
యువకుడి దారుణ హత్య
ఎల్‌బీనగర్‌లో ఘటన
పాత కక్షల నేపథ్యంలో ఘాతుకం
పోలీసుల అదుపులో నిందితులు..
నాగోలు: పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టి అతడు కింద పడిన తర్వాత గొడ్డళ్లు, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బోడ్డు మహేష్(31) పాత నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అదే ప్రాంతంలో ఉన్న పగిళ్ల పురుషోత్తం మహేష్‌కు స్నేహితుడు.
రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌లో పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో మహేష్ పురుషోత్తంపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే స్నేహితులు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒప్పించారు. రాజీ పడేందుకు మహేష్ గత డిసెంబర్ 20న హయత్‌నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే అతను కోర్టు హాజరుకాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పి పురుషోత్తంను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
అదే రోజు కొత్తపేట– నాగోలు రోడ్డులో అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నట్లు సమాచారం అందడంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్‌తో కలిసి అతడిపై వేట కొడవలితో దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దాడికి పాల్పడిన మహేష్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్‌కుమార్, పరుశురాంలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇటీవలే మహేష్ అతని స్నేహితులు జైలు నుండి బయటికి వచ్చారు. అయితే మహే‹Ùపై కక్ష పెంచుకున్న పురుషోత్తం అతని స్నేహితులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు.

మాటు వేసి..దాడి చేసి..
శనివారం రాత్రి మహేష్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఎల్‌బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి నిందితులు కారుతో మహేష్ బైక్‌ను ఢీ కొట్టారు. కింద పడిన అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వారు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్ల, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. మహేష్ వెంట ఉన్న స్నేహితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు.
తీవ్రంగా గాయపడిన మహేష్‌ను కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్ తలపై నిందితులు గొడ్డలితో నరకడంతో గొడ్డలి తలలోనే ఇరుక్కు పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్‌స్పెక్టర్ వినోద్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు.
పోలీసుల అదుపులో నిందితులు...
మహేష్ ను హత్య చేసిన నిందితులు పురుషోత్తం, భరత్‌నగర్‌కు చెందిన సందీప్, నాగార్జున, రాములను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.