‘డిజీ’ లాకర్‌తో సర్టీఫికెట్లు భద్రం | Certificates are safe with Digi locker: telangana | Sakshi
Sakshi News home page

‘డిజీ’ లాకర్‌తో సర్టీఫికెట్లు భద్రం

Published Wed, Sep 18 2024 5:26 AM | Last Updated on Wed, Sep 18 2024 5:26 AM

Certificates are safe with Digi locker: telangana

డిసెంబర్‌ నాటికి అప్‌లోడ్‌ పూర్తిచేయాలని యూజీసీ నిర్ణయం

యూనివర్సిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ

విశ్వవిద్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్టులు షురూ  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్వ్యూకి వెళ్లే విద్యార్థి చేతిలో ఫైల్‌...అందులో విద్యాభ్యాసానికి చెందిన అన్ని సర్టిఫికెట్లు... అవన్నీ ఆర్డర్‌లో ఉన్నాయా లేదా? అని ముఖంలో కంగారు... అయితే.. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఏఐ సాంకేతికతతో మారబోతోందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చెబుతోంది. మౌస్‌ క్లిక్‌తో క్లౌడ్‌కు కనెక్ట్‌ అవ్వడం... టెన్త్‌ దగ్గర్నుంచీ పీహెచ్‌డీ దాకా డిజిటల్‌గా చూసే విధానానికి నాంది పలుకుతోంది.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ‘డీజీ’లాకర్‌ను అందుబాటులోకి తేవాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్‌ ప్రాజెక్టులను మొదలు పెట్టాయి. ఇందులోని సవాళ్లను పరిశీలించిన తర్వాత మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో డిజీ లాకర్స్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. 

ఎందుకీ లాకర్స్‌? 
దీనిద్వారా విద్యార్థి సర్టీఫికెట్లన్నీ డిజిటల్‌గా పొందే వీలుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా తేలికగా క్లౌడ్‌ ద్వారా సర్టీఫికెట్ల ధ్రువీకరణ చేయొచ్చు. నకిలీ సర్టిఫికెట్లు ఉండే అవకాశమే ఉండదు. విద్యారి్థకి టెన్త్‌ క్లాస్‌ నుంచే ఒక యూనిక్‌ ఐడీ కోడ్‌ ఇస్తారు. దీనిద్వారా క్లౌడ్‌కు లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి టెన్త్, ఇంటర్‌ బోర్డ్‌లు, యూనివర్సిటీలు సంబంధిత ఐడీకీ సర్టీఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తాయి. డీజీ లాకర్‌ వ్యవస్థ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధీనంలో, పూర్తి సురక్షితంగా ఉంటుంది.

దీంతో సర్టిఫికెట్లు దెబ్బతిన్నాయని, పోయాయని ఆందోళన పడాల్సిన అవసరమే ఉండదు. విదేశీలకు వెళ్లినా కేవలం యూఆర్‌ఎల్‌ లింక్‌ ద్వారా సర్టీఫికెట్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం 2024 పాస్‌ అవుట్‌ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పదేళ్లలోపు చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు కూడా యూజీసీ భరిస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు.  

ప్రాక్టికల్‌గా ఎన్నో సవాళ్లు.. 
డిజీ లాకర్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రాక్టికల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ను దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌కు ఏ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారో... దాన్నే లాకర్‌కు ఇవ్వాలి. కానీ విద్యార్థుల్లో చాలామంది తరచూ ఫోన్‌ నెంబర్లు మారుస్తున్నారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం అధికారి సాహూ తెలిపారు. మరోవైపు టెన్త్, ఇంటర్‌ బోర్డ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక యంత్రాంగం ఇప్పటివరకూ లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో జరిగే దోస్త్‌ డేటాను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  

డిజీ లాకర్‌ ఎలా పనిచేస్తుంది? 
విద్యార్థి అన్ని సర్టీఫికెట్లు ఒక క్లౌడ్‌ ద్వారా నిక్షిప్తం చేస్తారు. విద్యార్థి డీజీ లాకర్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటాడు. డీజీ లాకర్‌ విభాగం ఇచ్చే లాగిన్‌ పాస్‌వర్డ్‌ను మార్చుకుని భద్రపర్చుకుంటాడు. అవసరమైన సర్టీఫికెట్లను తను ఇంటర్వ్యూ లేదా అడ్మిషన్‌ పొందే సంస్థలకు మౌస్‌క్లిక్‌ లింక్‌ ద్వారా పంపుకోవచ్చు. యాక్సెస్‌ ఇవ్వడం ద్వారా ఆయా సంస్థలు సర్టీఫికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే తనిఖీలు నిర్వహిస్తాయి.  

ఒక విభాగాన్ని పరిశీలిస్తున్నాం  
డిజీ లాకర్‌కు విద్యార్థుల డేటాను డిసెంబర్‌ నాటికి అప్‌లోడ్‌ చేయమని యూజీసీ తెలిపింది. ఇందులో భాగంగా పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్‌ ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఉపయుక్తమైన ప్రాజెక్టు. అయితే, తొలి దశలో అనేక సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. – డాక్టర్‌ కె.విజయకుమార్‌ రెడ్డి (రెక్టార్, జేఎన్‌టీయూహెచ్‌) 

తొలుత పీజీ విద్యార్థుల సమాచారం
డిజీ లాకర్‌ పరిధిలో తొలి విడతగా పీజీ విద్యార్థుల సమాచారం తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి తర్వాత దశకు వెళ్తాం. విద్యార్థుల సర్టీఫికెట్లు సురక్షితంగా, తేలికగా పొందేందుకు డీజీ లాకర్‌ తోడ్పడుతుంది.  
– ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement