గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమానికి హాజరైన వలంటీర్లు, అశేష జనసందోహంలో ఓ భాగం , వలంటీర్లకు సెల్యూట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్
మన జెండా, అజెండాపై మమకారంతో, మన మేనిఫెస్టోపై నమ్మకంతో, నవరత్నాల పథకాలు – పాలనా సంస్కరణలను ప్రజలకు చేరువచేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ. ప్రతి నిరుపేద బతుకులు మారాలని, భావి తరం పేదరికం సంకెళ్లు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన విప్లవాత్మక పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వలంటీర్లు.
ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తన నోటి నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ కలగాలి. ఆ విశ్వసనీయతను ఏ రోజైతే కల్పించగలుగుతాడో అప్పుడు అతడిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, అభిమాని కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్.. ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది.
– సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని, రాబోయే రోజుల్లో మీరు లీడర్లు కాబోతున్నారని తాను మొట్ట మొదటిరోజే చెప్పానని వలంటీర్లనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మీ దగ్గర నుంచి మొదలుపెడితే తన వరకూ 58 నెలలుగా అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. ఇంకా రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? అని ప్రశ్నించారు.
2.60 లక్షల మంది నా సైన్యం.. నా వలంటీర్ల సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ సైన్యం గుండెలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ గుండెలు కావని, ఇవి సేవా హృదయాలని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్లకు వందనం’లో భాగంగా వరుసగా నాలుగో ఏడాదీ పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ఏమన్నారంటే..
నాడు దోపిడీ వ్యవస్థ.. నేడు సేవా సైన్యం
చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రజలు టీడీపీని అధికారం నుంచి దించేందుకు కారణమైతే మీ అన్న తెచ్చిన సేవా సైన్యం సచివాలయాల వ్యవస్థతో అనుసంధానమై పేదలకు ప్రతి అవసరంలోనూ వారధిగా మారింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ మీ బిడ్డ ప్రభుత్వం ఘన విజయానికి వలంటీర్లు కారకులయ్యాయని గర్వంగా చెబుతున్నా. పరిపాలనను మార్చిన ఈ ప్రజా వ్యవస్థలే 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు వేస్తాయి. మన వ్యవస్థలు , మన ప్రభుత్వం, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన అజెండా ప్రకారం సేవ చేయడానికి పుట్టాయి.
ప్రతి గ్రామంలో బడి, ఆసుపత్రి పరిస్థితులను సమూలంగా మార్చాయి. పౌర సేవలను ఇంటివద్దే అందిస్తున్నాం. కళ్లకు కట్టినట్టుగా మీరు గమనిస్తున్న ఈ తేడాను ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియచేయాలి. 2019 కంటే ముందు ఏ సేవ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు, నెలల తరబడి కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే కానీ అడుగు ముందుకు పడని పరిస్థితి.
అవ్వాతాతలు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులు ఎరువులు కావాలన్నా ఎండనకా వాననకా చాంతాడంత క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు నాయుడు దాకా లంచాల పాలనే సాగింది. ఇప్పుడు మీ అన్న ప్రభుత్వంలో నెలకు రూ.3 వేలు చొప్పున 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే గత ప్రభుత్వ పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కేవలం రూ.వెయ్యి ముష్టి వేసినట్లు పెన్షన్ ఇచ్చేవారు. నాడు వివక్ష కారణంగా లక్షల మందికి పెన్షన్ అందలేదు. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు, బటన్లూ లేవు.
జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు
చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివైతే మన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివి. చంద్రబాబు పాలన ఓ విష వృక్షమైతే మన పాలన కల్పవృక్షం లాంటిది. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గౌరవ వేతనంతో మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించిన వలంటీర్ల సేవాభావానికి మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు.
డీబీటీ, నాన్ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు
దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనైనా ఇలాంటి లంచాలు లేని, వివక్షలేని వ్యవస్థను ఎక్కడైనా చూశారా? ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. ప్రతి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలకు చెప్పండి. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పటివరకూ రూ.2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాం. వీటికి తోడు ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, ట్యాబ్‌లు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలు కూడా తీసుకుంటే మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువ కూడా తీసుకుంటే అది రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది.
ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా వెళ్లింది కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాలను కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా తట్టుకోగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ అప్పటి కన్నా మన ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు చాలా తక్కువ. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించకపోవటానికి కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
కాపీ కొట్టి కిచిడీ మేనిఫెస్టో..
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చుని వేరే రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలు కాపీ కొట్టి కిచిడీ రూపంలో తెచ్చారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుడితే చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. తానిచ్చి న హామీలన్నీ నిజంగా అమలు చేసే పరిస్థితి, అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అన్న ఆలోచన కూడా చంద్రబాబుకి ఉండదు.
ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి అబద్ధాలు ఆడటంలో భావదారిద్య్రం ఎందుకనే ధోరణి ఆయనది. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడనే తత్వం చంద్రబాబుది. ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరని పసిగట్టి చంద్రబాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారు. మొన్నటివరకు జగన్‌లాగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి ఇప్పుడు అదే నోటితో ఆరు వాగ్దానాలంటున్నారు. పైగా ఇది శాంపిల్ మాత్రమే, దీనికి మరో ఆరు జమ అవుతాయని చెబుతున్నారు.
వాటిని టచ్ కూడా చేయలేరు...
మీ బిడ్డ కష్టపడి ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాడు. ఇందులో కొన్ని కార్యక్రమాలను టచ్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోదు. నెలకు రూ.3 వేల చొప్పున సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇచ్చే విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం లాంటి ఎనిమిది పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది.
వీటిని ఎవరైనా రద్దు చేయాలనుకున్నా చెయ్యి కూడా వేయటానికి సాహసించలేని పథకాలు అవి. మరి రూ.52,700 కోట్లు వెచ్చి ంచాల్సిన ఈ తప్పనిసరి పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే మొత్తంగా రూ.1,26,140 కోట్లు వరకు లెక్క తేలుతోంది. గతంలో ఏమీ చేయకుండా మోసాలకే పరిమితమైన ఆ వ్యక్తి ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఇస్తానని నమ్మబలుకుతున్నాడంటే అంతా ఒక్కసారి ఆలోచన చేయాలి.
బాబు మేనిఫెస్టో.. రంగుల మాయాజాలం
1994, 1999, 2014.. చంద్రబాబు పాలనను ఎప్పుడు తీసుకున్నా అధికారంలోకి రాక ముందు మేనిఫెస్టో రంగురంగులతో ఉంటుంది. 650 పేజీలు.. 650 హామీలంటూ , ఎన్నికలు ముగిశాక చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్‌సైట్‌లో కూడా మేనిఫెస్టోను మాయం చేస్తారు. ప్రజలు మోసపోకుండా బాబు రంగుల మాయలను ప్రజలకు వివరించాలి. చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
వారం పాటు ఉత్సవాలు
వలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా అభినందించే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవాల మాదిరిగా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం. మీరంతా గత ప్రభుత్వ హయాంలోని లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థను బద్ధలుగొట్టి త్రికరణశుద్ధితో నిజాయితీ చాటుకున్నందుకు గుర్తింపుగా బహుమతిని పెంచుతున్నాం. సేవావజ్రాలకు రూ.45 వేలు, సేవారత్నాలకు రూ.30 వేలు, సేవా మిత్రలకు రూ.15 వేలు చొప్పున అందచేస్తాం.
ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను సేవావజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాల్టీ పరిధి నుంచి కనీసం ఐదు మంది, ప్రతి కార్పొరేషన్ పరిధి నుంచి పదిమంది చొప్పున 4,150 మంది వలంటీర్లను సేవారత్న అవార్డులతో గౌరవిస్తున్నాం. ఇలా 2,55,464 మంది వలంటీర్లను అభినందిస్తూ నగదు బహుమతిగా రూ.392 కోట్లను అందచేస్తున్నాం.
చొక్కా మడతబెడదాం..
ఇక అబద్ధాలను మట్టి కరిపించేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చి ంది. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకురావాలి. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పెత్తందార్ల మీద చేస్తున్న యుద్ధంలో చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మీకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలపడమేనని ప్రజలకు తెలియచేయాలి. 2004లో చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. నాడు వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీ, రూ.2 వేల నిరుద్యోగ భృతి లాంటి హామీలను ఎగ్గొట్టడం, కోటయ్య కమిటీ అంటూ కోతల కమిటీని నియమించిన వైనాన్ని మరోసారి వివరించాలి.
బాబును నమ్మడమంటే...
చంద్రబాబును నమ్మడం అంటే ఇంగ్లిషు మీడియం బడుల్ని, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, పిల్లలకిచ్చే ట్యాబులు, ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ పెడుతున్న మన స్కూళ్లను, మన క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చేసి మన పిల్లల బంగారు భవిష్యత్‌ను తాకట్టు పెట్టడమేనని ప్రజలకు తెలియచేయాలి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా? అని అడగండి. బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ వ్యవస్థను కాదనుకుని జన్మభూమి కమిటీలను ఆహా్వనించడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
చంద్రముఖిని తెచ్చుకోవడమే..
చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పాలి. బాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయి. వలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమేనని ఎలుగెత్తాలి.
దడ పుట్టిస్తున్నాం..
వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. దత్తపుత్రుడి నోటి నుంచి కించపరిచే వ్యాఖ్యలు వినిపిస్తాయి. మహిళల అదృశ్యానికి వలంటీర్లు కారణమని ఒకడంటాడు. వలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతానంటాడు. తాము అధికారంలోకి వచ్చి న తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు. ఇంత మందికి మనం దడ ఎలా పుట్టిస్తున్నామో తెలుసా? ఈరోజు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ సంక్షేమాన్ని డెలివర్ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
విపక్షాల కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు కాకుండా పేదవాడి కడుపులు నిండుతున్నాయి కాబట్టే. విపక్షాల కడుపు నింపేది అవినీతి ఆకలి మాత్రమే. ఇలాంటి విషవృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. 58 నెలలు దాటాం. మీ బిడ్డ ఇంకో 10–15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేదవాడి ఇంట్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడతాడు. పేదల తలరాతలు శాశ్వతంగా మారిపోతాయి.
రాజధానిలో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు పింఛన్
‘‘తాడికొండ, మంగళగిరి రాజధాని ప్రాంతంలో భూమిలేని 17 వేల మంది నిరుపేదలకు జీవనభృతి పింఛన్ రూ.2,500 నుంచి రూ.ఐదు వేలు చేయాలని ఎమ్మెల్యే సుచరిత కోరారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేస్తాం. ఫిరంగిపురంలోని కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్డు కోసం రూ.39 కోట్లు మంజూరు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ ప్రకటించారు.
సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీలు నందిగం సురేష్, ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, కాసు మహేష్ రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, సమన్వయకర్తలు ఉమ్మారెడ్డి వెంకటరమణ, నూరీ ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.
ఉద్యోగ విప్లవం
సీఎం జగన్ దాదాపు 2,55,000 మందికిపైగా వలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి తుంగలోకి తొక్కారు. వలంటీర్ వ్యవస్థ తెచ్చి నప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు పొగుడుతున్నారు. మన దేశం హరిత విప్లవం, శ్వేత విప్లవం చూసింది. సీఎం జగన్ ఉద్యోగ విప్లవం తెచ్చారు. ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ ఉద్యోగాలిచ్చారు.
– మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు,తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త
రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం..
నాకు కేటాయించిన 64 కుటుంబాలలో అర్హులను గుర్తించి పథకాలు అందిస్తున్నప్పుడు వారి చిరునవ్వు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు దీవెనలు ఉంటాయంటూ మా చేతులను తాకినప్పుడు ఆ అనుభూతిని మరిచిపోలేం. ఆసుపత్రిలో ఉన్న ఓ తాతకు ఒకటో తారీఖు రాత్రి 12 గంటలకు పింఛన్ ఇచ్చా. దురదృష్టవశాత్తూ తరువాత కొద్దిసేపటికే ఆయన చనిపోయారు.
ఆయన భార్య నన్ను హత్తుకుంటే ఇది కదా సేవ అని అనిపించింది. తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు? మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నా. ప్రజలు మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. మళ్లీ మీ పాలన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
– దాసరి జ్యోత్సా్న దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం
మీ చిరునవ్వుతో ఆత్మస్థైర్యం
నా క్లస్టర్ లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీ ఆశయాలను నిలబెట్టేలా పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. ఇప్పుడు ప్రతి గడపనూ పలుకరిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లిన 22 ఏళ్ల యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల ఉచిత వైద్యం సంజీవనిలా పని చేసింది.
ఆ కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలకు రూ. 10 వేలు ఇచ్చాం. వలంటీర్ వ్యవస్థను మొదట్లో చాలా మంది కించపరిచారు. మీరు అండగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. మీ చిరునవ్వు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నా. మీరు నా వలంటీర్లు అని ఆప్యాయంగా పలుకరిస్తుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవాగుణాన్ని గుర్తించి మాకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని పెంచడం చాలా సంతోషంగా ఉందన్నా.
–షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం
Comments
Please login to add a commentAdd a comment