సర్టిఫికెట్లను వెతుక్కుంటున్న విద్యార్థులు
సాక్షి, రంగారెడ్డి: ఈ చిత్రాన్ని చూసి ఏవో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు అనుకుంటున్నారా.. కాదండి అవి విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే సర్టిఫికెట్లు. ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోంది. కొందుర్గు మండల కేంద్రంలోని అద్దె భవనంలో కొనసాగిన ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల రెండేళ్లుగా మూతబడింది. విద్యార్థుల సర్టిఫికెట్లు అందులోనే ఉండిపోయాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇంటి యజమాని ఆదివారం కూల్చివేసేందుకు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ బీరువాలో ఉన్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఒక్కసారిగా కుప్పలుగా బయటపడ్డాయి. విషయం ఆ నోటా.. ఈ నోటా.. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.
చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది
అంతే అందుబాటులో ఉన్న విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తీసుకునేందుకు కళాశాల భవనానికి పరుగులు పెట్టారు. చెత్త కుప్పల్లా పడి ఉన్న కాగితాల్లో ఇలా తమ సర్టిఫికెట్లను వెతుక్కున్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్‌పై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడంపై మండిపడుతున్నారు. సర్టిఫికెట్ల భద్రత పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయని కళాశాల యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment