అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
వలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచీ అక్కసే
మదనపల్లె సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఆయన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలిప్పించారు
ముసలివాళ్లన్న కనికరమూ లేదు
99% మార్కులొచ్చే స్టూడెంట్‌కు పరీక్షలంటే భయం ఉండదు
10 శాతం మార్కులు సాధించిన టీడీపీకి భయం కాబట్టే అన్ని పార్టీలతో కలిసింది
జెండాలు జత కట్టిన ఈ తోడేళ్ల మాటలు నమ్మొద్దు
పొరపాటున నమ్మారంటే పసుపుపతికి సహకరించినట్లే
చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే.. పేదల సంక్షేమ వ్యతిరేకికి ఓటేసినట్టే
ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే...
ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి
175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు.. మొత్తం 200 సీట్లు గెలవాలి
2014లో ఇదే పసుపుపతి ఇదే పార్టీలతో జత కట్టారు
ఇప్పుడు చెబుతున్న సూపర్ 6, సూపర్ 7 తరహాలోనే హామీలు ఇచ్చారు
అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో కన్పించకుండా చేశారు
ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ప్రజా తీర్పు కోరుతున్నాం
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి.
– సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు.
వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు.
నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు.
పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా?
► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు.
► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా?
► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు.
► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది.
టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం
► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు.
► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్న్‌పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి.
► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు.
► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి.
► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి.
నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం
► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట.
► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి.
పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు
► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు.
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్‌మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా?
► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు.
► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి.
మన అభ్యర్థులకు దీవెనలు అందించండి
మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి.
రెండు బటన్లు నొక్కాలి..
► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది.
► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు).
► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి.
Comments
Please login to add a commentAdd a comment