![student Ends Life In Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/1111.jpg.webp?itok=ys_D0Iqc)
ప్రిన్సిపాల్ మందలించాడని మనస్తాపం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
షాద్‌నగర్‌రూరల్: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీఎస్‌కే వెంచర్‌లో నివాసం ఉంటున్న హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్(15) స్థానిక శాస్త్ర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన నీరజ్ స్నేహితుడితో కలిసి క్లాస్‌రూం నుంచి కారిడార్‌కు వచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ నరేందర్‌రాయ్ వారిని మందలించాడు. దీంతో సాయంత్రం 4గంటలకు సుమారు 20 ఫీట్ల ఎత్తులో ఉన్న స్కూల్ అంతస్తు పైనుంచి నీరజ్ కిందికి దూకాడు.
రక్తపు మడుగులో..
పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
విద్యార్థి నేతల ఆందోళన..
విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ యువసత్తా యూత్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల ఫర్నిచర్, అద్దాలు, బోర్డులు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించారు.
వార్షికోత్సవం మరుసటి రోజే విషాదం..
హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్‌తో పాటు ఓ కూతురు ఉన్నారు. మంగళవారం హరిభూషణ్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుక జరుపుకొన్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆర్మీ జవాన్‌గా పని చేసిన హరిభూషణ్ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ప్రస్తుతం బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment