రీయింబర్స్‌మెంట్ నిధుల స్తంభన | Riyimbarsment freeze funds | Sakshi
Sakshi News home page

రీయింబర్స్‌మెంట్ నిధుల స్తంభన

Published Fri, Jul 24 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

రీయింబర్స్‌మెంట్ నిధుల స్తంభన

రీయింబర్స్‌మెంట్ నిధుల స్తంభన

8 ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల
నగదు జమ ఎప్పటికో 8కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు
చేతికి రాక విద్యార్థుల ఇబ్బందులు
 

మచిలీపట్నం : ప్రభుత్వం విద్యార్థులతో ఆటలాడుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేసినట్లే చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ కాకుండా ఫ్రీజింగ్ విధించింది. దీంతో కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించని కారణంగా పలువురు విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు రాని పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు జమ అయ్యే వరకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.పై చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు లేకుంటే ఇబ్బందే. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. ఒకపక్క ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి తాము జాబితాలు పంపామని బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించి నగదు మంజూరైనట్లు ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు.బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థుల వివరాలను సోమవారమే ఇచ్చారని, వాటిని పరిశీలించేందుకు మరికొంత     సమయం పడుతుందని వారంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా వచ్చిన జాబితాల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు కాలేదనే కారణం చూపి కొంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నగదును జమ చేయని పరిస్థితి ఉంది. ఏ తరహా నగదు జమలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందో తమకే తెలియదని చెప్పి ట్రెజరీ అధికారులు తప్పించుకుంటున్నారు. ట్రెజరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు జిల్లాలో ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవటం గమనార్హం.

 నిధులున్నా ఉపయోగం లేదు
 బీసీ సంక్షేమ శాఖ ద్వారా వివిధ కళాశాలల్లో చదివే 46,312 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూపేణా రూ.16.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొంతమంది విద్యార్థుల ఖాతాల్లో సగం మొత్తం మాత్రమే నగదు జమ అయ్యింది. బీసీ విద్యార్థులకు 38,512 మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.31.93 కోట్ల నిధులు విడుదల కాగా సోమవారమే దీనికి సంబంధించిన జాబితాలను ఈ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. 17,421 మంది ఈబీసీ విద్యార్థులకు సంబంధించి రూ.23.36 కోట్లు మంజూరు కాగా ఎంత మంది విద్యార్థులకు ఈ నిధులను అందజేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమశాఖలో 4525 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3323 మందికి నగదు అందజేశారు. మిగిలిన 1202 మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని పరిస్థితి నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 36,032 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.70.80 కోట్లు, స్కాలర్‌షిప్‌గా రూ.19.83 కోట్లు మొత్తం రూ.90.63 కోట్లు మంజూరు చేశారు. దీనిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.67.87 కోట్లు, స్కాలర్‌షిప్‌గా రూ.18.01 కోట్లు కలిపి మొత్తంగా రూ.85.88 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు.

అయినప్పటికీ చాలా మంది ఖాతాల్లో స్కాలర్‌షిప్ నగదు సగం మాత్రమే జమ అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు నేరుగా ప్రిన్సిపాల్ ఖాతాలో జమ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నగదు వెంటనే విద్యార్థుల ఖాతాలో జమ అయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement