ప్రకాశం జిల్లా కొనకనమిట్ల సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం , టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టల 2014 మేనిఫెస్టో చూపిస్తూ.. వారి మోసపూరిత హామీలను వివరిస్తున్న సీఎం జగన్
కొనకనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్
ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు..
అవ్వా తాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు
స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు
ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే
మన భవిష్యత్తు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి
వలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి
58 నెలల్లో మీ బిడ్డ చేసినట్లు.. బాబు ఎందుకు చేయలేకపోయాడు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ప్రకాశం జిల్లా పొదిలిలో ఈరోజు ఇసుక వేసినా రాలనంతగా జనసముద్రం, ప్రజా కెరటం కనిపిస్తోంది. మంచి చేసిన మన ప్ర భుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయీ చేయీ కలిపి చేస్తున్న నినాదమే సిద్ధం.. సిద్ధం! ప్రజల అజెండాతో మనం, జెండాలు జతకట్టి వారు తలపడుతున్న ఈ ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించి ఇంటింటా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
10వ రోజు బస్సు యాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ‘‘మేమంతా సిద్ధం’’ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎండ నిప్పులు చెరుగుతున్నా భారీ ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘ప్రజల రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న మూడు పార్టీల కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు.
గత ఐదేళ్లుగా బాగుపడ్డ మీ పిల్లలు బడులు, చదువులు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతుకు అందుతున్న భరోసా, సామాజిక న్యాయం.. ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా? అన్నది నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మళ్లీ మోసపోయి వెనక్కు వెళ్లాలా? అనే అంశాన్ని నిర్ణయించే ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
కొనసాగింపు.. ముగింపు మధ్య పోరాటం
ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం అని గర్వంగా చెబుతున్నా. మీ ప్రతి ఓటూ వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. ఐదు వారాల్లో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో జగన్‌కు ఓటు వేస్తే జరుగుతున్న ప్రతి మంచీ కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నింటికి ముగింపు పలికినట్లే. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి.
బాబు దారి ఎప్పుడూ అడ్డదారే...
చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. ఆయనకు విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియదు. చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటంటే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు. అవ్వాతాతా... ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు. పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్లకూడదట. వలంటీర్లు అలా వెళ్లటం నేరమట. పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం ఇవాళ కొత్తగా జరగడం లేదు.
ఇంటికి వెళ్లి అందించి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 58 నెలలుగా జరిగింది. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారమైనా, సెలవురోజైనా 1వ తారీఖు ఉదయాన్నే వలంటీర్ మనవడు, మనవరాళ్లు అవ్వాతాతల వద్దకు ఇంటికివెళ్లి చేతిలో పెన్షన్లు పెట్టారు. చంద్రబాబు హయాంలో రూ.1,000 మాత్రమే అరకొరగా ఇస్తే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్లి ఇంటివద్దే అందించే ఓ గొప్ప వ్యవస్థను తెచ్చింది.
చంద్రబాబు హయాంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, లంచాలు, వివక్ష లేదు. ఎక్కడెక్కడికో తిరిగి క్యూలో నిలబడి నరకయాతన అనుభవించిన రోజులు చంద్రబాబు పాలనలో చూశాం. వలంటీరు వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అందుకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు.
అవ్వాతాతల మరణాలకు కారకుడు..
ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్కచెల్లెమ్మలను, దివ్యాంగులను మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా 30 మంది పైచిలుకు అవ్వలు, తాతల చావులకు కారకుడైన చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలి. తన స్వార్థ రాజకీయాలకు అనేక మంది మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడిని శాడిస్ట్ అనక మరేమంటారో మీరే చెప్పండి. ఈ ఎన్నికల సమయంలో, అధికారం మన చేతుల్లో లేని సమయంలో మాత్రమే పెన్షన్ మన ఇంటికి రాకుండా ఎందుకు ఆగింది? అది ఆగలేదు.. అడ్డుకోబట్టే రాకుండా పోయింది.
శాడిస్ట్ అంటే ఎవరంటే...
తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతో, అక్కసుతో ఆపించాడు. కాబట్టే ఈరోజు నేను చంద్రబాబును, దొంగల ముఠాను అడుగుతున్నా. శాడిస్ట్ అంటే ఎవరు? శాడిజం అంటే ఏమిటి? ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడు శాడిస్ట్. పేదలకు ఇళ్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకునే వాళ్లను శాడిస్ట్ అంటారు. వ్యవసాయం దండగ అని మాట్లాడిన మనిషిని శాడిస్ట్ అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వెటకారం చేసిన వ్యక్తి శాడిస్ట్ అంటే.
ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను కించపరుస్తూ మాట్లాడితే గ్రామాల్లో వాళ్ల పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవమానించిన చంద్రబాబును శాడిస్ట్ అంటారు. అవునా? కాదా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే అడ్డుకుని అక్కసు వెళ్లగక్కిన బాబుకన్నా పెద్ద శాడిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా? మీ బిడ్డ నేరుగా అందించే డీబీటీ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతోందని తెలిసి కూడా రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందంటూ దిక్కుమాలిన ప్రచారం చేసిన నిన్ను శాడిస్ట్ అనక ఏమనాలి చంద్రబాబూ?
వలంటీర్లను కించపరిచిన శాడిస్ట్ గ్యాంగ్..
సేవా భావంతో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్లని, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆబోతుల్లా పడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు శాడిస్టులు కాకపోతే మరి ఎవరయ్యా? అని అడుగుతున్నా చంద్రబాబును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియా సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్ట్ ఎవరైనా ఉంటారా చంద్రబాబూ? 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా?
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా?
మన జెండా తలెత్తుకుని రెపరెపలాడుతుంటే.. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు, కూటమి చరిత్ర ఏమిటి? 2014లో ఏం చెప్పారో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా? ముఖ్యమైన హామీలు ఒక్కసారి చూద్దాం. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ చేశాడా? రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఒక ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు.
60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇంటికి వచ్చాయా? పేదలకు 3 సెంట్ల స్థలం కథ దేవుడెరుగు ఒక్క సెంటు స్థలమైనా, కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ.. అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు.
మీ పొదిలిలో ఏమన్నా హైటెక్ సిటీ కనిపిస్తోందా? మార్కాపురంలో అయినా కనిపిస్తోందా? పోనీ ఒంగోలులో కనిపిస్తోందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇదే చంద్రబాబు మరోసారి కూటమి కట్టి మళ్లీ వస్తున్నాడు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సిద్ధమే అని గట్టిగా నినదించండి.
ఇంటింటా జగన్ మార్కు
► మన 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే గ్రామ గ్రామాన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాలంటే మీ జగన్. రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్. విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్. అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ బిడ్డ జగన్. ఇంటింటికీ వలంటీర్ సేవలంటే మీ జగన్. రైతు భరోసా అంటే మీ జగన్. పగటిపూటే నాణ్యమైన ఉచిత కరెంట్, సమయానికి ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే రుణాలు, ఉచిత పంటల బీమా.. ఇవన్నీ అంటే మీ బిడ్డ జగన్.
ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే కూడా మీ జగనే. అమూల్ ద్వారా పాడి రైతులకు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు సేకరణ ధరలు పెరిగాయంటే కారణం మీ జగన్. వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది ఎవరంటే మీ జగన్. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరంటే మీ జగన్. ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే 58 నెలల్లో సాకారం కావడంతో చంద్రబాబు 20 జెలూసిల్ మాత్రలు వేసుకున్నా తగ్గనంత అసూయతో, కడుపు మంటతో బాధపడుతున్నాడు.
► నాడు నేడు, ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి అందుతోందంటే కారణం మీ జగన్. విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, బైలింగ్వల్ టెక్టŠస్‌బుక్స్, ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి క్లాసులో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌తో క్లాసు రూములు ఉన్నాయంటే కారణం మీ జగన్.
► పేదలెవరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగన్‌దే. ఆరోగ్య ఆసరా అందుతోందంటే కారణం మీ జగన్. ప్రభుత్వ ఆస్పత్రులు మారాయంటే కారణం మీ జగన్. ఏకంగా 54 వేల కొత్త పోస్టులు వైద్య రంగంలో భర్తీ అయ్యాయంటే, రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే కారణం మీ జగన్.
ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయంటే కారణం మీ జగన్. ఆసరా, సున్నా వడ్డీ, దిశా యాప్‌తో అక్కచెల్లెమ్మలు భరోసాగా ఉన్నారంటే కారణం మీ జగన్. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, లా నేస్తం అంటే మీ జగన్. ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో రాజకీయ సాధికారత దక్కిందంటే కారణం మీ బిడ్డ జగన్.
► 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ 58 నెలల కాలంలో భర్తీ చేస్తే ఏకంగా 80 శాతం ఉద్యోగాలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే తమ్ముళ్లు, చెల్లెమ్మలకే దక్కాయి. బటన్ నొక్కి డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన రూ.2.70 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లబ్ధి చేకూరిందంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా గొప్ప అర్థం ఏముంటుంది?
► ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో నిర్మాణం జరుగుతోంది. 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి ఏది తీసుకున్నా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు పడ్డాయని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న సత్యాలు.
► ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతి ఒక్కరి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే చంద్రబాబు మాత్రం దోచుకోవడానికి, పంచుకోవటానికి ఉపయోగించాడు. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. కానీ అప్పుల గ్రోత్ రేటు అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రజలకు పరిచయం చేశారు. అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరారు.
ఆయనకన్నా పెద్ద శాడిస్టు ఎవరుంటారు...?
మన ప్రభుత్వంలో తనకి మేలు జరిగిందని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియాలో టీడీపీ సైకోలతో వేధించి ప్రాణం తీసిన చంద్రబాబు కన్నా పెద్ద శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా...
గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీష్ బడులు కనిపిస్తున్నాయి. ఇలా ఏది తీసుకున్నా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అంటూ ఆదివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు.
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
కొనకనమిట్ల: ‘జగనన్న ఆశీస్సులతో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నా.. మీ ఆశీస్సులు అందించండి. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉంటా..’ అని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. 1988 నుంచి 36 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతో తన అనుబంధం కొనసాగుతోందన్నారు. ‘ఒంగోలు ప్రజలు ఎంతో మంచివారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని జగనన్న నన్ను పంపాడు.
మీ అందరి అండదండలు నాకు ఉండాలి. నాకు వ్యాపారాలు, వ్యాపకాలు, వ్యసనాలు లేవు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నేనిక్కడే నివాసముంటా. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా. ఒంగోలు పార్లమెంట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ అని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనతోపాటు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తండ్రి ఆశయం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు.
– ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి
ఆకాంక్షలు నెరవేర్చిన జననేత
మార్కాపురం: ఐదేళ్ల పాలనలో 99 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ఓటు ఎందుకు వేయాలి? ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదు? అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. నవరత్నాలు అనే రెండు పేజీల మేనిఫెస్టో ద్వారా జగనన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. చెప్పినవే కాకుండా చెప్పనివాటిని సైతం అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు.
మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేసి ఆశీర్వదించాలని ధైర్యంగా అడిగిన నేత ఒక్క జగనన్న మాత్రమేనన్నారు. పేదలకు అండగా ఉండేందుకు ఈ ప్రభుత్వానికి మరోసారి ఆశీస్సులు అందించాలని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాభివృద్ధి కొనసాగేందుకు కృషి చేద్దామని
పిలుపునిచ్చారు.
– అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment