కోల్‌కతా: ఇటీవల కాలంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదవు ఒత్తిడి, మానసిక సమస్యలు, ఇతరాత్ర కారణాలతో భవిష్యత్తును చేజేతులారా తుంచేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
బహదూర్ శాస్త్రీ హాస్టల్‌లో ఉంటున్న చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది. కిరణ్ మృతితో సహచర విద్యార్థులు, ఐఐటీ అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గరైనట్లు తెలిపింది. అతడి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.
‘మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చంద్ర తన రూమ్‌మెట్స్‌తో కలిసి హాస్ట్‌లో గదిలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్దులు పని మీద బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఇద్దరు తిరిగి వచ్చే సరికి గది లోపల నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. బలవంతంగా తలుపు తీయడంతో గదిలో చంద్ర ఊరేసుకొని కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా రాత్రి 11.30 అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు’ అని పేర్కొంది.
చదవండి: Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధిత విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలియగానే క్యాంపస్‌కు చేరుకున్నారు.
కాగా గత కొంతకాలంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ఇదే విద్యాసంస్థలో ఏడాదిన్నరలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి ఐఐటీల్లో 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 18 మంది ఓబీసీలు, షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు.
దేశంలో అకడమిక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment