరే మొరాయిస్తుండటంతో వివిధ పనులు అవసరమైన వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ సేవలకు సంబంధించి ఇదివరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సదుపాయం ఉండేది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు, ట్రేడ్‌లైసెన్సుల వంటి సేవలందేవి. ఇటీవలి కాలంలో ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే సదరు సేవలు వినియోగించుకునేలా చేశారు. జీహెచ్ఎంసీలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు అధికారులను కలిసే పనే లేకుండా యూజర్‌ఫ్రెండ్లీగా ఆన్లైన్ ద్వారానే ఈ సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ప్రజలకు అంతరాయాల్లేకుండా సేవలందుతున్నాయా.. సాంకేతికంగా ఇబ్బందులెదురవుతున్నాయా ? వంటి విషయాలను మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలతో పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా సైతం అదే పరిస్థితని చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్లు ఆటోమేటిక్‌గా జరుగుతున్నప్పటికీ, పాతవాటికి సంబంధించి ఇబ్బందులెదురవుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనుకునేవారికీ ఇదే పరిస్థితి. ఇక టౌన్‌ప్లానింగ్‌లో అన్నీ ఆన్లైనే అని చెబుతున్నప్పటికీ, అధికారులను మచ్చిక చేసుకోకపోతే పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఇల్లు కుట్టుకున్న వారి ఆస్తిపన్నుకు సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ నుంచి దుకాణదారుల ట్రేడ్‌లైసెన్సుల వరకు అన్నీ ఆన్లైన్లోనే సదుపాయం కల్పించినప్పటికీ, తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకొని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలుండవని హిమాయత్‌నగర్‌కు చెందిన రాకేశ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉన్నతాధికారులు చేపట్టిన ‘ఆన్లైన్ మంత్ర’ వల్ల తమకు రావాల్సిన పై ఆదాయం రానందున జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగులే సమస్యలు సృష్టిస్తున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం వినియోగం సైతం పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు) ఆన్లైన్ సేవలు.. ► సెల్ఫ్ అసెస్మెంట్స్ ► మ్యుటేషన్స్ ► బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ► ట్రేడ్ లైసెన్స్ నెలల తరబడి తిప్పుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మ్యుటేషన్ జరుగు తుందని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. సర్వర్‌డౌన్ పేరిట నెలల తరబడి తిప్ప డం సమంజసం కాదు. లోపాలెక్కడున్నాయో పరిశీలించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలి. – లక్ష్మణ్, ఉప్పల్ -
కోవిడ్ బీమాలో కేటుగాళ్లు’.. సర్టిఫికెట్ల ఫోర్జరీ నిజమే!
కారేపల్లి: కోవిడ్ బీమా సొమ్ము స్వాహా చేసేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు, నకిలీ చికిత్స బిల్లులు సమర్పించిన కేటుగాళ్ల బండారం బయటపడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండా, మేకలతండా గ్రామాల్లోని 800 మంది కి బీమా చేయించాక సుమారు 500 మందికి కరోనా సోకినట్లు సమీప మహబూబాబాద్ జిల్లా గార్ల సీహెచ్‌సీ నుంచి తీసుకున్నట్లు ఉన్న సర్టిఫికెట్లు సమర్పించగా, 90 మందికి బీమా క్లెయిమ్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ విషయమై ‘కోవిడ్ బీమాలో కేటుగాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఎస్బీఐ లైఫ్ కోవిడ్ రక్షక్ బీమా పథకంలో వందలమంది పేర్లను ఆన్ లైన్ చేసిన స్థానిక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడిని మంగళవారం కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై బీమా సంస్థ ప్రతినిధు లుకానీ, దళారుల చేతిలో మోసపోయినవారు కానీ ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కుశకుమార్ తెలిపారు. గార్ల సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ రాణాప్రతాప్ ను వివరణ కోరగా, తమ సీహెచ్‌సీ నుంచి జారీ అయినట్లుగా చెబుతున్న సర్టిఫికెట్లపై ఆస్పత్రి నకిలీ స్టాంప్, ఫోర్జరీ సంతకం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 30కిపైగా సర్టిఫికె ట్లతో బీమా సంస్థ ప్రతినిధులు సంప్రదించగా, తన సంతకం ఫోర్జరీ అయినట్లు చెప్పానని వివరించారు. పత్రికలకథనాలతో పదిమంది ముఠాసభ్యులు పరారయ్యారు. -
భర్త ఇంటి ముందు యువతి ధర్నా
సాక్షి, తిరువణ్ణామలై(తమిళనాడు): పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని పాపంబాడి గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు పూఅరసన్(22), చెన్నైలో మినీ వ్యాన్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కల్లకుర్చికి చెందిన అమ్ము(22) తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం పూఅరసన్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అమ్మును అమ్మగారింటికి పంపి వేశారు. అనంతరం భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అమ్ము తన వివాహం సమయంలో వేసిన బంగారం, వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరింది. అయితే ఇందుకు అత్తగారింటిలో అంగీకరించక పోవడంతో ఆమె ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు చెన్నై హైకోర్టులోను ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టేందుకు యత్నించగా ఇంటికి తాళం వేసి అత్తింటి వారు పరారయ్యారు. దీంతో అమ్ము శనివారం అత్తింటి ముందు చంటి బిడ్డతో ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెతో చర్చించి ధర్నాను విరమింప జేశారు. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
అవి చిత్తు కాగితాలు కాదండి.. విద్యార్థుల సర్టిఫికెట్లు
సాక్షి, రంగారెడ్డి: ఈ చిత్రాన్ని చూసి ఏవో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు అనుకుంటున్నారా.. కాదండి అవి విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే సర్టిఫికెట్లు. ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోంది. కొందుర్గు మండల కేంద్రంలోని అద్దె భవనంలో కొనసాగిన ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల రెండేళ్లుగా మూతబడింది. విద్యార్థుల సర్టిఫికెట్లు అందులోనే ఉండిపోయాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇంటి యజమాని ఆదివారం కూల్చివేసేందుకు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ బీరువాలో ఉన్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఒక్కసారిగా కుప్పలుగా బయటపడ్డాయి. విషయం ఆ నోటా.. ఈ నోటా.. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది అంతే అందుబాటులో ఉన్న విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తీసుకునేందుకు కళాశాల భవనానికి పరుగులు పెట్టారు. చెత్త కుప్పల్లా పడి ఉన్న కాగితాల్లో ఇలా తమ సర్టిఫికెట్లను వెతుక్కున్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్‌పై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడంపై మండిపడుతున్నారు. సర్టిఫికెట్ల భద్రత పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. -
వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించి ఏటా వేలాది మంది డిగ్రీలు అందుకుంటున్నారు. వీరిలో సుమారు 20 వేల మందికి పైగా పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో డిగ్రీలు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు అసలివా? నకిలీవా? అని తెలుసుకునేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు పరిశీలన కోసం ఢిల్లీలోని వివిధ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయి. (చదవండి: కోటితో ఆగను.. అదే నా స్వప్నం: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ విజేత) ఢిల్లీలోని ఏజెన్సీ సంస్థలు ఓయూకు రూ.500 చెల్లించి నేరుగా వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తాయి. హాల్‌టికెట్ నంబర్ ద్వారా సర్టిఫికెట్ డూప్లికేటా, ఒరిజినలా అని పరిశీలించి ఏజెన్సీ సంస్థలకు ఎయిర్‌లైన్స్ ద్వారా వెరిఫికేషన్ చేసి సర్టిఫికెట్‌ను చేరవేస్తారు. అలా ప్రతిరోజూ 50కిపైగానే వెరిఫికేషన్ కోసం ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తారని ఓయూ మాజీ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ వివరించారు. జూన్, జులై నెలల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. వెరిఫికేషన్‌లో జాప్యం కారణంగా ఎంతో మంది అభ్యర్థులు విదేశాల్లో ఉద్యోగాలకు దూరమవుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ బాలిక) -
టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి, ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. 2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైట్లో సర్టిఫికెట్ ఉంటుందన్నారు. దరఖాస్తుకు విధివిధానాలు త్వరలో తెలియచేస్తామని చెప్పారు. -
ఈ కాలేజీలో చదవలేను.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను
నాగోలు: సర్టిఫికెట్లు అడిగినందుకు విద్యార్థినిపై, ఆమె చిన్నమ్మపై కళాశాల డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడంతో కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని డాక్టర్ జీ మెడికల్ అండ్ ఐఐటీ అకాడమీలో కీర్తన అనే విద్యార్థిని గత రెండేళ్లుగా విద్యనభ్యసిస్తోంది. కళాశాల ఫీజు విషయంలో మేనేజ్మెంట్, విద్యార్థిని మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా.. “స్టడీ అవర్స్‌లో అకాడమీ డైరెక్టర్ జగన్ యాదవ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇది తట్టుకోలేక హాస్టల్లోనే పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు.. ఇక ఈ కాలేజీలో చదవలేను.. నా సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను’ అని విజ్ఞప్తి చేస్తే బెదిరింపులకు పాల్పడినట్లు విద్యారి్థని కీర్తన పేర్కొంది. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనడంతో రూ.50 వేలు చెల్లించినట్లు.. అయినా ఇంటికి పంపకుండా అడ్డుకున్నారని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. తనను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన చిన్నమ్మ మమతను సైతం కళాశాల డైరెక్టర్ జగన్యాదవ్, డ్రైవర్ శివ అడ్డుకున్నారని, ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు హాస్టల్ గేటు దగ్గర దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని కీర్తన ఆరోపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా సమయంలో హాస్టల్ మూసివేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి చిన్నమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్యాదవ్, శివపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎల్బీనగర్ పోలీసులు చెప్పారు. -
వరదల్లో సర్టిఫికెట్లు పోయినా.. పాడైనా కొత్తవి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు కోల్పోయిన వారు, పాడైయిన వారు ఉంటే ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఉచితంగా విద్యార్థుల సర్టిఫికెట్లను (ఫ్రెష్/డూప్లికేట్) జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు, విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు తాము పోగొట్టుకున్న, తడిచి పాడైపోయిన సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు తమ పేరు, పరీక్ష, హాల్ టికెట్ నెంబర్, సంవత్సరం తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకొని.. సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోయిన భర్త
రాజాపూర్ (జడ్చర్ల): మూడేళ్లుగా ప్రేమించుకుని గతనెల క్రితం ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాకా వారంరోజుల నుంచి భర్త ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన గురువారం మండలంలోని ముదిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన స్వప్న అదే గ్రామానికి చెందిన మహేష్‌గౌడ్ మూడేళ్లుగా ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వట్టెం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గ్రామంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో నెలరోజుల క్రితం జడ్చర్లలో ఓ రూం అధ్దెకు తీసుకుని ఉన్నారు. ఈ క్రమంలో స్వప్న అనారోగ్యంగా ఉండటంతో తండ్రి ఆంజనేయులుకు సమాచారం ఇచ్చి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త మహేష్‌గౌడ్ తన సరి్టఫికెట్స్ తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో జర్చర్ల పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన భర్తను అతని తల్లిదండ్రులే ఎక్కడో దాచారని ఆరోపిస్తూ గురువారం ముదిరెడ్డిపల్లిలోని మహేష్‌గౌడ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ కుటుంబ సభ్యులను పిలిచి కౌల్సిలింగ్ నిర్వహించారు. -
నకిలీ పట్టేస్తా!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం మన దేశం నుంచి ఏటా లక్షల మంది అమెరికాకు బారులు తీరుతున్నారు. అక్కడి కాలేజీల్లో ప్రవేశాలు, సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కొందరు విద్యార్థులు, యువత నకిలీ సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. దరఖాస్తుల వివరాలపై లోతుగా ఆరా తీసే క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూస్తుండటంతో, ఈ అంశంపై దృష్టి సారించాలని అమెరికా రాయబార కార్యాలయం భారత్‌కు సూచించింది. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందుకు తెలంగాణ ఐటీ శాఖ నడుం బిగించింది. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత పరిష్కారమని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డుతో పాటు, బాసర ట్రిపుల్ ఐటీలోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఐటీ శాఖ.. హైదరాబాద్ జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలను కూడా త్వరలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ జేఎన్టీయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో జేఎన్టీయూను ఎంపిక చేసినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత ఆచరణలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ ఇటీవలే ప్రకటించింది. ఇతర రంగాలకూ విస్తరణ నకిలీ సర్టిఫికెట్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, ఇతర నియామక కంపెనీల వద్ద కూడా లేదు. నకిలీల బెడద ఎదుర్కోవడంలో బ్లాక్‌చెయిన్ సాంకేతికత సమర్థంగా ఉపయోగపడుతుందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగంలో భారత్ ముందంజలో ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ బ్లాక్‌చెయిన్ స్టాండర్డ్స్ కాన్ఫరెన్స్’వెల్లడించింది. దేశంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించడమే కాకుండా ఇతర రంగాల్లోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. విద్యుత్ శాఖ లావాదేవీల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచడంతో పాటు, వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తగ్గించడం లక్ష్యంగా ‘బ్లాక్‌చెయిన్’ను వేదికగా చేసుకుని పీ2పీ (పీర్ టు పీర్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పీ2పీ బ్లాక్‌చెయిన్ వేదికను రూపొందించేందుకు అహ్మదాబాద్ ఐఐఎంతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల జీవిత కాలానికి సంబంధించిన సమాచారం (వెహికల్ లైఫ్‌టైమ్ మేనేజ్మెంట్), ఔషధాల్లో నకిలీల నివారణలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్లాక్‌చెయిన్ అంటే.. ఇంటర్నెట్ రంగానికి ఇటీవల వెన్నెముకగా మారుతున్న నూతన ఐటీ సాంకేతికత పేరు ‘బ్లాక్‌చెయిన్’. ఈ నూతన సాంకేతికత ద్వారా డిజిటల్ సమాచారాన్ని పంపిణీ చేయొచ్చు కానీ కాపీ చేయలేం. ఒక సంస్థ తన సమాచారాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో పెడుతుంది. కానీ ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని తస్కరించడం లేదా కాపీ చేయడానికి అవకాశం లేకుండా, డేటా నిర్వహణ పూర్తిగా సదరు సంస్థ అధీనంలోనే ఉంటుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్లాట్ఫారంలోని భాగస్వామి ఏదైనా సమాచారాన్ని కోరితే.. ఆ సమాచారాన్ని కలిగి ఉన్న భాగస్వామి తన డేటా బేస్‌ను పరిశీలించి సమాధానం ఇవ్వొచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఏదైనా కొత్త సాంకేతికతకు ఉన్నట్లే బ్లాక్‌చెయిన్‌కు కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయని, అయితే రాబోయే రోజుల్లో వాటిని అధిగమిస్తామని ఐటీ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
నర్సింగ్ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వండి
బరంపురం ఒరిస్సా : బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్ సింగ్‌దేవ్ కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఉత్కళ్ ఆశ్రమ రోడ్ ప్రాంగణంలో గల గంజాం కళాపరిషత్ సమావేశం హాల్లో ఎంకేసీజీ మెడికల్ కళాశాల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సంఘం, ఆలిం డియా డీఎస్ఓ సయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్ సింగ్‌దేవ్ మాట్లాడుతూ గత 2017–18 పాస్ ఔట్ అయిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సర్టిఫికెట్లను మూడు నెలలు గడుస్తున్నా కూడా కళాశాల ప్రిన్సిపాల్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ, ఇతర పై చదులువు చదివేందుకు జాయిన్ వ్యవధి గడిచిపోతున్నా కూడా తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను మానసికంగా వేదనకు గురి చేస్తున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. సర్టిఫికెట్లు దొరకనందున ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోలేకపోతున్నామని వాపోయారు. రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎంకేసీజీ మెడికల్ కళాశాల క్యాంపస్‌లో ఉండగా పర్లాకిమిడిలో ప్రైవేట్ నర్సింగ్ కళాశాల ఉందని ఈ రెండు నర్సింగ్ కళాశాలలు బరంపురం విశ్వ విద్యాలయం అధీనంలో ఉన్నాయని చెప్పారు. అయితే ఈ రెండు కళాశాలల 2017–18 నర్సింగ్ విద్యార్థులకు మే నెలలో బరంపురం విశ్వవిద్యాలయం సర్టిఫికెట్లు ఇచ్చిందని, పర్లాకిమిడిలో ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదివిన 2017–18 విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వగా ఎంకేసీజీలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల 3 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు తమ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బరంపురం సబ్‌కలెక్టర్, కలెక్టర్, రాష్ట్ర మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చినా ఫలితం లేకపోయిందని చివరికి మీడియా ముందుకు రావలసి వచ్చిందని చెప్పారు. డీఎస్ఓ రాష్ట్ర కన్వీనర్ సోమనాథ్ బెహరా మాట్లాడుతూ వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టి సారించి నర్సరీ విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని లేనిపక్షంలో డీఎస్ఓ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు శివాని మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
టీసీలు, మెమోలు ఇవ్వరట!
జనగామ అర్బన్: జిల్లాలోని కొన్ని మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల కు అధికారులు టీసీలు, మెమోలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజలు అవుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 9 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 8 స్కూళ్లలో ఇంటర్ కోర్సు ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు 500 మం ది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. అయి తే మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులను ఇంటర్ సైతం ఇక్కడే చదవాలని కొందరు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కళాశాలల్లో చేరే అంశం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థి తి, విద్యార్థుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, వేరే కళాశాలల్లో చేరేందుకు టీసీ, మెమోలు ఇచ్చేది మాత్రం లేదని అధికారులు పేర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం టీసీ, మెమోలు ఇస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల అధికారులు పదో తరగతి పాసై న విద్యార్థి టీసీ అడిగితే అందులో విద్యను అభ్యసిస్తున్న వారి తమ్ముడు, చెల్లి టీసీలు కూడా ఇస్తామని ఒకింత కఠినంగా చెబుతున్నారని తెలుస్తోంది. మోడల్ స్కూల్లో బో«ధించే కొందరు ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యను అభ్యసిస్తున్నార ని, వారేందుకు మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఇష్టంలేని చోట విద్య కొనసాగదని, భవిష్యత్ భరోసా ఎవరిస్తారని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఇష్టంతో చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని, ఇష్టంలేకున్నా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు. ఇప్పటికైనా మోడల్ స్కూల్లో ఇంటర్ చదవడం ఇష్టంలేని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని టీసీ, మెమోలు జారీ చేయాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, నాణ్యమైన వి ద్య అందుతుందనే దృష్టితోనే విద్యార్థులను మోడల్ స్కూల్లో ఇంటర్లో చేరే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. -
అన్యాయం..అక్రమం..నిర్లక్ష్యం!
కందుకూరు: విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ అధికారులు ఆటలాడుతున్నారు. కాలేజీల్లో చేరి కోర్సు పూర్తి చేసి మూడున్నరేళ్లు అవుతున్నా నేటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పరిస్థితి ఇలా.. కందుకూరులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 2014–15 విద్యా సంవత్సరంలో వివి«ధ విభాగాల్లో వందల మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఒక సంవత్సరం కోర్సులైన డీజిల్ మెకానిక్, కోఫా కోర్సులతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి రెండు సంవత్సరాల కోర్సులకు చెందిన విద్యార్థులు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక బయటకు వెళ్లారు. అయితే కోర్సు పూర్తి అయినట్లు కేవలం మార్కుల మెమోలు మాత్రమే ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఉండే ఎన్టీసీ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) ఇవ్వలేదు. ఇది వస్తేనే ఐటీఐ కోర్సు పూర్తి చేసినట్లు లెక్క. ఎన్టీసీ సర్టిఫికెట్స్ ఢిల్లీలోని డైరెక్టర్రేట్ ఆఫ్ సాంకేతిక విద్యాశాఖ అయిన ఢిల్లీ నుంచి ఈ సర్టిఫికెట్లు రావాల్సి ఉంది. దీనిపై విద్యార్థులు కాలేజీ అధికారులను ఎప్పుడు అడిగినా ఢిల్లీ నుంచి రావాలి ఇంకా రాలేదు. మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటున్నారు. అయితే ఒంగోలు ఐటీఐ కాలేజీలో అదే ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రం సర్టిఫికెట్స్ రావడం గమనార్హం. కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం దీనికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందని చెప్తున్నారు. ఇదే విషయంపై ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్తున్నారు. కందుకూరు కాలేజీకి సంబంధించి పెండింగ్ సర్టిఫికెట్లు ఉన్నట్లు జాబితానే రాలేదని చెప్తున్నారు. అప్రంటిస్ ఎలా? సాధారణంగా ఐటీఐ కోర్సులైన డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో అప్రంటిస్‌గా ఎక్కడో ఒకచోట పనిచేయాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలు కచ్చితంగా అప్రంటిస్ శిక్షణను కూడా పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి అయితేనే ఐటీఐ కోర్సుకు విలువ ఉంటుంది. అప్పుడే ఏ ప్రైవేట్ కంపెనీల్లో అయినా ఉద్యోగాల్లో చేరేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తి చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐదు సంవత్సరాల్లోపు అప్రంటిస్‌గా పనిచేయాలి. ఉద్యోగాలకు అనర్హులే.. ప్రస్తుతం ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలు ఐటీఐ విద్యార్థులకు వరం. కానీ స్థానిక ఐటీఐ కాలేజీ అధికారులు నిర్లక్ష్యం పుణ్యమా అంటూ ఆ విద్యార్థులు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఎన్టీసీ సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో చేరాలన్నా అనర్హులే. దీంతో ఆ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మూడున్నరేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం, 2014–15లో ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. మూడున్నర సంవత్సరాలుగా సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నాం. అడిగినప్పుడల్లా రెండు నెలల్లో వస్తాయని చెప్తున్నారు. ఒంగోలు వెళ్లి ఐటీఐ కన్వీనర్‌ను కలిస్తే మీ కాలేజీ వాళ్లు వివరాలు పంపలేదు. అందుకే రాలేదని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, 1100కి కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు కూడా సంబంధిత అధికారులకు చెప్తామన్నారు. కానీ ఏ న్యాయం జరగలేదు.- కె. ఫణిదర్, డీజిల్ మెకానిక్ విద్యార్థి ఏ ఉద్యోగాలకూ తీసుకోవడం లేదు: ఐటీఐ కోర్సు పూర్తి చేశామన్నా ఏ ఉద్యోగానికి ఎవరూ తీసుకోవడం లేదు. కచ్చితంగా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కనీసం ఆర్టీసీలో అప్రంటీస్‌గా చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అలాగే మూడేళ్లుగా అనేక ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆర్ఆర్బీ దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికేట్లు లేక అనర్హులం అవుతున్నాం. మా భవిష్యత్ పూర్తిగా నాశనం అయింది. సర్టిఫికెట్స్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఎం. పవన్‌కుమార్ -
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!
తాడేపల్లిరూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అంచెలంచెలుగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తోంది. దానిలో భాగంగా మహ్మద్ ఇంటి పేరు కలిగిన ముస్లిం లకు తీవ్ర ద్రోహం తలపెట్టింది. ప్రస్తుతం వారికి ఓసి సర్టిఫికెట్ ఇస్తాం, బిసి సర్టిఫికెట్లు ఇవ్వమంటూ చెప్పడంతో, చదువుకునే విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను ఆందోళన ప్రారంభమైంది. 2014లో బీసీ–ఈ గా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఓసి సర్టిఫికెట్ ఇస్తామని తెలపడంతో, గతంలో విద్యను అభ్యసించిన వారు బీసీ–ఈ సర్టిఫికెట్ పొంది ఉన్న వారు ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు. 2014లో పదో తరగతి పూర్తిచేసుకున్న ఓ విద్యార్థి ప్రస్తుతం బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుకునేందుకు సర్టిఫికెట్ అవసరం కావడంతో మంగళగిరిలోని ఓ ఈ–సేవా కేంద్రంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మహ్మద్‌లకు బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఓసీ సర్టిఫికెట్ ఇస్తామని, కావాలంటే తీసుకోవచ్చని చెప్పడంతో, ఆ విద్యార్థి తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రులు కూడా ఈసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయగా, వెబ్సైట్లో ఓసీ సర్టిఫికెట్టే ఓపెన్ అవుతుందని, బీసీ–ఈ ఓపెన్ కావడం లేదని, 2014 తర్వాత మహ్మద్‌లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని తెలియచేశారు. మీ ప్రాంతంలోని తహసీల్దార్‌ను వివరణ అడగాలని చెప్పడంతో తాడేపల్లికి చెందిన ఎం.డి.చాంద్‌బాషా తహసీల్దార్‌ను కలిసి తన గోడును వివరించుకున్నాడు. ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను చెప్పుకోవాలని సూచించారు. 2014లో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు 2018లో ఎందుకివ్వరో తెలిపాలని ప్రశ్నించినా, తహసీల్దార్ దగ్గరనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో సామాన్యుడైన చాంద్‌బాషా ఏం చేయాలో అర్థంకాక వెనుదిరిగి వెళ్లాడు. ఇప్పుడేం చేయాలి నా కుమారుడు అమీర్‌కు 2014లో బీసీ–ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాం. ఓసీ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఒకే విద్యార్థి రెండు రకాల కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉంటే, భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు తెలియదా. మహ్మద్ ఇంటిపేరు కలవారిని చిన్నచూపు చూస్తూ ఓసీలుగా ధ్రువీకరించడం ఏంటో అర్థం కావడంలేదు. –ఎండీ.చాంద్‌బాషా లంచం ఇస్తే ఎలా ఇచ్చారు వేరేవారికి ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను చూపించి, చేతులు తడిపితే తప్ప బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తాడేపల్లి మున్సిపాలిటీలో బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందచేయడంతో వాటికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం అడిగాం. మొదట ఓసి సర్టిఫికెట్టే ఇస్తామన్నారు. నులకపేటలో మహ్మద్‌లకు ఇచ్చిన బీసీ–ఈ కుల ధ్రువీకరణపత్రాలను చూపించి చేతులు తడిపితే తప్ప ఇవ్వలేదు. – ఎండీ మస్తాన్‌వలి -
ఒక పట్టాన చెవికెక్కదు
వ్యవసాయ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పనిముట్లు.. వీటి గురించి టీవీ, పేపర్లలో వినడమేగానీ.. వారి దరి చేరింది లేదు. తరతరాలుగా చెమట చుక్కలను చిలకరించి పుడమి తల్లిని పులకరింపజేసి నాలుగు మెతుకులు తినడమేగానీ.. ఆ భూములు వారికి దక్కింది లేదు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఊరూరా తిరుగుతూ సాగు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారుగానీ.. నాలుగేళ్లుగా వారి గోడు పట్టించుకున్న దిక్కు లేదు. ‘మాకు పట్టాలివ్వండి మహాప్రభో’ అంటూ వచ్చిన 26 వేల దరఖాస్తులకు సమాధానం చెప్పే నాథుడు లేడు. ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్రలో 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారు. ఫలితంగా భూములు సాగు చేసుకునేందుకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి,అమరావతి బ్యూరో: జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 2.5 లక్షల మందికిపైగా గిరిజనులు ఉన్నారు. వీరు సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లాలో 28 వేల ఎకరాల భూమిని సర్వే చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేశారు. జిల్లాలో 3,200 మంది గిరిజనులకు 5,326 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు గిరిజనుల భూమి పట్టాల గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ 26 వేల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూమి సాగు చేసుకొనేందుకు తిప్పలు ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో గిరిజనులు భూములు సాగు చేసుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్లు, ఎద్దులు, అరకలు తీసుకెళ్తున్నారు. వీటిని అటవీ అధికారులు అడ్డుకొని, వాటిని సీజ్ చేసి కేసులు పెడుతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో 32 మంది ఎస్టీలకు 118 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అయితే కొంత మంది ఆ పొలాలను దౌర్జన్యంగా లాక్కొని, ఎస్టీలు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకొంటున్నారు. ఎస్టీలు పలుమార్లు అధికారులకు సమస్యను విన్నవించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు. వెల్దుర్తి మండలం సిరిపురం తాండలో 200 మంది ఎస్టీలకు గాను కేవలం 70 మందికి మాత్రమే భూమి పట్టాలు ఇచ్చారు. అయితే వారు పొలాల వద్దనే గుడిసెలలో నివాసం ఏర్పాటు చేసుకొని భూములు సాగు చేసుకొంటున్నారు. అక్కడ ప్రభుత్వం కనీçసం తాగునీటి వసతి కూడా కల్పించక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని వేడుకొంటున్నారు. సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు తరతరాలుగా భూములు దున్నుకొంటున్న గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో మాత్రం అటవీ హక్కుల చట్టాన్ని విస్తృతంగా అమలు చేసి, భూమి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు గిరిజనులు తమ పొలాలను సాగు చేసుకొనేందుకు అడవికి వెళ్తుంటే అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఆర్.కృష్ణానాయక్, లంబాడి హక్కుల పోరాట సంఘం నేత -
నేటి నుంచి టీఎస్‌సెట్–2017 సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్ : టీఎస్‌సెట్–2017లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం నుంచి (9వ తేదీ) నుంచి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు సెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి గురువారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని సెట్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చని వెల్లడించారు. -
వికలాంగులు కాదు.. దివ్యాంగులు
న్యూఢిల్లీ: వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది చేసిన సూచనను రెండేళ్ల తర్వాత రైల్వే శాఖ ఆచరణలో పెట్టింది. రైల్వే రాయితీ ఫారాలలో వికలాంగ్ అని ఉన్నచోట దివ్యాంగ్గా నామావళిని మార్పు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అందజేసే రాయితీ(కన్సెషన్) దరఖాస్తులో ‘బ్లైండ్’ అని ఉన్నచోట దృష్టి బలహీనులుగా, చెవిటి మూగ అని ఉన్నచోట వినలేని, మాట్లాడలేని బలహీనులుగా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉన్నచోట దివ్యాంగ్జన్ అని మార్పు చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వస్తాయి. ఈ రాయితీ ధ్రువపత్రాల ప్రొఫార్మలో ఈ విధంగా మార్పులు చేయాలని ఆయా విభాగాలకు రైల్వే శాఖ సూచించింది. కాగా, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రక్షణ సిబ్బంది తదితరులకు భారతీయ రైల్వే శాఖ రూ.1,600 కోట్ల విలువ చేసే 53 రకాల రాయితీలు ఇస్తోంది. మాట్లాడలేని, వినలేని దివ్యాంగులకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం, దృష్టి బలహీనులకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్‌కార్, ఏసీ త్రీ ట్రైర్లో 75 శాతం, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. -
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
బద్వేలు: ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజు నకల్లు, చరిత్ర తెలిపే ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొంతమేర అవగాహన, కంప్యూటరు పరిజ్ఞానం ఉంటే సులువుగా వీటిని పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచే ఈసీలు, సీసీలు పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈసీకి 30 ఏళ్ల లోపు అయితే రూ.220, 30 సంవత్సరాలు పైబడితే రూ.520, దస్తావేజు నకళ్ల కోసం రూ.220 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో వీటిని పొందే అవకాశం కల్పించారు. పొందడం ఇలా...: ఆన్లైన్లో ఉచితంగా ఈసీలు, సీసీలు తీసుకోవావడానికి కంప్యూటర్, ఇంటర్న్‌ట్ సౌకర్యం ఉంటే చాలు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్.ఏపీ.జీఓవీ.ఇన్ అని టైపు చేయాలి. అప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అధికార వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ♦ వెబ్సైట్ కిందిభాగంలో కుడివైపున ‘న్యూ ఇంటెంటివిస్’ కింద ఆన్లైన్ ఈసీ, ఆన్‌లైన సీసీ, డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనే అప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే పబ్లిక్ ఆన్లైన్ సర్వీసు అని వస్తుంది. ♦ దీనిపై క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఆప్షన్లు వస్తాయి. అందులో నాట్ ఏ మెంబరు? పై క్లిక్ చేస్తే సిటిజన్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరు, యూజర్ ఐడీ, పాస్‌వర్డు, సెల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈ–మెయిల్, అడ్రస్ వంటి వివరాలు టూపు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డును నమోదు చేసి యూజర్ ఐడీ సహాయంతో లాగిన్ అవ్వాలి, ♦ అనంతరం ‘పబ్లిక్ ఆన్లైన్ సర్వీసుకు వెళ్లి యూజర్ ఐడీ, పాస్వర్డుతో లాగిన్‌కాగానే పబ్లిక్ ఆన్లైను పేరుతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన ఎన్కంబరెన్స్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (దస్తావేజులు, నకళ్లు), డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు కావాల్సిన సర్వీసుపై క్లిక్ చేసి పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ♦ ఉదాహరణకు సర్టిఫైడ్ కాపీ (సీసీ)లోకి వెళ్లాలంటే జిల్లా, ప్రాంతం, డాక్యుమెంట్ నెంబరు, సంవత్సరం వివరాలను ఎంటర్ చేస్తే అప్పుడు, డీడ్ పర్టిక్యూలర్ ఆఫ్ డాక్యుమెంట్ అని వస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే సెల్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డు వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే సర్టిఫైడ్ కాపీ రిసీవ్డ్ అని ఓపెన్ అవుతుంది. అనంతరం కావాలంటే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే క్లిక్ ఆప్షన్ నుంచి ఈసీలు, నకళ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. . ♦ 1983 నుంచి ఆన్లైన్లో ఉన్న ఈసీలు వస్తాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సొమ్ము చెల్లించి పొందవచ్చు. ♦ సర్టిఫైడ్ కాపీ నకళ్లు 1999 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి నగదు చెల్లించి పొందాల్సి ఉంటుంది. ♦ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ముందుగా వ్యవసాయ భూముల క్రయ దస్తావేజులు (సేల్) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ సైట్ ఎర్రర్ చూపిస్తోంది. త్వరలో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ♦ ప్రీ రిజిస్ట్రేషన్ దస్తావేజు ప్రిపరేషన్‌కు ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి. -
సర్టిఫికెట్టు.. తాకట్టు!
సాక్షి, హైదరాబాద్ : రాహుల్.. ఏడాది కిందట మేడ్చల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.. ఫస్టియర్ కాకుండానే అనారోగ్య సమస్యలతో కాలేజీ మానేశాడు.. ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయాయి.. వాటిని ఇవ్వాలని అడిగితే మిగతా మూడేళ్ల ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కరాఖండీగా చెప్పేసింది యాజమాన్యం! వెంకటేష్.. మొయినాబాద్‌లోని మరో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు.. ప్రథమ సంవత్సరం పూర్తయింది.. తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబ పోషణ భారం అతడిపై పడింది. సెకండియర్ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి.. యాజమాన్యాన్ని తన సర్టిఫికెట్లు అడిగితే మూడేళ్ల ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పింది.. దీంతో ఆ విద్యార్థి సాంకేతిక విద్యాశాఖకు ఫిర్యాదు చేశాడు. ..కోర్సులు పూర్తయిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదన్న సాకుతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న యాజమాన్యాలు.. అనివార్య కారణాల వల్ల చదువు మానేసిన విద్యార్థులకు కూడా చుక్కలు చూపుతున్నాయి! ఇంటర్ అర్హతతో ఇతర కోర్సులు చదువుకునే అవకాశమే లేకుండా చేస్తున్నాయి. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. కుటుంబ సమస్యలు, డిటెన్షన్, చదవలేకపోవడం వంటి కారణాలతో కాలేజీల్లో చేరుతున్న వారిలో ఏటా 5 వేల నుంచి 6 వేల మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. వీరంతా కాలేజీ నుంచి సర్టిఫికెట్లు వెనక్కి తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కనికరించకపోవడంతో సాంకేతిక విద్యాశాఖకు క్యూ కట్టారు. ఇలా గత పదిహేను రోజుల్లో 47 మంది విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఏఐసీటీఈ చెప్పినా.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం చదువు మానేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను వారికి తిరిగి ఇచ్చేయాలి. ఏ కారణంతోనూ నిరాకరించడానికి వీల్లేదు. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామన్న మెలిక పెట్టరాదు. ఈ విషయాన్ని ఏఐసీటీఈ 2017–18 ఇంజనీరింగ్ కాలేజీల అప్రూవల్ ప్రాసెస్‌లో స్పష్టం చేసింది. ఇబ్బందులతో చదువు మానేస్తున్న వారి సర్టిఫికెట్లు ఆపి మరింత ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాల తీరు మారడం లేదు. వీరేకాదు కోర్సు పూర్తయిన వారికి ఈ తంటాలు తప్పడం లేదు. దీంతో కొందరైతే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికైనా సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధుల విడుదలలో ఆలస్యం అవుతుండటంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. హైకోర్టుది అదే మాట.. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిరాకరించడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అటు సాంకేతిక విద్యాశాఖ సైతం కొన్ని కాలేజీలకు లేఖలు రాసింది. అయితే సర్టిఫికెట్లు ఇచ్చేయాలని చెప్పే అధికారం సాంకేతిక విద్యాశాఖకు లేదంటూ కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు మధ్యలో వెళ్లిపోతే తాము మిగతా సంవత్సరాల ఫీజును నష్టపోతామని వాదించాయి. అయితే హైకోర్టు కూడా విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపడానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
ఆ కులాల సర్టిఫికెట్ల జారీకి లైన్ క్లియర్
హైదరాబాద్: కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాల కుల ధృవీకరణ పత్రాల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కులాల వారికి ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని తహశీల్దార్లకు కట్టబెడుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాపుల ఆందోళన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. -
ఊపందుకున్న సర్టిఫికెట్ల పరిశీలన!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మంగళవారం ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 431 స్కూళ్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. అనంతపురం డివిజన్లో 75, గుత్తి డివిజన్లో 108, పెనుకొండ డివిజన్లో 128, ధర్మవరం డివిజన్లో 120 స్కూళ్ల టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. అన్ని డివిజన్లకూ సంబంధించి 56 స్కూళ్లు పెండింగ్ ఉన్నాయి. బుధవారం ఉదయమే వాటిని పూర్తి చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే ఈనెల 12తో ఈ ప్రక్రియను ముగించాల్సిన నేపథ్యంలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులు సైన్స్ సెంటర్‌కు రావాలని ఆదేశించారు. వివిధ పాయింట్ల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్ల ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలన్నారు. మళ్లీ కనిపిస్తే సస్పెండ్ చేస్తా : డీఈఓ ‘ఏవైనా పాయింట్లకు సంబంధించిన సమస్యలుంటే నేరుగా ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫిర్యాదులు చేయాలని పదేపదే చెప్పా. పత్రికల్లో వచ్చాయి. సెల్ఫోన్లలో రోజూ మెసేజ్‌లు పంపుతున్నా. అయినా టీచర్లలో మార్పు రావడం లేదు. పాఠశాల సమయంలో సైన్స్ సెంటర్‌కు ఎందుకొస్తున్నారు? మళ్లీ కనిపిస్తే సస్పెండ్ చేస్తా’ అని డీఈఓ హెచ్చరించారు. దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సైన్స్ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం పలువురు టీచర్లు కనిపించారు. వారిని చూడగానే డీఈఓ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను నాశనం చేయొద్దన్నారు. బడులు వదిలేసి రావద్దంటే కూడా అలాగే వస్తారా? అని మండిపడ్డారు. -
బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
ప్రక్రియ ముగిసేదాకా ఎంఈఓలు, హెచ్ఎంలకు సెలవుల్లేవ్ జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్‌కు 20 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా స్పౌజ్, ప్రిపరెన్షియల్ కేటగిరీలకు సంబంధించిన వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా బాధిత టీచర్లతో పాటు పరిశీలించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రకటించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామన్నారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ సాగింది. ఇదిలాఉండగా టీచర్ల బదిలీలపై ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని, ఈ ప్రక్రియ ముగిసేదాకా మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. -
సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన సజావుగా సాగింది. తొలిసారిగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రవేశపెట్టారు. రెక్టార్ హెచ్.లజపతిరాయ్ ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినికి స్క్రాచ్ కార్డును అందచేశారు. కౌన్సెలింగ్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిష¯Œ్స బీవీ రాఘవులు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాళ్లు సీఎ¯ŒS కృష్ణా నాయక్, వి.రంగస్వామి, సెరికల్చర్ విభాగాధిపతి ఎస్.శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వండి
వైద్య మంత్రికి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ చైర్మన్, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ వైద్య మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు. శనివారం సచివాలయంలో వైద్యుల సమస్యలపై మంత్రి లక్ష్మా రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో వైద్యుల జేఏసీ భేటీ అయింది. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టే పలు పథకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభైవేల మంది శిక్షణ పొందిన ఆర్ఎంపీ, పీఎంపీలను ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వని వారికి తక్షణమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కనకయ్య, జూపల్లి రాజేందర్, శంకర్ ముదిరాజ్, బాల బ్రహ్మచారి, వెంకట్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
19 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం జిల్లాకు రూ.325 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. ముందుగా 26 మండలాల్లో ఏ రైతుకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది.. తదితర వివరాలతో పత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేస్తారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అయితే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ భీమా పరిహారాలు వస్తే ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దానిని మాత్రమే ఇస్తారు. -
30 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
నంద్యాలఅర్బన్: పాలిసెట్-2017లో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం ఈ నెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వై. విజయభాస్కర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఉదయం 9గంటల నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, పాలిసెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ «ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు మొదలగు ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చన్నారు. జూన్ 8వ తేదీ ఆప్షన్లను మార్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. 10వ తేదీ కళాశాలల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కర్నూలులో జరుగుతుందని, ఎన్సీసీ, పీహెచ్, క్యాబ్, స్పొర్ట్స్ కేటగిరీల సంబంధించిన వారికి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వివరాలకు https://appolycet.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తేదీ - ర్యాంకులు 30.05.17 1 - 10వేలు 31.05.17 10001 - 20,000 01.06.17 20,001 - 32,000 02.06.17 32,001 -45000 03.06.17 45,001 - 60,000 04.06.17 60,001 - 75,000 05.06.17 75,001 - 87,000 06.06.17 87,001 - చివరి వరకు -
విద్యార్థుల చెంతకే ధృవపత్రాలు
- జాయింట్ కలెక్టర్ కీలక నిర్ణయం - కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రెవెన్యూశాఖ కర్నూలు(అగ్రికల్చర్): త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారభం కానున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన వివిధ రకాల ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులు పడుతున్న కష్టాలను తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన ధృవపత్రాలను వారి చెంతకే చేర్చాలని నిర్ణయించారు. ఈ వినూత్న విధానానికి కార్యాచరణ ప్రణాళికను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. స్కాలర్‌షిఫ్‌లు, ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఇతరత్రా సంక్షేమ ఫలాలు పొందడానికి విద్యార్థులకు పలు రకాల ధృవపత్రాలు అవసరమవుతాయి. విద్యా సంవత్సరం వస్తుందంటే చాలు వీటికోసం విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్ కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుల ధృవీకరణ పత్రాలు ఒకసారి తీసుకుంటే శాశ్వతంగా ఉపయోగపడుతాయి. అలాగే తెల్లరేషన్‌కార్డులున్న వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరంలేదు. నివాస ధృవీకరణ కోసం రేషన్ కార్డు/ఆధార్ కార్డును ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇది కార్యాచరణ ప్రణాళిక... మొదటి దశలో ఈ నెల 24 నుంచి 30వరకు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది విద్యా సంస్థలకు వెళ్లి ధృవీకరణ పత్రాల అవశ్యకతపై అవగాహన కల్పిస్తారు. ధృవపత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు దరాఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలు అందిస్తారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 10వరకు విద్యార్థులు తమకు అవసరమైన సర్టిపికెట్ల కోసం దరఖాస్తులు పూర్తి చేసి అవసరమైన ఫీజుతో సహా ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు. 11 నుంచి 20 వ తేదీ వరకు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది వీటిపై విచారణ జరిపి ధృవీకరణపత్రాలను మంజూరు చేస్తారు. మీసేవ నిర్వాహకులు వాటిని ప్రింట్ తీసి సంబంధిత తహసీల్దార్లకు అందచేస్తారు. ధృవ పత్రాల మంజూరు సమాచారం విద్యార్థులకు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. అనంతరం రెవెనూ సిబ్బంది వాటిని నేరుగా విద్యాసంస్థలకు తీసుకెళ్లి విద్యార్థులకు అందిస్తారు. -
ఇక చకచక ధ్రువీకరణ పత్రాలు
ఏలూరు సిటీ : విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు జేసీ పి.కోటేశ్వరరావు తెలిపారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఎ) అనిల్ చంద్రపునీత బుధవారం విజయవాడ నుంచి జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత మాట్లాడుతూ ఏప్రిల్ 15లోగా విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలి్సందిగా సూచించగా జేసీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల చెంతకే మీ సేవ కేంద్రాలను తరలించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అక్కడికక్కడే జారీ చేసే ప్రక్రియ పటిష్టవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కే.హైమావతి, సూపరింటెండెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
మీ షేర్లు పేపర్ల రూపంలో ఉన్నాయా?
ఎలక్ట్రానిక్ రూపంలోకి మారిస్తేనే అమ్మగలం ∙మార్చుకునే సమయంలో ఎన్నో పరిశీలనలు సంతకం సరిపోవాలి... పేర్లు కూడా మ్యాచ్ అవ్వాలి ∙లేదంటే అఫిడవిట్, నోటరీ సాయం అవసరం బెనిఫీషియరీ మరణిస్తే వారసుల పేరిట బదిలీ ∙అందుకోసం మరింత సుదీర్ఘ ప్రక్రియ షేర్లు ఎన్ని ఉన్నా, ఎంత విలువైనవి అయినా ఎలక్ట్రానిక్ రూపంలో స్మార్ట్‌ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే రోజులివి. కానీ, 20 ఏళ్ల క్రితం షేర్లన్నీ సర్టిఫికెట్ల రూపంలోనే ఉండేవి. 1996లో డిపాజిటరీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఎన్నో వ్యయ, ప్రయాసలు తప్పాయి. మరి 20, 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్ల పత్రాలు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా...? వాటిని తీరిగ్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలోకి (డీమ్యాట్) మార్చుకోవాలని అనుకుంటున్నారా...? అయితే, ఇందులో ఉన్న సాధక బాధకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి మరి. అలా చేస్తే అనవసర సమస్యలను ముందే నివారించుకోవచ్చు. డీమ్యాట్ తప్పనిసరి... షేర్లు ఎవరి పేరుతో అయితే ఉన్నాయో, వారి పేరిట డీమ్యాట్ ఖాతా కలిగి ఉండడం తప్పనిసరి. లేదంటే కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరవాలి. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, బ్యాంకుల ద్వారా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థల తరఫున డీమ్యాట్ ఖాతాలను అన్ని బ్రోకింగ్ సంస్థలూ అందిస్తున్నాయి. ఖాతా తెరిచిన తరవాత డిపాజిటరీ పార్టిసిపెంట్లకు (డీపీ) డీమ్యాట్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. డీఆర్ఎఫ్ను పూరించి షేర్ల సర్టిఫికెట్లను జత చేసి డీపీకి అందించిన తర్వాత... డీపీ వాటిని సంబంధిత కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు పంపిస్తుంది. సంతకాలు సరిపోలకుంటే...? సాధారణంగా డీమ్యాట్ దరఖాస్తుల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య సంతకాలు సరిపోలకపోవడమే. షేర్ల కొనుగోలు సమయంలో దరఖాస్తులో చేసిన సంతకానికి, తాజా డీమ్యాట్ దరఖాస్తులో ఉన్న సంతకానికి మధ్య తేడాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న వాటితో ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ఆర్టీఏ పంపిన అఫిడవిట్ పత్రాన్ని బెనిఫీషియరీ పూర్తి చేసి, దాన్ని బ్యాంక్ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయించి, అదనంగా బెనిఫీషియరీ గుర్తింపు పత్రం (ఆధార్/పాన్ కార్డు/పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి) జతచేసి తిరిగి పంపాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమై ఉన్న బ్యాంకు శాఖ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయిస్తేనే చెల్లుబాటు అవుతుంది. పేరులో తేడాలుంటే... షేర్ సర్టిఫికెట్‌పై ఉన్న పేరుకు, డీమ్యాట్ ఖాతాలో ఉన్న బెనిఫీషియరీ పేరుకు మధ్య స్వల్ప తేడా ఉన్నా ఇటువంటి ప్రక్రియనే అనుసరించాల్సి వస్తుంది. ఉదాహరణకు స్వామి సుందర్ అని డీమ్యాట్ ఖాతాలో ఉందనుకుందాం. షేర్ల సర్టిఫికెట్‌పై ఎస్.సుందర్ అని ఉంటే ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడానికి ముందు... ఆర్టీఏ మరింత స్పష్టత కోరతారు. ఇటువంటి సందర్భాల్లోనూ బెనిఫీషియరీకి అఫిడవిట్ పంపడం జరుగుతుంది. ఆ అఫిడవిట్‌ను పూర్తి చేసి దాన్ని నోటరీతో అటెస్టేషన్ చేయించిన అనంతరం, గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి వెనక్కి పంపాలి. ఉమ్మడి భాగస్వామ్యంతో ఉంటే... తమ దగ్గరున్న షేర్ల సర్టిఫికెట్లు ఉమ్మడి భాగస్వామ్యం (జాయింట్ హోల్డర్) లోనివి అయితే అప్పుడు ఉమ్మడిగా జాయింట్ డీమ్యాట్ ఖాతా తెరిచి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ అభ్యర్థన పంపవచ్చు. అలాగని జాయింట్ ఖాతానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. జాయింట్ షేర్ సర్టిఫికెట్లలో ఇద్దరు బెనిఫీషియరీలు ఉంటే, వారిలో ఎవరో ఒకరి పేరు మీదకు అయినా వాటిని డీమ్యాట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఇందుకు గాను ట్రాన్స్ఫర్ డీడ్ పత్రాన్ని పూర్తి చేసి పంపాలి. ఇటువంటి సందర్భాల్లో 0.25 శాతం స్టాంప్ డ్యూటీ (సంబంధిత షేర్ల మార్కెట్ విలువపై) విధించడం జరుగుతుంది. అయితే, ఇలా ట్రాన్స్ఫర్ డీడ్ రూపంలో కంటే ఉమ్మడిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్ల సర్టిఫికెట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడమే ఉత్తమం. ఎలక్ట్రానిక్ రూపంలోకి ఇలా... ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ తమ వద్దకు వచ్చిన షేర్ల పత్రాలను కంపెనీ రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ (ఆర్టీఏ) క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కంపెనీ రికార్డుల్లో బెనిఫీషియరీ (షేర్ల హక్కుదారుడు) సంతకంతో, తమకు అందిన దరఖాస్తులోని సంతకాలను పోల్చి చూస్తారు. జాయింట్ హోల్డర్ అయితే, ఆ వివరాలను కూడా పరిశీలిస్తారు. అలాగే, ఆ షేర్లను అప్పటికే ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉన్నారా? ఆ షేర్లకు సంబంధించి ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా? అవి ఫోర్జరీ చేసినవా? ఇలా అన్ని అంశాలను సరిచూస్తారు. ఒకవేళ మీ దగ్గరున్న షేర్ సర్టిఫికెట్ల తాలూకూ కంపెనీ మరేదైనా కంపెనీలో విలీనమై ఉంటే, ఆ కంపెనీని వేరే కంపెనీ కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు మనుగడలో ఉన్న కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు వివరాలు అందించాల్సి ఉంటుంది. రవాణాలో సర్టిఫికెట్లు పోతే..? షేర్ల డీమ్యాట్ ప్రక్రియలో భాగంగా షేర్ల సర్టిఫికెట్లు పోతే అందుకు కంగారుపడాల్సిన పనిలేదు. డీపీ ఆ బాధ్యత తీసుకుంటుంది. రవాణాలో షేర్ల సర్టిఫికెట్లు పోయినా, వాటికి నష్టం జరిగినా డీపీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. లబ్దిదారు మరణించి ఉంటే...? ఇంట్లో షేర్ల సర్టిఫికెట్లు ఉన్నా కానీ దాని యజమాని అప్పటికే మరణించి ఉండొచ్చు. ఆ షేర్లకు ఉమ్మడి భాగస్వామి కూడా లేకపోవచ్చు. ఇలాంటప్పుడు వారసుల్లో (జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా కుమార్తె) ఒకరు తమ పేరిట షేర్లను మార్చుకునేందుకు హక్కు ఉంటుంది. ఆర్టీఏ ఆమోదం అనంతరం సంబంధిత షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి వారసుల డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తారు. ఆర్టీఏ ఆమోదం కోసం బెనిఫీషియరీ మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ పత్రం, కోర్టు అధికారి అటెస్ట్ చేసిన దర్యాప్తు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ రూపంలో ఉన్న షేర్ల విలువ భారీ మొత్తంలో ఉంటే ఆర్టీఏ వాటిని వారసులకు బదిలీ చేయడానికి గాను మరిన్ని అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంటుంది. బెనిఫీషియరీకి ఒకటికి మించిన కంపెనీల్లో వాటాలు ఉంటే అప్పుడు వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకునేందుకు గాను ప్రతీ కంపెనీకి విడివిడిగా వీటిని పంపాల్సి వస్తుంది. డీమ్యాట్ రూపంలో ఉన్నపుడు... డీమ్యాట్ ఖాతా ఒక్కరి పేరిటే ఉండి, దాని యజమాని మరణించిన సందర్భాల్లో నామినీగా ఉన్న వారు బదిలీ పత్రం, డీమ్యాట్ ఖాతాదారుడు మరణించినట్టు నోటరీ ధ్రువీకరణ సమర్పిస్తే చాలు. ట్రాన్సిమిషన్ పత్రం డీపీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాల పరిశీలన తర్వాత డీపీ సంబంధిత ఖాతాలోని షేర్లను నామినీ ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నామినీగా ఎవరి పేరునూ నమోదు చేసి లేకుంటే చట్టబద్ధమైన వారసులు ఎన్వోసీ, కుటుంబ ఒప్పంద పత్రం తదితర అన్ని వివరాలను సమర్పించడం ద్వారా వాటిని పొందవచ్చు. ఇక జాయింట్ డీమ్యాట్ ఖాతా అయితే, అందులో ఒక బెనిఫీషియరీ మరణిస్తే, జీవించి ఉన్న వారు ట్రాన్సిమిషన్ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. -
‘ఫీజు’ గోడు పట్టదా?
• ఏపీ ట్రిపుల్ ఐటీల్లో తెలంగాణ విద్యార్థుల పాట్లు • ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని ప్రభుత్వం • కోర్సు ముగిసినా సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు సాక్షి, హైదరాబాద్: వారంతా సరస్వతీ పుత్రులు.. కష్టపడి చదివి ట్రిపుల్ఐటీల్లో సీట్లు సాధించారు.. మంచి మార్కులతో కోర్సులూ పూర్తి చేశారు.. కానీ ‘ఫీజు’ సమస్య వారి బంగారు భవిష్యత్తును చీకట్ల పాలు చేస్తోంది.. మంచి అవకాశాలు తలుపుతడుతున్నా అందుకోలేని దుస్థితిలో ముంచేస్తోంది.. ఒకరికి ఐఐటీలో సీటు వస్తే, మరొకరికి బహుళజాతి సంస్థలో ఉద్యోగం దక్కింది.. కానీ పైచదువు చదవలేరు, ఉద్యోగంలో చేరలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే దీనికి కారణం. ఫీజులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో పైచదువులు చదవలేని, ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితిలో విద్యార్థులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. మూడేళ్లుగా.. గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మూడు ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసింది. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పేరిట తెలంగాణలో బాసర, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయల్లో వాటిని నెలకొల్పింది. గ్రామీణ పేద విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సు బోధిస్తారు. విద్యార్థులకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2013 వరకు ప్రాంతాలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ అభీష్టం మేరకు తమకు సమీపంలోని ట్రిపుల్‌ఐటీలో చేరారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్ర విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి పరిమితమయ్యారు. అయితే అప్పటికే నూజివీడు, ఇడుపులపాయల్లోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందుకు సంబంధించి నిధులు మాత్రం విడుదల చేయలేదు. గత రెండేళ్లుగా వాటిలోని రాష్ట్ర విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని స్పష్టం చేశాయి. అసలే గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక, ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేయక ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు వందల మందికి పైగా.. రాష్ట్ర విభజనకు ముందు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ దూరం కావడంతో... నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలను ఎంపిక చేసుకునేవారు. ఇలా నాలుగేళ్ల పాటు ఏటా సగటున 150 మందికిపైగా ఈ రెండింటిలో ప్రవేశం పొందారు. ఇప్పుడా విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. ఇలా తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు బ్యాచ్‌లకు చెందిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశారు. వారిలో కొందరు చివరి సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అటు ఉద్యోగాలకు ఎంపికైనా సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో కంపెనీలు విధులకు హాజరుకానివ్వడంలేదు. ఫలితంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం మరో మూడు వందల మంది విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఫీజు అంశంపై వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫీజు కట్టలేని పరిస్థితి ట్రిపుల్ఐటీల్లో చేరిన విద్యార్థి ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు చదవాల్సి ఉంటుంది. దీనికి ఏటా రూ.35 వేలు ఫీజు. అంటే ఆరేళ్లకు కలిపి రూ.2.1 లక్షలు. అయితే ట్రిపుల్ఐటీల్లో చేరే విద్యార్థుల్లో చాలా వరకు పేదలే ఉంటుండడంతో ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి బాగానే ఉన్నా... తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య వచ్చింది. చెల్లింపులపై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒక్కో విద్యార్థి సగటున రూ.లక్ష వరకు కళాశాలకు బకాయిపడ్డారు. దీంతో కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కావడంతో ఫీజు కట్టలేని పరిస్థితి. అవకాశాలున్నా అందుకోలేని దుస్థితి అవకాశాలు తలుపు తడుతున్నా అందిపుచ్చుకోలేని పరిస్థితి ఖమ్మం జిల్లా సిరిపురానికి చెందిన తాళ్లూరి గోపిది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి రోజు కూలీ. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గోపి సీటు సాధించాడు. 2016లో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల గేట్ పరీక్ష రాసి 674 ర్యాంకు సాధించాడు. ఓవైపు ఐఐటీ తిరుచ్చిలో ఎంటెక్ సీటు, మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో ఓ సీనియర్ ప్రొఫెసర్ వద్ద ప్రాజెక్టు అసోసియేట్‌గా ఉద్యోగం వచ్చాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల పైచదువులు చదవలేక ఉద్యోగంలో చేరాడు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో నూజివీడు ట్రిపుల్ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఉద్యోగంలో చేరిన చోట మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే నెలవారీ వేతనం ఇస్తామని షరతు పెట్టారు. దీంతో మూడు నెలలుగా ఉద్యోగం చేస్తున్నా వేతనం అందుకోలేని పరిస్థితి నెలకొంది. అప్పు చేసి కట్టినా.. ఖమ్మం జిల్లా మధిరకు చిద్రాల సృజన చదువులో మేటి. తల్లి గృహిణి, తండ్రి టైలర్. పేద కుటుంబమైనా బాగా చదివి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. 2014లోనే కోర్సు పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్లో భాగంగా హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగమని సాఫ్ట్వేర్ కంపెనీ షరతు పెట్టింది. మరోవైపు చివరి రెండేళ్లకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ట్రిపుల్ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.60 వేలు అప్పుచేసిన సృజన.. ఆ డబ్బును ట్రిపుల్‌ఐటీలో కట్టి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, ఉద్యోగమిచ్చిన సంస్థకు సమర్పించింది. పేద కుటుంబం కావడంతో ఆ అప్పు ఇంకా తీర్చలేక, ఇప్పటికీ వడ్డీ కడుతున్నట్లు సృజన వాపోయింది. నెల రోజులకే ఆనందం ఆవిరి ఖమ్మం జిల్లాలోని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి సైదులు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. 2016లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లో వుడ్ప్లే అనే ఫర్నీచర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఇక ముందు బంగారు భవిష్యత్తేనని ఆనందపడ్డాడు. కానీ నెలరోజులకే పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో... ట్రిపుల్ ఐటీలో రూ.1.22 లక్షల ‘ఫీజు’ బకాయిలు పేరుకుపోయాయి. దాంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగంలో కొనసాగాల్సి ఉంటుందని కంపెనీ తేల్చి చెప్పడంతో.. ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాడు. ఉద్యోగం వచ్చినా.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన టి.గోపి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. 2016 నాటికి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లో ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరాన్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందేనని ఆ సంస్థ స్పష్టం చేసింది. అటు ‘ఫీజు’ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు రాలేదు. దీనిపై నూజివీడు ట్రిపుల్ ఐటీతో పాటు గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయంలోనూ సంప్రదించాడు. అధికారులెవరిని కలసినా ఫలితం రాలేదు. చివరికి టి.గోపి రెండో నెలలోనే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. -
‘సీసీ’ పెట్టు.. సర్టిఫికెట్ పట్టు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించుకున్న పోలీసుల శాఖ దానిని నెరవేర్చేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘గుడ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో సర్టిఫికెట్ల అమలులోకి తీసుకురావాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. దీనిపై భారీ స్థాయిలో ప్రచారం సైతం నిర్వహించనున్నారు. ఇప్పటికే దాదాపు 10 వేల మార్క్ దాటిన సీసీ కెమెరాల ఏర్పాటును లక్షకు చేర్చడం, వాటిని కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడం పోలీసుల ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అనేక కేసుల్లో కీలకాధారాలు... కేబీఆర్ పార్క్ వద్ద బడా వ్యాపారవేత్త మీద కాల్పులు, వెస్ట్‌జోన్ పరిధిలో జరిగిన టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులతో పాటు నగరంలో అనేక కీలక, సంచలనాత్మక నేరాలు కొలిక్కిరావడానికి సీసీ కెమెరాలే ఆధారమయ్యాయి. కేవలం కేసుల్ని పరిష్కరించి నేరగాళ్ళను పట్టుకోవడంతో పాటు న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిరూపించడంలోనూ ఈ ఫీడ్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసు విభాగం ప్రోత్సహిస్తోంది. ఓపక్క ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు మరోపక్క వృత్తి, వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలతో పాటు అపార్ట్మెంట్లు, స్కూళ్ళు, కాలనీ అసోసియేషన్లనూ కలుపుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆయా ఠాణాల్లో ఉండే ఇన్ స్పెక్టర్లకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తూ వీలున్నంత వరకు భారీ స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా సర్టిఫికెట్ల ఆలోచన... ఈ చర్యలకు కొనసాగింపుగా సర్టిఫికెట్ల అందజేత అంశాన్నీ నగర పోలీసులు పరిశీలిస్తున్నారు. నగరంలో ఏర్పాటయ్యే ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రజాభద్రతా చట్టంలోని అంశాలు, లండన్ నగరంలో ప్రభుత్వం ప్రజలు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటులో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు ముద్రిస్తున్నారు. వీటిని పోలీసుస్టేషన్ల వారీగా పంపిణీ చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ఫీడ్‌ను కనీసం 30 రోజులైనా భద్రపరిచేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి సంసిద్ధమయ్యారు. ఈ కెమెరాలు ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడంలో భాగంగా సర్టిఫికెట్ల జారీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వీయ భద్రతలో పాటు నగర భద్రతలో భాగస్వాములవుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వారికి ‘గుడ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో నగర పోలీసు కమిషనర్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఈ అంశాలపై ‘నేను సైతం’ పేరిట ఉండే కరపత్రాలను ముద్రించి వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు పోలీసుస్టేషన్ల వారీగానూ విస్తత స్థాయిలో ప్రచారం చేయడానికి సిటీ కాప్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
దూరవిద్యా రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, బీఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంల్ఐఎస్సీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాలను www.anucde.info వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను పోస్టుద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతామని పేర్కొన్నారు. -
డీఎడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం : డీఎడ్–2016 రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు డౌన్ లోడు చేసుకున్న విద్యార్థులకు డైట్ కళాశాలలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి అన్నారు. రెండో కౌన్సిలింగ్ స్లైడింగ్‌లో కొత్త కళాశాలలో సీట్లు పొందిన వారు గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదని అలాంటి వారు కూడా బుధవారం హాజరు కావచ్చనని ఆయన పేర్కొన్నారు. -
27న సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(అర్బన్): ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 27వ తేదిన పరిశీలించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సెల్ఫోన్లకు మెసేజ్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్‌కు రావాలన్నారు. -
ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు
♦ 8వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు ♦ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఆదేశాలు ♦ ‘క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు’ నిర్వహణ ♦ చదువు, ఆరోగ్యం స్థితిగతులన్నింటిపైనా సమాచారం సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థికి ఒక రికార్డు... అది చూస్తే విద్యార్థి చదువు, పరీక్ష ఫలితాలు, వ్యాధులు, చేయించాల్సిన చికి త్సలు.. అన్నీ ఇట్టే తెలిసిపోతాయి. క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచే అమలు చేసేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రూపొందించిన రికార్డులను ఆయా పాఠశాలలకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి రెండు రికార్డులను నిర్వహించనుంది. ఐదో తరగతి వరకు ఒకటి.. ఆరు నుంచి పదో తరగతి వరకు మరొకటి ఉంటుంది. అవి పాఠశాలల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థి సామర్థ్యాలు, పరీక్ష ఫలితాలు అన్నింటిని ఇందులో రికార్డు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అదే రికార్డులో నమోదు చేయాలి. అంతేకాదు.. విద్యార్థి 8వ తరగతి పూర్తయ్యాక.. ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువపత్రాన్ని ఇస్తుంది. వీటిని వెంటనే అమలు చేయాలని, త్రైమాసిక పరీక్షల (సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు) ఫలితాలను, విద్యార్థి సామర్థ్యాలను, వెనుకబడిన సబ్జెక్టులు, అందించాల్సిన ప్రత్యామ్నాయ బోధన అంశాలను అందులో పొందుపరచాలని విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నుంచే ప్రత్యామ్నాయ బోధనను ప్రారంభించాలని ఆదేశించింది. ‘ప్రోగ్రెస్ రికార్డు’లో నమోదు చేసే అంశాలు ⇒ విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, అడ్మిషన్ నంబరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, మతం, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు వివరాలు పొందుపరచాలి. ⇒ నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి పని తీరును అన్ని సబ్జెక్టుల్లో విశ్లేషిస్తూ.. వారి భాగస్వామ్యం, ప్రతి స్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు, మార్కులు గ్రేడ్ ఇవ్వాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు. ⇒ విద్యార్థుల అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నమోదు చేయాలి. ⇒ ప్రతి రోజు, నెల వారీగా విద్యార్థులు వేసుకోవాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మెరుగైన చికిత్స అవసరమైతే రెఫర్ చేసే ఆసుపత్రి వివరాలు, చేసిన చికిత్సలు అన్నింటిని వైద్యాధికారి నమోదు చేయాలి. -
తప్పు.. ఆ తల్లిదండ్రులదే..
* వారి అత్యాశకు పిల్లలే బాధితులు * పిల్లల చదువులపై తల్లిదండ్రులకు హైకోర్టు చురకలు సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువుల విషయంలో అత్యాశలకు పోతున్న తల్లిదండ్రులకు హైకోర్టు చురకలంటించింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు కారణమైన ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులను మందలించింది. ఆ ఇద్దరు విద్యార్థినులపట్ల హైకోర్టు మానవతాదృక్పథంతో వ్యవహరించింది. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే..: రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు గతేడాది ఏపీలో జరిగిన ఎంసెట్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల నిమిత్తం ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో స్థానికతకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. దీంతో ఎన్టీఆర్ వర్సిటీ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆ విద్యార్థినులు ఈ ఏడాది కూడా ఏపీ ఎంసెట్ పరీక్ష రాసి ఉత్తమర్యాంకులు సాధించారు. అయితే ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వర్సిటీ నిరాకరించడంతో ఆ విద్యార్థినులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారి తల్లిదండ్రులే నిజమైన నేరస్థులు.. ‘పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు వాస్తవమైతే, నిజానికి నేరస్థులు ఆ విద్యార్థులు ఎంత మాత్రం కారు. వారి తల్లిదండ్రులే నిజమైన నేరస్తులు. తల్లిదండ్రుల ఆలోచనలు.. వైద్యులుగా ఆస్పత్రుల్లో ఉండాల్సిన తమ పిల్లలను పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగేలా చేశాయి. విద్యార్థినులను సస్పెండ్ చేయడం ద్వారా వర్సిటీ ఇప్పటికే వారిని శిక్షించింది. ఉత్తమ ర్యాంకులు సాధించినవారికి ఈ ఏడాది కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రవేశాలు నిరాకరించడం రెండోసారి శిక్షించడమే అవుతుంది. వారి గత ప్రవర్తనకు మొత్తం జీవితాలే బలికావడం అన్యాయమే అవుతుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
సర్టిఫికెట్లు ఇస్తేనే పరీక్షకు అనుమతి
భీమునిపట్నం: ధ్రువపత్రాలను ముందుగా అందజేస్తేనే గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు అనుమతి లభిస్తుందని గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ కె.ప్రమీలాదేవి తెలిపారు. భీమిలి, అచ్యుతాపురం, నర్సీపట్నంలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో (ఇంగ్లిషు మీడియం) ఖాళీల భర్తీ కోసం జరిగే ప్రవేశ పరీ„ý కు హాజరయ్యే విద్యార్థులు వారి సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలను తప్పనిసరిగా అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీన భీమిలి బాలికల గురుకుల పాఠశాలలో పరీక్ష జరుగుతుందని, ఇందులో పాల్గొనే విద్యార్థులు 9వ తేదీన స్టడీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలను తీసుకువచ్చి అందివ్వాలని, లేకపోతే పరీక్షకు అనుమతించరని Ðð ల్లడించారు. -
నేటి నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్
అంగలూరు(గుడ్లవల్లేరు) : డైట్ సెట్– 2016 తొలి విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి నిర్వహించనున్నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీట్ల కేటాయింపు, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడు శనివారమే జరుగుతుందన్నారు. ఏడో తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈ నెల 9న తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రొవిజినల్ ఎలాట్మెంట్ లెటర్‌ను ప్రభుత్వ డైట్ నుంచి తీసుకుని కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. -
7 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : ఏపీ డీఈఈసెట్–2016లో అర్హులైన అభ్యర్థులకు వారికి కేటాయించిన ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈ నెల ఏడు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ అప్పారి జయప్రకాశరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. డీఈఈసెట్లో అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన డైట్, ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చారన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందినవారు ఈ నెల ఆరో తేదీన ఎలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తమకు ఏ కళాశాలలో, ఏ జిల్లాలో సీటు వచ్చిందో, ఏ ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలో క్షుణ్ణంగా చదువుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నిర్దేశిత తేదీల్లో ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్‌తోపాటు, ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్ కాపీ తీసుకురావాలన్నారు. దాని ఆధారంగా మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఎలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు. జిల్లాకు సంబంధించి బొమ్మూరులోని ప్రభుత్వ డైట్ కళాశాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. నిర్దేశిత ఫీజులు ఆన్లైన్లో చెల్లించిన తరువాత ఫైనల్ అడ్మిషన్ లెటరు అందజేస్తామని తెలిపారు. -
ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
సాక్షి మైత్రి మహిళ కోఆర్డినేటర్ శ్రీహరి మధురానగర్ : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరోనలుగురికి ఉపాధి కల్పించే విధంగా సాక్షి మైత్రి మహిళ పనిచేస్తుందని కార్యక్రమ కోఆర్డినేటర్ ఇ.శ్రీహరి తెలిపారు. స్థానిక మారుతీనగర్ కాకర్లవారి వీధిలో సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంతో నిర్వహించిన కుట్టుశిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వారిలో వృత్తినైపుణ్యాలు పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. తమ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. సుశిక్షుతులైన సిబ్బంది చేత శిక్షణ ఇప్పించి అనంతరం సర్టిఫికెట్ అందజేస్తున్నామని తెలిపారు. రిసోర్స్‌పర్సన్ ప్రసాద్ మాట్లాడుతూ సాక్షి మైత్రి మహిళ ద్వారా మారుతున్న కాలనుగుణంగా మహిళలకు ఏది అవసరమో గుర్తించి ఆ రంగంలో శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు. అనంతరం కోర్సు పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు ‘సాక్షి’తో మాట్లాడారు.. -
నంద్యాల ఆర్డీఓ, సీఐల కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి
కలెక్టర్, ఎస్పీకి కోర్టు ఆదేశం కర్నూలు(లీగల్): న్యాయవాది పాములేటి కాళ్లకు సంకెళ్లు వేసిన ఘటన కేసులో నంద్యాల ఆర్డీఓ, అప్పటి త్రీటౌన్ సీఐ, ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల కులధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10వ తేదీన నంద్యాల న్యాయవాది పాములేటి మరో ఇద్దరిపై నంద్యాల త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా అక్కడ కాళ్లకు బేడీలు వేయడంతో పాములేటి కర్నూలులో ప్రై వేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో ఫిర్యాది, సాక్షుల వాంగ్మూలలను నమోదు చేసిన న్యాయమూర్తి వీవీ శేషుబాబు బుధవారం నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్, సీనియర్ సహాయకులు సుధాకర్‌రావు, సీఐ వెంకటరమణ, కానిస్టేబుళ్లు శోభన్‌బాబు, లక్ష్మణ్రావుల కులధ్రువీకరణ పత్రాలను అందించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని కాల్వబుగ్గ, పత్తికొండ, కర్నూలు మైనార్టీ బాలురు, బనవాసి కర్నూలు మైనార్టీ బాలికల పాఠశాలల్లో ఆరు,ఏడు తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపాల్ ఉబేదుల్లా మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దరఖాస్తులను సమీపంలోని గురుకుల పాఠశాలలో పొందవచ్చని, పూరించిన దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జతపరచి ఈ నెల 30వ తేదీలోపు కర్నూలులోని ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీఉదయం పది గంటలకు ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఖాళీల వివరాలు : 6వ తరగతి బాలురు–ఓసీ–6, బీసీఏ–3, బీసీబీ–2, బీసీడీ–4, బీసీఈ–1, ఎస్సీ–7,ఎస్టీ–4. సైనికోద్యోగుల పిల్లలు–2, అనాథలు–2 6వ తరగతి బాలికలు : ఓసీ–2, ఎస్సీ–8 7వ తరగతి బాలురు : ఓసీ–2, బీసీబీ–1, ఎస్సీ–2 7వ తరగతి బాలికలు : ఓసీ–1, ఎస్సీ–3 -
20 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి ఈ ఏడాదికి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందని డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు తెలిపారు. ఎంపికైన మొత్తం 1151 విద్యార్థుల్లో 20వ తేదీన 576 మందికి, 21వ తేదీన 575 మందికి కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన వివరించారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకుంటే ముందుగా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. లేకుండా ఎంపిక రద్దు చేస్తామని తెలిపారు. -
కుల, నివాస సర్టిఫికెట్లకు ఆధార్ లింక్
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులకు కుల, నివాస ధ్రువపత్రాలను ఇచ్చేముందు వాటిని వారి ఆధార్ కార్డులతో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం ...రాష్ట్రాలను కోరింది. ఐదు, ఎనిమిదో తరగతులు చదువుతున్న విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 60 రోజుల్లోగా ఈ ధ్రువపత్రాలు అందేలా చూడాలని కోరింది. ఎస్సీ, ఎస్టీలకు విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్ షిప్ లలో ప్రతి ఏడాది జాప్యం జరుగుతోందని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కుల, నివాస పత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు తమ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ పాస్ లో ఉన్న విద్యార్థుల జాబితాలతో ఆధార్ ను లింక్ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరింది. -
‘కల్యాణలక్ష్మి’ అక్రమార్కులపై కొరడా
► ఏడుగురు నిందితులకు రిమాండ్ ► పరారీలో కార్యదర్శి, హెచ్‌డబ్ల్యూఓ అమ్రాబాద్ : కల్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై మూడు కేసులు నమోదు కాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను బుధవారం ఇక్కడ ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. అమ్రాబాద్ మండలంలోని ఈదులబావికి చెందిన రామానుజమ్మ, అన్న ఆంజనేయులు, ఎమిరెడ్డిపల్లికి చెందిన ఎనుపోతుల శ్రీదేవి, భర్త మన్నెం వెంకటయ్య, కుమార్ (శ్రీదేవి అన్న), తిర్మలాపూర్ (బీకే) కు చెందిన పెర్ముల అరుణమ్మ, భర్త చక్రపాణిలపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వీరందరినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాస్తవానికి రామనుజమ్మకు 2009లో కుమ్మరోనిపల్లి వాసి చంద్రయ్యతో వివాహం కాగా 2014 అక్టోబర్ 26న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కల్యాణలక్ష్మి కింద లబ్ధి పొందారు. శ్రీదేవికి ఎనిదేళ్లక్రితమై వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా 2015 ఫిబ్రవరి 22న జరిగినట్టు చూపించారు. అరుణమ్మకు మూడేళ్ల క్రితమే పెళ్లికాగా 2014 నవంబర్ 3న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక్కొక్కరు ఈ పథకానికి సంబంధించి రూ.51 వేలు తీసుకున్నట్లు తేలింది. ఈ ధ్రువపత్రాలన్నీ అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులోని వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్పిడి చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో దళారీలతో అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల సమాచారం అందింది. దీనిపై ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తాజాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో నిందితులైన అమ్రాబాద్ గ్రామ కార్యదర్శి అంజనేయులు, విచారణ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ) హన్మంత్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
మోదీ సర్టిఫికెట్లు అసలువా, నకిలీవా?
న్యూఢిల్లీ: గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని నకిలీ డిగ్రీ వివాదంలో చిక్కుకోగా ఇప్పుడు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఆ వివాదంలో చిక్కుకున్నారు. మోదీ చెబుతున్న డిగ్రీ, పీజీ డిగ్రీలు నకిలీవని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు వారు సమాచార హక్కు దరఖాస్తులను అస్త్రాలుగా చేసుకుంటున్నారు. నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అసలువేనంటూ బీజేపీ సీనియర్ నేతలు సోమవారం నాడు పత్రికా విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ డాక్యుమెంట్లను చూపించినా ఆప్ నేతలు విశ్వసించడం లేదు. మోదీ డిగ్రీ పట్టా నకిలీదని ఆప్ నేతలు ఆరోపించడానికి కారణం, 1978లో డిల్లీ యూనివర్శిటీ జారీ చేసిన సర్టిఫికెట్లో నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (అసలు పేరు)కి బదులుగా నరేంద్ర మహావీర్ మోదీ అని ఉండడమే. అంతేకాకుండా మార్కు షీట్లకు, సర్టిఫికెట్ పేరుకు కూడా తేడా ఉండడం వారి అనుమానాలకు కారణం అవుతోంది. 1983లో గుజరాత్ యూనివర్శిటీ జారీ చేసిన మోదీ పీజీ పట్టా విషయంలోను ఆప్ నేతలు అనుమానాలను లేవనెత్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పలుసార్లు పోటీ చేసి గెలిచిన నరేంద్ర మోదీ అన్ని అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోనూ తన విద్యార్హతలను డిగ్రీగానే పేర్కొన్నారు. 2014లో లోక్‌సభకు పోటీ చేసినప్పుడు మాత్రం ఆయన తన విద్యార్హతలను పీజీగా పేర్కొన్నారు. అంతకుముందు ఎందుకు ఆయన పీజీ పట్టాను పేర్కొనలేదన్నది ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్న. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్టు చెప్పుకుంటున్న మోదీ పీజీ సర్టిఫికెట్లో ఆయన ఫస్ట్‌క్లాస్‌లో పాసైనట్లు ఉంది. ఎన్నడూ కాలేజీకి సరిగ్గా హాజరుకాని మోదీకి పొలిటికల్ సైన్స్‌లో అన్ని మార్కులు వచ్చే అవకాశమే లేదని, ఆ సర్టిఫికెట్ నిజం కాకపోవచ్చని ఆయన చదువుకున్నప్పటి ఫాకల్టీ సభ్యుడొకరు ఆరోపించడం ఆప్ నేతల అనుమానాలకు బలం చేకూర్చింది. మోదీ దేశ ప్రధాన మంత్రి అవడానికి విద్యార్హతలు ఏమిటన్నది ఎప్పుడూ సమస్య కాదు. మోదీ నిజం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా? అన్న విషయంలో ఆయన నైతికత ఎంత అన్నదే ఇక్కడ ప్రశ్న. అంతకుముందు ఎన్నికల అఫిడవిట్లలో డిగ్రీ పట్టాను విద్యార్హతగా పేర్కొన్న మోదీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎందుకు పీజీ పట్టాను పేర్కొనాల్సి వచ్చింది. పీజీని తప్పుగా పేర్కొన్నట్లయితే మోదీ ఎన్నికల కమిషన్‌ను తప్పదారి పట్టించినట్లు అవుతుంది. ఒకవేల 1983లో ఫెయిలైన మోదీ లోక్‌సభ ఎన్నికల నాటికి పీజీని పూర్తి చేశారా ? అదే నిజమైతే సర్టిఫికెట్లో పాసైన తీదీ తాజాదై ఉండాలి. మరి అలా లేదే. ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సింది స్వయంగా మోదీనే. -
బీసీ సంపన్న శ్రేణి అమలు
వేతనం, వ్యవసాయ ఆదాయం లేకుండా.. వార్షికాదాయం రూ. 6 లక్షలు దాటితే క్రీమీలేయర్ పరిధిలోకి.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, వ్యవసాయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసిన మెమో (నెంబరు 3009/బీసీడబ్ల్యూ/ఓపీ/2009)ను ప్రభుత్వ (బీసీ సంక్షేమ శాఖ) ముఖ్య కార్యదర్శి రాధా జారీ చేశారు. వేతనాలు, వ్యవసాయ ఆదాయం మినహాయించి మిగతా మార్గాల్లో వచ్చే వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉన్నవారు బీసీ క్రీమీలేయర్ (బీసీ సంపన్న శ్రేణి) పరిధిలోకి రారని స్పష్టం చేశారు. సర్టిఫికె ట్లు జారీ చేసే సమయంలో వీటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. అంతేకాదు ప్రస్తుతం నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇందుకోసం దాని ఫార్మాట్‌ను కూడా భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వివిధ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకొని బీసీ కోటాలో వారికి రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. అదే రూ. 6 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే వారిని పరిగణనలోకి తీసుకుంటారు. బీసీలు అయినప్పటికీ రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతర్జాతీయ సంస్థల్లో అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లోని అధికారులు, గ్రూపు-1, గ్రూపు-2 (క్లాస్ 1, క్లాస్ 2) అధికారులు, రూ. 6 లక్షలకు పైగా వార్షికాదాయం కలిగిన ఇతరుల పిల్లలంతా బీసీ క్రీమీలేయర్ పరిధిలోకే వస్తారని బీసీ సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు నియామకాలకు మోక్షం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల వర్తింపులో క్రీమీలేయర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే బీసీ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా? అన్నది పరిశీలిస్తామని పేర్కొంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీఎస్పీఎస్సీ, టీఎస్జెన్కో వంటి సంస్థలు నాలుగు నెలల కిందటే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు నిర్వహించాయి. ఇక అభ్యర్థులు బీసీల్లో సంపన్న శ్రేణి పరిధిలోకి రాకపోతే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఆయా నోటిఫికేషన్లలోనే ప్రకటించాయి. అయితే టీఎస్పీఎస్సీ రెండు నెలల కిందటే వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా బీసీ క్రీమీలేయర్ అమలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాక నియామకాలు చేపట్టలేదు. ఇక ఇంటర్వ్యూలు ఉన్న పోస్టులకు 1:2 చొప్పున అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. వాటికి క్రీమీలేయర్‌పై స్పష్టత అవసరం కావడంతో ఇంటర్వ్యూలకు మెరిట్ జాబితాలను సిద్ధం చేయలేదు. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు ఇవ్వాలి ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వివిధ పోస్టులకు ఎంపికయ్యే వారు బీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతోపాటు, సీసీఎల్ఏకు నాన్ క్రీమీలేయర్ ఫార్మాట్‌ను అందజేశారు. ఆ ఫార్మాట్ ప్రకారం రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. -
సర్టిఫికెట్ల కోసం విద్యార్థి అవస్థలు
-
సర్టిఫికెట్ల కోసం విద్యార్థి అవస్థలు
రంగారెడ్డి: ప్రైవేటు కళాశాలలో చేరడమే వారు చేసిన తప్పా? కాలేజీ ప్రవేశాల సమయంలో కాలేజీ యాజమాన్యాలే ఇళ్లకు వచ్చి మరీ విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకుంటారు. కానీ, సర్టిఫికెట్ల కోసం మాత్రం చివరలో విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. తన సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ విద్యార్థి కాలేజీ అధికారుల కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా కళాశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ కాలేజీలో వెలుగు చూసింది. ఆ విద్యార్థి, తన తల్లిదండ్రులతో పాటు కాలేజీకి చేరుకుని అధికారులను బతిమాలాడారు. -
ధ్రువపత్రాల జారీ కేసులో ఇద్దరికి రిమాండ్
కుంటాల (ఆదిలాబాద్) : తహశీల్దార్‌కు తెలియకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో వీఆర్‌ఏతోపాటు తాత్కాలిక ఉద్యోగి ఒకరిని పోలీసులు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుంటాల మండలానికి చెందిన వీఆర్ఏ గంగాధర్, తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న మరో వీఆర్ఏ లక్ష్మీబాయి కుమారుడు రవి కలసి మహారాష్ట్ర వాసులు 12 మందికి కుల తదితర ధ్రువీకరణపత్రాలు జారీ చేశారు. దీనిపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఐ వినోద్ ఆధ్వర్యంలో విచారణ జరిపి, ఆరోపణలు రుజువని తేలటంతో సోమవారం గంగాధర్, రవిలను రిమాండ్‌కు పంపారు.తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పుష్కరాల విధుల్లో ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే వారిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, పలువురికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని ఈ సందర్భంగా సీఐ తెలిపారు. -
ఫీజు ప్లీజ్!
- ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వని ప్రభుత్వం - విద్యార్థుల సర్టిఫికెట్లను అట్టిపెట్టుకుంటున్న కళాశాలలు - ఉద్యోగం వచ్చినా వెళ్లలేని స్థితి - ఆందోళనలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఫీజురీయింబర్స్‌మెంట్‌పై సర్కారు చేస్తున్న జాప్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కోర్సు చదువుతున్న విద్యార్థుల సంగతి అటుంచితే.. చదువు పూర్తిచేసి ఉద్యోగాల బాట పట్టే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. చదువు ముగిసినా ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. ఫీజు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లివ్వమని తేల్చిచెప్పడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. పరిశీలన స్థాయిలోనే.. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై గందరగోళం నెలకొంది. స్థానికత నిబంధనలంటూ కొంతకాలం గడిపిన సర్కారు.. 2014-15 విద్యాసంవత్సరం ముగిసే సమయంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు తెరలేపింది. ఈ క్రమంలో కోర్సు ముగిసిన తర్వాత ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వృత్తి విద్యనభ్యసిస్తున్న వారంతా దాదాపు కోర్సు చివరి దశలు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా జూన్ 17వరకు దరఖాస్తుల కాలం ముగిసిన తర్వాత సర్కారు.. ఇప్పుడు పరిశీలన పేరిట జాప్యం చేస్తోంది. తలలు పట్టుకుంటున్న ఇంజినీర్లు.. కోర్సు ముగిసిన వెంటనే ఉద్యోగాల బాటపట్టేవారిలో ఇంజినీరింగ్ విద్యార్థులే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో పలు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అర్హత సర్టిఫికెట్ల ఆవశ్యకత ఉంటుంది. కానీ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ కాలేజీల్లోనే ఉన్నాయి. ఫీజు చెల్లిస్తే తప్ప వాటినివ్వమని తెగేసి చెప్పడంతో ఆయా విద్యార్థులు తలలుబాదుకుంటున్నారు. ఒకవైపు ప్రవేశాల శాతం తగ్గిపోతుండడంతో ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటున్నామని, ఈ పరిస్థితిలో విద్యార్థులపై ఒత్తిడి తేవాల్సివస్తోందని ఓ కళాశాల డెరైక్టర్ ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. బకాయిలు రూ.699 కోట్లు జిల్లాలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంక్షేమశాఖలు భారీగా బకాయి పడ్డాయి. విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో, కాలేజీలకు ఫీజుల రూపంలో ఏకంగా రూ. 689కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో అధికంగా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ బీసీలకు రూ. 301.5కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈబీసీలకు 310.2కోట్లు చెల్లించాలి. 2014-15 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు కేవలం రూ. 31కోట్లు మాత్రమే విడుదలైనప్పటికీ.. పైమొత్తం బకాయి పడింది. అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి సంస్థ రూ.58 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ 29కోట్ల బకాయిలున్నాయి. బకాయిలు భారీగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. -
ఫీజులు కాటేస్తున్నాయ్....