ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య | Student Commits Suicide At Narayana Residential School: Telangana | Sakshi
Sakshi News home page

ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Published Wed, Dec 18 2024 4:54 AM | Last Updated on Wed, Dec 18 2024 4:54 AM

Student Commits Suicide At Narayana Residential School: Telangana

నారాయణ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఘటన 

ఉపాధ్యాయుల ఒత్తిడే కారణమని తండ్రి ఆరోపణ 

కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన

హయత్‌నగర్‌ (హైదరాబాద్‌)/గోపాల్‌పేట: ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్‌రెడ్డి రైతు. ఆయన కొడుకు లోహితస్యరెడ్డి (12) హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 8 గంటలకు తోటి విద్యార్థులంతా స్టడీ అవర్‌లో చదువుకునేందుకు వెళ్లగా.. లోహితస్యరెడ్డి ఒక్కడే గదిలో ఉన్నాడు.

స్టడీ అవర్‌ తర్వాత గదిలోకి వచి్చన విద్యార్థులకు.. ఫ్యాన్‌కు వేలాడుతూ లోహితస్యరెడ్డి కనిపించాడు. దీంతో వారు హాస్టల్‌ సిబ్బందికి చెప్పగా.. హయత్‌నగర్‌లోని సన్‌రైజ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఉపాధ్యాయుల ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు ఆత్యహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. ఇక్కడ చదవనంటే.. ఈ ఏడాది పూర్తయ్యేవరకు చదవమని నచ్చజెప్పానని చెప్పారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూడా ఫోన్‌ చేసి మాట్లాడాడని.. ఆ తర్వాతే ఉరివేసుకుని మరణించాడనే వార్త తెలిసిందని వాపోయారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement