సర్టిఫికెట్లు మున్నేరుపాలు | Certificates Of About 500 Students Were Swept Away In The Munneru Floods, More Details Inside | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్లు మున్నేరుపాలు

Published Wed, Sep 4 2024 2:56 AM | Last Updated on Wed, Sep 4 2024 12:56 PM

Certificates of about 500 students were swept away in the flood

ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరదలో కొట్టుకుపోయిన దాదాపు 500 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు

ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలని బాధితుల వినతి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి. టెన్త్‌ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 

ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా.. కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక వచ్చేసరికి వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. మరికొందరికి చెందిన సర్టిఫికెట్లు పూర్తిగా తడిసిపోయాయి. 

అలాగే పుస్తకాలు, కోచింగ్‌ మెటీరియల్, స్కూల్‌ యూనిఫారాలు, కంప్యూటర్లు/ల్యాప్‌టాప్‌లు కొట్టుకుపోవడం లేదా బురదమయం అయ్యాయి. దీంతో విద్యార్థులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. పైచదువులకు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనేందుకు సర్టిఫికెట్లు లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతున్నారు.

చదువుల తల్లులకు ఎంత కష్టం.. 
ఖమ్మం మున్నేటి ఒడ్డున వెంకటేశ్వరనగర్‌లో గట్టు రేణుక టైలరింగ్‌ చేస్తూ ఇద్దరు కూతుర్లను ఉన్నత విద్య చదివించింది. వారిలో తేజశ్రీ మమత మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా.. పావని అదే కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ మెరిట్‌ స్టూడెంట్స్‌ కావడంతో ఉచిత సీట్లు సంపాదించారు. 

తేజశ్రీకి చెందిన ఎంబీబీఎస్, ఇంటర్, టెన్త్‌ సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. ఎంబీబీఎస్‌ స్టడీ మెటీరియల్‌ బురదమయమైంది. పావని సర్టిఫికెట్లు బురదలో కూరుకుపోయాయి. లాప్‌టాప్‌తోపాటు స్టడీ మెటీరియల్‌ కలిపి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఇంట్లో 90 శాతం మేర సామగ్రి కొట్టుకుపోవడంతో తమను ఆదుకోవాలని రేణుక, వారి పిల్లలు అధికారులను వేడుకుంటున్నారు.

ఉద్యోగానికి రమ్మనే లోపే.. 
ఖమ్మం వెంకటేశ్వరనగర్‌కు చెందిన పోరండ్ల వినయ్‌కుమార్‌ శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఆయనకు ఈ నెల 2న సరి్టఫికెట్లతో రావాలని పిలుపు వచ్చింది. ఇంతలోనే ఆదివారం (1వ తేదీన) వారి ఇంటిని వరద తాకింది. 

గంటగంటకు వరద తీవ్రత పెరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వినయ్‌కుమార్‌ తల్లిదండ్రు లతో కలిసి పునరావాస కేంద్రానికి వెళ్లగా ఆయన సరి్టఫికెట్లు కొట్టుకుపోయాయి. రూ.70 వేల విలువైన రెండు లాప్‌టాప్‌లు కూడా మున్నేటి పాలయ్యాయి. స్టీల్‌ షాపులో పనిచేస్తూ తనను తల్లిదండ్రులు చదివించారని.. ఇప్పుడు ఉద్యోగానికి ఎలా అర్హత సాధించాలో తెలియడం లేదని వినయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement