సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి.
సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు.
ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది.
59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం..
వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది.
ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం..
జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
అల్లూరి జిల్లాలో అత్యధికం
జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment