ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి సదరెం క్యాంపుల్లో అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేయడంపై జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం ధ్వజమెత్తింది.
కరీంనగర్ : ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి సదరెం క్యాంపుల్లో అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేయడంపై జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం ధ్వజమెత్తింది. ఉపాధిలో అక్రమాలు, అంగన్‌వాడీల్లో సరుకుల పక్కదారి, వివిధ పథకాలు, పింఛన్లపై సభ్యుల నిలదీతల మధ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ వివిధ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం ఉదయం జె డ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు.
మహిళా సంక్షేమ సంఘ 5వ స్థాయీ సం ఘ సమావేశం రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అధ్యక్షతన ఉదయం జరిగింది. మేడిపల్లి జెడ్పీటీసీ వి.పూర్ణిమ మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ సీడీపీవో రాధమ్మ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, అం గన్‌వాడీ సెంటర్లకు నేరుగా జమయ్యే రూ.వెయ్యి బలవంతంగా తీసుకుని రూ.330 విలువగల కుక్కర్లు కట్టబెట్టి ఒక్కో కుక్కర్‌పై రూ.650 కాజేసిందని ఆరోపించారు. పౌష్టికాహారానికి అందించే కోడిగుడ్లు పక్కదారి పట్టిస్తోందని, వేధింపులు రివాజుగా మారాయని ఆ రోపించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, స్థా యీ సంఘం చైర్‌పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ ఫిర్యాదులు మళ్లీ వస్తే ఉపేక్షించేది లేదని, ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని అధికారులను హెచ్చరించారు. సీడీపీవోపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని పీడీని ఆదేశించారు. రాయికల్ జెడ్పీటీసీ జి.మాధవి మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు గంట ముందు చెబితే ఎలా చేరుకుంటామని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ భవనాల మరమ్మతుకు నిధులు కేటాయించాలని వెల్గటూర్ జెడ్పీటీసీ గంగుల పద్మ కోరారు.
పేలవంగా సాంఘిక సంక్షేమస్థాయి
సంఘ సమావేశం
సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘ సమావేశం పేలవంగా సాగింది. చైర్‌పర్సన్, పెగడపల్లి జెడ్పీటీసీ గజ్జెల వసంత అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సమావేశంలో 11 మంది సభ్యులకు కేవలం కోరుట్ల, సారంగాపూర్ జెడ్పీటీసీలు కొంతం రాజు, భూక్య సరళ మాత్రమే హాజరయ్యారు. సభ్యులు రాకపోవడంతో పెద్దగా చర్చలేకుండానే అధికారులు ప్రగతి నివేదికలు చదివి మమ అనిపించారు.