
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, సీపీఐ జిల్లా సభ్యుడు బత్తుల బాబు ప్రశ్నించారు. మండల కేంద్రంలో సోమవారం వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పేదల బలహీనతలను గుర్తించి ఆశల పథకాలతో గెలవడం కేసీఆర్‌కు పరిపాటి అయిందన్నారు.
గతంలో ప్రకటించిన మూడెకరాల భూమికంటే రూ.10 లక్షలు ఎక్కువ కాదని, ఆ డబ్బులకు మూడెకరాల్లో ప్రస్తుతం 10 గుంటల భూమి కూడా రాదన్నారు. మూడెకరాలు ఇస్తే రూ.60 లక్షలు అవుతుందని గమనించి, రూ.10 లక్షల నగదు ఇస్తామని దళితులను మోసం చేస్తున్నారన్నారు. దళితులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని దళిత సమాజం గమనిస్తుందన్నారు. ఈ పథకం హుజూరాబాద్ ఎన్నికల వరకే ఉంటుందన్నారు.