తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం , ప్రసంగిస్తున్న సీఎం జగన్
మళ్లీ మన ప్రభుత్వంలో ఆ ఫైల్‌పైనే నా తొలి సంతకం: సీఎం జగన్
వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు
అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డగింత
బాబు తీరుతో 2 రోజుల్లో 31 మంది వృద్ధులు మృత్యువాత
ఇలా చేసిన బాబును హంతకుడు అందామా?
రాబోయే ఐదేళ్లలో మన తలరాతను మార్చనున్న ఓటు
నాడు జన్మభూమి కమిటీలు.. లంచాలు ఇస్తేనే పథకాలు
14 ఏళ్లలో చెప్పుకోదగిన ఒక్క పథకమైనా చేశావా బాబూ?
ఈ 58 నెలల్లో ఇంటింటికీ మంచి చేశాం..
మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు.. మోసం చెయ్యడు
లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసేలా ఉండాలి
జగన్ చేయలేని స్కీమును బాబు జేజమ్మ కూడా చేయలేదు
నాయుడుపేట బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
చంద్రబాబు దుర్మార్గం వల్ల నిన్న, ఈరోజు (బుధ, గురువారాల్లో) ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్‌ను అందుకునే క్రమంలో నడవలేక, అవస్థ పడలేక ప్రాణాలు విడిచారు. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడును హంతకుడు అందామా? లేక అంతకన్నా దారుణమైన పదం ఏమైనా ఉంటే అది అందామా? ఆలోచించండి. అయ్యా చంద్రబాబూ.. మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు. పెన్షన్, రేషన్‌కార్డు, సర్టిఫికెట్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండింది. ఈరోజు వలంటీర్ వ్యవస్థ వల్ల ఆ కష్టాలు లేవు. అందుకే కదా మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు.. మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా.. మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి పని, స్కీము గుర్తుకు వస్తుందా? పైగా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. అందుకే చంద్రబాబుకు నా అనే వాళ్లు ఈ రాష్ట్రంలో కరువు. పక్క రాష్ట్రంలో కూడా ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటే అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్లందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి దొంగల ముఠా. వీరంతా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇదీ వీళ్లకు తెలిసిన రాజకీయం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ‘రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. ఇలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇబ్బంది పడిన వారందరికీ ఒకేమాట చెబుతున్నా. కొంచం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. మళ్లీ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికీ సేవలందించే ఫైల్‌పైన నా మొట్ట మొదటి సంతకం చేస్తాను’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
‘మేమంతా సిద్ధం’ ఎనిమిదవ రోజు బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ.. అడ్డు తగులుతున్న దుష్ట చతుష్టయంపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ఆత్మబంధువులైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కావని, మీ తల రాతలు మార్చే ఎన్నికలని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
రెండు భావజాలాల మధ్య సంఘర్షణ
► రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలివి. జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం.. పెత్తందారీ భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది.
► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్ బడిని నాడు–నేడుతో మొదలు పెట్టి.. ఇంగ్లిష్ మీడియం, పిల్లల చేతుల్లో ట్యాబులు, డిజిటల్ బోధన, సీబీఎస్‌ఈ, ఐబీ దాకా ప్రయాణం సాగిస్తున్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు.
► పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని, ఒక వేళ ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం.
► నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడానికి మనసు లేని గత టీడీపీ పాలనకు.. ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం పదవులు ఇస్తూ నా.. నా.. నా.. నా.. అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం.
► 650 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన వారికి, రూ 2.70 లక్షల కోట్లు.. అందులో 75 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లబ్ధి పొందిన పరిస్థితి. డీబీటీగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోయేలా చేసిన మన ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధం.
► పెన్షన్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఎరువులు, ఇలా ఏ స్కీమైనా, ఏ పౌర సేవ అయినా క్యూల్లో నిలబడి.. వివక్షకు లోనై, లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అందాలనే అహంకార భావజాలానికి, ఆ సేవలన్నీ పేదవాడి ఇంటి వద్దకే వచ్చి తలుపుతట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి, డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం.
ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తే జీర్ణించుకోలేక..
► ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అవ్వాతాతల చేతుల్లో పెట్టడం మొన్నటి దాకా చూశాం. 58 నెలలుగా ప్రతి నెలా 1వ తారీఖున ఆదివారమైనా, సెలవుదినమైనా తెల్లవారక మునుపే వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడిగా, మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెట్టారు. ఎన్నికలు వచ్చేసరికే ఇది జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికల కమిషన్‌కు పిటిషన్ పెట్టించి అడ్డుకున్నారు.
► గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1,000 ఇస్తున్న పెన్షన్‌ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. ఇది వారికి గిట్టలేదు. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి. దిగజారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మేమే వలంటీర్లతో పింఛన్ల పంపిణీని ఆపించామని చెప్పడం మీరంతా కూడా చూశారు. వీళ్ల అహంకార ధోరణిని ఏరకంగా నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారో మీరంతా గమనించారు.
► ఇంత మందికి అండగా నిలబడ్డాం కాబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్ల మంది ప్రజలు జగన్‌కు అండగా నిలిచారని సంతోషంగా చెబుతున్నా. నా పేద అక్కచెల్లెమ్మలు నన్ను తోబుట్టువుగా భావిస్తున్నారని గర్వంగా చెబుతాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వాతాతలు, జగన్ మామ అని ప్రేమగా పిలిచే చిన్నారులు.. ఇలా వీళ్లంతా నా బంధువులు. వీరి భవిష్యత్తు మార్చడం కోసమే ఈ 58 నెలలుగా తపన, తాపత్రయంతో అడుగులు వేశాం.
డబుల్ సెంచరీ కొట్టాలి
‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా? ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్‌లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉంది. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి.
మన అభ్యర్థులకు ఓటేసి ఆశీర్వదించండి
మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన అభ్యర్థులపై ఉంచాలని సవినయంగా కోరుతున్నా. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి, సూళ్లూరుపేట నుంచి సంజీవయ్య, తిరుపతి నుంచి అభినయ్, గూడూరు నుంచి మురళి, సత్యవేడు నుంచి రాజేష్, కాళహస్తి నుంచి మధుసూదన్, వెంకటగిరి నుంచి రామ్, ఈ పార్లమెంటుకే సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు గోవర్ధన్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందివ్వాలి. మన గుర్తు ఫ్యాన్ అని మరచిపోవద్దు.
చంద్రబాబుది కిచిడీ మేనిఫెస్టో..
ఏ ఒక్కరూ తన కులం, మతం, ఆర్థిక పరిస్థితి వల్ల మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం కోసం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఒకరకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండటానికి వీల్లేదని క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. మీ బిడ్డ వేసిన ఈ విత్తనాలు మరో 10–15 సంవత్సరాల్లో ఏ స్థాయి వృక్షాలు అవుతాయంటే.. మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు.. ఏ లెవల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడతారంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్లు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇంటింటికీ మంచి చేయగలిగాం కాబట్టే, మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులతో పని లేదు.
► మీ బిడ్డ మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో ప్రజల ఆశీస్సుల కోసం వచ్చాను. 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు. మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. ఒక్కటే గుర్తుంచుకోండి. జగన్‌కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు.. ఉండదు. జగన్ చేయలేని ఏ స్కీమైనా చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేదు.
► చంద్రబాబు అబద్ధాల కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజల్ని ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికి ఏదొస్తే అది చెబుతాడు. అందుకే చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాల కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకు ఉంది.
లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసేలా ఉండాలి
► మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. తనను ప్రేమించే ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వలంటీర్.. ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పడు అని చెప్పుకునేలా ఉండాలి. విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికే ప్రతి ఒక్కరినీ మోసం చేసేందుకు రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోలు ఇచ్చే నాయకుడు కావాలా ఆలోచించండి.
► చంద్రబాబు కేజీ బంగారం అంటాడు.. బెంజ్ కారు అంటాడు.. సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ సెవెన్ అంటాడు. మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదని మోసం చేస్తాడు. చంద్రబాబును నమ్ముకుని, ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందా?
► మన ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా ప్రతి ఇంటికీ చేయగలిగిన మంచి అంతా చేస్తాను.
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
► ఇదే చంద్రబాబు 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు.చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు.
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్‌టైజ్‌మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా?
► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన నాయుడుపేటలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు
కొనిస్తామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment