రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్‌లో మేకతోటి జయంతి వలంటీర్‌గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్‌పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది.
అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్‌పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment