income certificate
-
సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రస్తుతం వివిధ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే తరచూ సర్వర్లు మొరాయిస్తుండటంతో సమయానికి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ నెల 7, డిగ్రీ ప్రవేశాలకు 10వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ల మొరాయింపుతో సకాలంలో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు హైరానా పడుతున్నారు. సమయానికి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోగలమా, లేదా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఆయా ధ్రువపత్రాలు అప్లోడ్ చేస్తే గానీ విద్యార్థులకు రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అందే అవకాశం లేదు. సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలువిద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి. దీంతో వాటికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయించడంతో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. మరికొన్నిచోట్ల సచివాలయాలను వేరొక చోటకి మార్చారు. కొత్తగా వీటిని ఎక్కడ పెట్టారో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా నోటరీ చేయించాలంటున్నారు. పాత సర్టిఫికెట్లను రెన్యువల్ చేయడానికి మళ్లీ నోటరీ ఎందుకు అని ప్రశ్నిస్తే నోటరీ చేయిస్తేనే దరఖాస్తులు ముందుకు కదులుతాయని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు నోటరీ చేయించాల్సి వస్తోంది.నోటరీకి సుమారు రూ.200 వసూలు చేస్తుండడం పేద విద్యార్థులకు భారంగా పరిణవిుంచింది. దీంతో పాటు పాత ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, కుటుంబంలోని అందరు సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్సులకు మరికొంత వెచ్చించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందవుతోంది. ఇవన్నీ సచివాలయ సిబ్బందికి సమర్పించడానికి విద్యార్థులు ఒకటికి రెండుసార్లు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఆలస్యంఎలాగోలా సచివాలయ సిబ్బంది కోరిన పత్రాలన్నీ సమర్పించి వారి నుంచి పత్రాలను తీసుకువెళ్లి తహసీల్దారు కార్యాలయంలో సమర్పిస్తే అక్కడ ఆర్ఐ, తహసీల్దారు సంతకాలకు ఆలస్యమవుతోంది. వారు ఇతర పనులతో బిజీగా ఉండడంతో రాత్రికి గానీ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. ఆ తర్వాత ఇతర పనులపై దృష్టి సారించి విద్యార్థుల ధ్రువపత్రాలపై చివరలో సంతకాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ చేయడానికి సర్వర్ల మొరాయింపుతో మరింత ఆలస్యమవుతుంది. దీంతో విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదు.వలంటీర్లతో ఇంటి వద్దే అందించిన గత ప్రభుత్వంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వలంటీర్ల ద్వారా విద్యార్థుల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఎవరికి ఏ సర్టిఫికెట్లు కావాలో అడిగి తెలుసుకుని వారే ఇంటి వద్దే ఆన్లైన్ చేశారు. కావాల్సిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సర్టిఫికెట్లు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైగా ఈ డ్రైవ్‌ల్లో సర్టిఫికెట్లకు దరఖాస్తులు చేసుకున్నవారికి ఎటువంటి రుసుం తీసుకోకుండా వాటిని అందజేసింది. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం దూరం పెట్టడంతో ధ్రువపత్రాలు పొందడం విద్యార్థులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువు ముంచుకొస్తుండటంతో తమకు సకాలంలో సర్టిఫికెట్లు అందేలా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
వచ్చేనెల నుంచి కొత్త విధానంలో సర్టిఫికెట్ల జారీ
సాక్షి, అమరావతి: ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. కుల ధ్రువీకరణ పత్రం ఒకసారి తీసుకుంటే అది శాశ్వతమని, అలాగే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, సంస్థలు లబ్ధిదారులను ఒత్తిడి చేయకూడదని, ఆరు దశల నిర్ధారణ ప్రక్రియను వినియోగించాలని ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కుల ధ్రువీకరణలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సంక్షేమ శాఖలు అప్డేట్ చేయాలని ఆదేశించింది. వీటిపై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఈ నెల 26వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ సేవ ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను అమలు చేసేందుకు, విధివిధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, తల్లిదండ్రులు, తోబుట్టుల వివరాల ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ డేటాబేస్‌ను అనుసంధానించడం వంటి పనులన్నీ ఈ నెల 19వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి ఆరు దశల నిర్థారణ ప్రక్రియ విధానాన్ని సంక్షేమ, ఇతర శాఖలు చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌తో అనుసంధానించే ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని షెడ్యూల్ రూపొందించారు. 30వ తేదీలోపు ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులు, అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వేర్వేరుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. -
కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం
సాక్షి, అమరావతి: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు.. విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డిజీ లాకర్లలో సర్టిఫికెట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 484ను తాజాగా విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి 1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికెట్ల జారీ తగ్గిపోనుంది. ప్రభుత్వ శాఖలు మళ్లీ మళ్లీ అడగకూడదు.. సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖలు తాజా కుల ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకుపైగా పత్రాలు అందజేశారు. వాటికి సంబంధించిన డేటా బేస్ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది. వాటిద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం.. ఒకసారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్‌ను అడగకూడదు. అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఎ–కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహశీల్దార్, ఇతర అధికారులు దానిపై మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని ఈకేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలి. ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల నిర్ధారణే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్) గురించి తెలుసుకోవడానికి, విద్యా సంస్థల్లో స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. గత రెండేళ్లలో 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటికోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది. సంక్షేమ, విద్యా, ఇతర శాఖలు తమ పథకాల అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి. ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. పది, ఇంటర్ విద్యార్థుల డేటాబేస్‌ను విద్యా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ 6 దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు. ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్షిప్లు, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లకు కూడా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. -
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
బీసీ బంధు: సాయం సరే..దరఖాస్తెలా?
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం..బీసీ కులాల వారు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాశారు. దరఖాస్తుకు గడువు మంగళవారం ముగియనుండటంతో అధిక సంఖ్యలో బీసీలు అక్కడికి వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయం గేటుకు తాళం వేయడంతో సర్టిఫికెట్లు అందనివారు సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. విధులు ముగించుకుని వెళ్తున్న తహసీల్దార్ సంజీవరావుకు తమ గోడు చెప్పుకున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే లక్ష సాయం అందకుండా పోతుందని వాపోయారు. చింతల్‌కు చెందిన మంగలి సంగమేశ్వర్ చొక్కా విప్పి గేటు ముందు బైఠాయించారు. ఈ నెల 8న ఆదాయ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తు చేశానని, మూడు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగినా పని అవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల కోసం ఇక్కడ 12,240 దరఖాస్తులు అందగా కేవలం 4 వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. కాగా సర్వర్ డౌన్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తహసీల్దార్ చెప్పారు. సిబ్బంది పగలు, రాత్రి పనిచేస్తున్నారని వివరించారు. ఒక్క కుత్బుల్లాపూర్ మండలంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా మంగళవారం కూడా సర్టిఫికెట్లు అందలేదు. మరోవైపు సర్టిఫికెట్లు అందినవారు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఇబ్బందులెదురయ్యాయి. 5 లక్షలకు పైగానే దరఖాస్తులు లక్ష రూపాయల సాయానికి దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగుస్తుండడం, గడువు పెంచేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీసేవా సెంటర్లు, ఇతర కంప్యూటర్ సెంటర్లు దరఖాస్తుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు కుల, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. సర్టిఫికెట్లు పొందలేని వారు నిరాశతో వెనుదిరిగారు. ఇక దరఖాస్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల దరఖాస్తులు మాత్రమే వస్తాయని ప్రభుత్వం భావించినప్పటికీ, భారీ స్పందన నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకే 5 లక్షల దరఖాస్తులు వ చ్చి నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు 5 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి జూలై 15 నుంచి దశల వారీగా ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేస్తారు. దరఖాస్తు గడువు తేదీ పొడిగించాలి రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గౌడ కులస్తులకు మొన్ననే అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకుందామని మీ సేవా కేంద్రానికి వెళితే సర్వర్ డౌన్ అయిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చా. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలి. లేకపోతే మాలాంటి నిరుపేద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందకుండా పోతుంది. –ముత్తంగి ఇందిర, కొత్లాపూర్, సంగారెడ్డి జిల్లా వారం క్రితం దరఖాస్తు చేసినా సర్టిఫికెట్లు రాలేదు లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం. వాటికోసం ఈనెల 14వ తేదీన దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ ఇవ్వలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. మంగళవారం చివరి రోజు కావడంతో నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో, దరఖాస్తు చేస్తానో లేదో తెలియడం లేదు. – బొడ్డుపల్లి నరసింహ, నల్లగొండ టౌన్ -
‘లక్ష’ణంగా వసూళ్లు
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు ప్రకటించిన రూ.లక్ష సాయం పొందడానికి వృత్తిదారులు పడరానీపాట్లు పడుతున్నారు. ఒకవైపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తుండగా, మరోవైపు రెవెన్యూ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ దళారులు దోచుకుంటున్నారు. చేతి, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల్లోని 15 కులాలకు మొదటి దశలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా కులాలకు చెందిన నిరుద్యోగులు, యువకులు దరఖాస్తుల కోసం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 6నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,696 వచ్చాయి. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు తెలిపారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ కార్యాలయాల్లో జాప్యం నెలకొంటుంది. సర్వర్లు పనిచేయకపోవడంతో సర్టిఫికెట్ల జారీలో ఆలస్యమవుతోంది. అంతేకాకుండా కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేక పెద్దసంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. యువకులు, నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు, మీ సేవకేంద్రాల నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందితో దళారులు సిండికేట్‌గా మారి సర్టిఫికెట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మీ సేవ సెంటర్లలో దోపిడీ రూ.లక్ష సాయం పొందడానికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకే అవకాశం ఉందనే ప్రచారంతో పలువురు యువకులు పెద్దసంఖ్యలో మీ సేవ కేంద్రాలకు తరలివస్తున్నారు. దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రావడంతో నాలుగైదు రోజుల నుంచి మీ సేవ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.45 తీసుకోవాల్సి ఉండగా రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రెండురోజుల్లోనే సర్టిఫికెట్లు తీసుకొస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.500 వరకు దండుకుంటున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాల్లో ఈ దోపిడీ దందా పెద్దమొత్తంలో సాగుతుందని తెలుస్తోంది. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు.. ఉచితంగానే..
మూడేళ్ల క్రితం.. ఓ పల్లెటూరి కుర్రాడికి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యాయి. దగ్గరలో ఉన్న పట్నం వెళ్లాడు. రూ. 50 ఫీజు కట్టి మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకొన్నాడు. దీనికి ఒక రోజంతా పట్టింది. వారం పది రోజులు మండలాఫీసుల చుట్టూ తిరిగాడు. అప్పటికి గాని సర్టిఫికెట్లు రాలేదు. లంచం వంటివి అదనంగా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల అవసరం వచ్చింది. నేరుగా అదే గ్రామంలోని గ్రామ సచివాలయానికి వెళ్లాడు. అక్కడే ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసి నిమిషాల్లో ఇంటికి వచ్చేశాడు. మండలాఫీసుల చుట్టూ తిరగలేదు. ఎవరినీ కలవాల్సిన పనిలేదు. సర్టిఫికెట్లు చేతికందాయి. ఇక మీదట ఈ మాత్రం కష్టం కూడా ఉండదు. దరఖాస్తు చేసుకోకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు వారి అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రభుత్వమే వారి ఇళ్లకు తీసుకొచ్చి అందజేయనుంది. అది కూడా ఉచితంగానే. సాక్షి, అమరావతి: ఆదాయ (ఇన్‌కం), కుల (క్యాస్ట్) ధ్రువీకరణ సర్టిఫికెట్లకు డిమాండ్ చాలా ఎక్కువ. విద్యార్థులకు స్కాలర్ షిప్ మంజూరులో, ఉన్నత చదువుల సీట్ల కేటాయింపుల్లో ఇవే కీలకం. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. మూడేళ్ల క్రితం వరకు వీటి కోసం విద్యార్థులు నానా తిప్పలు పడేవారు. పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్కొక్క సర్టిఫికెట్‌కు రూ. 40 నుంచి 50 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు సరేసరి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విప్లవాత్మకంగా తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పేదలకు ఈ ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, పేదలకు ఈమాత్రం కష్టంకూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది. జారీ ఇలా.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)కి నివేదిక ఇస్తారు. ఆర్ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్లోడ్ చేస్తారు. వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది. టెన్త్‌లో 6 లక్షల మంది, ఇంటర్లో 10 లక్షల మంది! రాష్ట్రంలో ఏటా పదో తరగతిలో 6 లక్షల నుంచి 6.5 లక్షల మంది, ఇంటర్ రెండు సంవత్సరాలు దాదాపు 10 లక్షల మంది చదువుతుంటారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారేనని అధికార వర్గాలు చెప్పాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్దే ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 10లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు. సచివాలయ వ్యవస్థ కారణంగానే ఈ వెసులుబాట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పరిపాలనలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటివరకు ప్రజలకు కష్టసాధ్యంగా ఉండే ప్రభుత్వ సేవలు కూడా ఇప్పుడు ఇంటి వద్దే అందుతున్నాయి. కుగ్రామంలో ఉండే ప్రజలు కూడా ఊరు దాటి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ఐదు కోట్లకు పైగా సేవలను ఈ ‘సచివాలయా’లే అందించాయి. నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం ఆ గ్రామంలో పంచాయతీ ఆఫీసు లేదంటే గ్రామ పెద్ద ఇంటిదాకా వెళ్లే ఇబ్బందులు మూడేళ్ల క్రితమే తొలగిపోయాయి. 34 లక్షల మంది వృద్ధులు (కేవలం వృద్ధాప్య పింఛన్లు), మరో 50 వేల మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దనే అందజేసే ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. -
ఖమ్మంలో వినూత్న కార్యక్రమం, స్కూళ్లకే సర్టిఫికెట్లు.. మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎస్సీ విద్యార్థులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది. ఆయా పత్రాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా స్కూళ్లకే వాటిని పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేస్తుండటంతో ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం సులువవుతోంది. ప్రక్రియ ఇలా... పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల జాబితాలను హెచ్ఎంలు సిద్ధం చేశాక.. రెవెన్యూ అధికారులు పాఠశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు అవసరమైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే అధికా రులే మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లను సిద్ధం చేసి పాఠశాలలకు వెళ్లి నేరుగా విద్యార్థులకు అందజేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల ఇక్కట్లు తీరడమే కాక సమయం కలిసొస్తోంది. పలు పాఠశాలల్లో సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం విశేషం. ఇప్పటికే 76 శాతం మందికి.. ఖమ్మం జిల్లాలో 8,446 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో 5,070 మంది ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో నమోద య్యారు. వారిలో ఇప్పటివరకు 6,434 మందికి కుల, 6,467 మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందాయి. మొత్తంగా 76 శాతం మంది విద్యార్థుల కు సర్టిఫికెట్లను పాఠశాలల్లోనే అందించగా.. జిల్లావ్యాప్తంగా మిగిలిన విద్యార్థులకు ఆధార్, చిరునామా సరిగ్గా లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగం ఇది ఎంతో మంచి ప్రక్రియ. దీనివల్ల విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – పి.శిరీష, హెచ్ఎం, రఘునాథపాలెం పాఠశాలలో సర్టిఫికెట్లు ఇచ్చారు.. మాకు అవసరమైన సర్టిఫికెట్లను బడిలోనే అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలోనైతే ఈ సర్టిఫికెట్లు కావాలంటే బడికి వెళ్లలేకపోయే వాళ్లం. – మేక సాత్రిక, 9వ తరగతి విద్యార్థిని మంచి కార్యక్రమం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – ఎస్.యాదయ్య, డీఈఓ, ఖమ్మం -
విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు
ఖమ్మం అర్బన్: విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా గురువారం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సర్టిఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సర్టిఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్డీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
‘ఆదాయ పత్రం’ గడువు నాలుగేళ్లకు పెంపు
సాక్షి, అమరావతి: బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈమేరకు ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో బియ్యం కార్డుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్ శనివారం పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవివి. ►సీఎం వైఎస్ జగన్ కీలకమైన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. సీఎం ఆశయ సాధన కోసం పనిచేస్తా. ►భూ వివాదాల పరిష్కారానికి భూముల సమగ్ర రీసర్వే చేపడతాం. ►పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం మేరకు ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వనున్నాం. ►రెవెన్యూ శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు అధికారులు సత్వర పరిష్కారాలు చూపాలి. ►రెవెన్యూ శాఖలో సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. బియ్యం కార్డు చాలు బియ్యం కార్డు ఉన్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం జీఓ జారీ చేశారు. జీఓలోని ముఖ్యాంశాలివీ.. ► ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవి బియ్యం కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డులున్న వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలుగా పరిగణించాలి. ► ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహించే ఎంపిక కార్యక్రమాలకు బియ్యం కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. ► తెల్లరేషన్ కార్డు లేని వారికి అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒరిజనల్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నోట్ చేసుకుని తక్షణమే సంబంధితులకు వెనక్కు ఇవ్వాల్సిందే. ► స్కాలర్ షిప్‌ల మంజూరు సమయంలో మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. రెన్యువల్‌కు వీటిని అడగరాదు. ► ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం ప్రభుత్వం జారీ చేసిన నమూ నాలో ప్రజలు రూ.10 నాన్ జ్యుడీషి యల్ స్టాంపు పేపరుతోపాటు మూడు కాపీలు తహసీల్దారు కార్యాలయంలో సమర్పించాలి. -
తెల్లకార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం
►ఇక అన్నింటికీ ఆధారం అదే ►ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పనిలేదు ►విద్యార్థులు, రైతులకు తప్పిన ఇబ్బందులు ►ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కోవూరు: సంక్షేమ పథకాలకు సంబంధించి రైతులకు, విద్యార్థులకు ఇక నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీఓ 229 జారీ చేరసింది. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు అని చెప్పడానికి తెల్లరేషన్ కార్డే ఆధారమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చేరే విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే.. వారి నుంచి తెల్లరేషన్ కార్డును ఆధారంగా తీసుకోవాలని ఆదేశాల్చింది. తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారు జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. బీపీఎల్‌కు దిగువన ఉన్నవారు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి ఆ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవుతుంది. ఒకవేళ తెల్లరేషన్ కార్డు లేకపోతే అలాంటి వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తారు. స్కాలర్షిప్ లేదా ఇతర అవసరాలకు సంబంధించి బీపీఎల్ పరిమితికి మించి ఉంటే ధ్రువీకరణ పత్రం అడగవచ్చు. ఉద్యోగాలకు సంబం«ధించిన విషయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంబంధించిన వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. రైతులకు రుణాల పొడిగింపు విషయంలో బ్యాంకులు ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. ఏ శాఖకు చెందిన అధికారులైనా ఆదాయ ధ్రువీకరణ పత్రం పరిశీలన జరిగిన తరువాత ఒరిజనల్ వారి వద్ద ఉంచుకోకుండా తిరిగి ఇచ్చేయాలి. -
ఆదాయపత్రం నాలుగేళ్లు చెల్లుబాటు
- తెల్లకార్డు ఉంటే ఆదాయధ్రువీకరణ పత్రం అక్కరలేదు సాక్షి, హైదరాబాద్: వివిధ అవసరాల కోసం విద్యార్థులు, ఇతరులు ఇక నుంచి రెవెన్యూ అధికారుల నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రతియేటా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక పర్యాయం తీసుకున్న పత్రాన్ని నాలుగేళ్లపాటు వినియోగించుకోవచ్చు. ఇక నుంచి తీసుకునే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లు చెల్లుబాటవుతుంది. ఈమేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తదితరాల కోసం తహసీల్దార్లు/ డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తీసుకునే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం ఏడాది పాటే చెల్లుబాటవుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఇలా ప్రతిదానికీ పత్రాలు తీసుకోవడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. - దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు తెల్లరేషన్ కార్డును సమర్పించినంతకాలం ఏ ప్రభుత్వ విభాగమూ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అడగరాదు. తెల్లరేషన్ కార్డును కలిగి ఉన్నారంటే దారిద్య్ర రేఖకు దిగువనున్నట్లు (బీపీఎల్)గా పరిగణించాల్సిందే. బీపీఎల్‌కు తెల్లరేషన్ కార్డే ఆధారం. ఇలాంటి వారు ప్రత్యేకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. - బీపీఎల్ కంటే ఎక్కువ ఆదాయ పరిమితి గల స్కాలర్షిప్పులు, ఇతర ప్రయోజనాల కోసం మాత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా మొదటిసారి మంజూరు కోసం మాత్రమే. రెన్యువల్స్‌కు అవసరంలేదు. - ఏ విభాగం కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజనల్ తీసుకోరాదు. పరిశీలించిన తర్వాత ఒరిజనల్ పత్రాన్ని అభ్యర్థులకు వెనక్కు ఇచ్చేయాల్సిందే. - ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల వారెవరూ ఉద్యోగాలిచ్చే సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదు. పంట రుణాలు, భూమిపై రుణాలకు బ్యాంకులు కూడా ఆదాయ పత్రాలు కోరరాదు. ఈమేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి ఫార్మట్‌ను కూడా జీవోలో పొందుపరిచారు. తహసీల్దార్లు ఈ పత్రాల జారీ రిజిష్టర్లను పక్కాగా నిర్వహించాలని, తనిఖీల సమయంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టర్లు వీటిని పరిశీలించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. -
యువశక్తికి ని'బంధనాలు'
స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువశక్తి పథకానికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ పథకం కింద అర్హత సాధించాలంటే ప్రధానంగా దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.50వేలలోపు ఉండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సైతం పలుమార్లు ప్రతికా ప్రకటనలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రం సంపాదించడమే దరఖాస్తుదారులకు సమస్యగా మారింది. పరిమితిని మించినవారే ఎక్కువ.. జిల్లాలో రాజీవ్ యువశక్తి పథకం కింద మూడు వందల మంది లబ్ధిదారులకు రాయితీలిచ్చేలా ప్రభుత్వం రూ.90లక్షలు విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.30వేల వరకు రుణ రాయితీ సదుపాయం ఉంటుంది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో అధికశాతం దరఖాస్తుదారుల వార్షికాదాయం రూ.50వేలకు మించి ఉండడం గమనార్హం. నిబంధనలను చూపుతూ.. కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం కొలువుదీరిన సర్కారు.. వివిధ సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టేందుకు నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో విద్యార్థులు, సామాజిక పింఛన్లకు సంబంధించి మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. మిగతా కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆదాయ సర్టిఫికెట్ల జారీ నెమ్మదిగా సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన రెండు కేటగిరీలకు కూడా ఆదాయ పరిమితి రూ.లక్షవరకు ఉండడంతో.. రెవెన్యూ అధికారులు సైతం రూ.లక్షకు దరిదాపులో ఆదాయం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో సగటున ఆదాయ ధ్రువీకరణ రూ.50వేలకు మించడంతో రాజీవ్ యువశక్తికింద లబ్ధి పొందడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈనెలాఖరు నుంచి చేపట్టే దరఖాస్తుల పరిశీలనలో భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నిబంధనలు సడలించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యే అవకాశం లేదని అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆదాయం తిప్పలు
ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వని రెవెన్యూ అధికారులు - మీ సేవ కేంద్రాల ద్వారా నిలిచిపోయిన జారీ - కళాశాలల్లో చేర్చుకునేందుకు యాజమాన్యాల నిరాకరణ - దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాలల్లో ఆప్షన్లు ఇవ్వగా... సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. కన్వీనర్ కోటా కింద సీటు వచ్చిన కళాశాలల్లో సర్టిఫికెట్లు అందజేసి రిపోర్టు చేయడమే తరువారుు. ఇక్కడే వారికి తిప్పలు వచ్చిపడ్డారుు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని కళాశాలల యూజమాన్యాలు స్పష్టం చేస్తుండగా.. ఇన్‌కం సర్టిఫికెట్ ఇచ్చేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెల రోజులుగా బంద్.. కలెక్టర్ మౌఖిక ఆదే శాలతో జిల్లాలో నెల రోజులుగా మీసేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల తహసీల్దార్లు ఎవరికి వారు ప్రకటనలు ఇస్తూ మాన్యువల్‌గా ఇన్‌కం సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మనకెందుకొచ్చిందని భావించిన తహసీల్దార్లు ఏ ఒక్కరికీ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ ఇచ్చేది లేదని మండల రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసింది. పొరుగు జిల్లాల్లో ఇస్తున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారు తెల్లరేషన్ కార్డులతో అన్ని రకాల లబ్ధి పొందుతున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయూ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. దీన్ని సాకుగా చూపి జిల్లాలో అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని పూర్తిస్థారుులో నిలిపివేశారు. కానీ... పక్కన కరీంనగర్ జిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ యథాతధంగా నడుస్తోంది. జిల్లాలో కొన్ని చోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసినట్లు రసీదు ఉంటే కాలేజీల నిర్వాహకులు ఊరుకుంటున్నారు. మరికొన్ని చోట్లమాత్రం తప్పనిసరిగా ఇన్‌కం సర్టిఫికెట ఉండాలని తెగేసి చెబుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రవేశాల సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగొద్దని, కేబినెట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత జారీ చేస్తామని కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... విద్యార్థులకు ఇబ్బందులు తప్పేవి. అలాంటిదేం లేకుండా సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హన్మకొండ మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు తమకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కొందరు సోమవారం నేరుగా కలెక్టర్ కిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి మాన్యూవల్ సర్టిఫికె ట్లు ఇవ్వమని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్‌లు ఉన్నందున తాత్కాలింగా అయినా... ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లావ్యాప్తంగా విద్యార్థులు కోరుతున్నారు. లేదంటే తాము కళాశాలల్లో సీటు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు మరో మెలిక పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి స్థానికత విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు మరో అంశం జోడయింది. 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థానికులే అని ధ్రువీకరించడంలో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇది తేలేవరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. పదో తరగతిలోపు విద్యార్థులకు అవరమైతే పాత పద్ధతి (మాన్యువల్)గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఆ పైస్థాయి కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. స్థానికత అంశంతోపాటు బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేతకు కారణమని అధికారులు చెబుతున్నారు. -
రాజీవ్ విద్యా వేదన
సాక్షి, గుంటూరు: 2012 ఆఖరి రోజున కిరణ్ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ప్రీ మెట్రిక్ విద్యార్థులకు వేదనగా మారింది. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకం అమలు చేస్తామని ప్రకటించినా, నిబంధనలతో నానా అగచాట్లు పడుతున్నారు. ఆదాయం మొదలు కుల ధ్రువీకరణ, బ్యాంకుల్లో ఖాతా తెరిచే వరకు ఆంక్షల పర్వం కొనసాగుతోంది. అయితే విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుతున్నా, ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాలేదు. పరిశీలనకు మరికొంత గడువు పట్టే అవకాశం ఉంది. దీంతో పథకం ప్రారంభించిన ఉద్దేశం నీరుగారిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల పేరుతో సంయుక్తంగా బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి విముఖత చూపుతున్నారు. ‘ఆ సర్టిఫికెట్టు.. ఈ సర్టిఫికెట్టు.. అంటూ’ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. 2012 డిసెంబరు 31న కిరణ్ ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన పథకం ప్రారంభించింది. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు డేస్కాలర్స్‌గా పాఠశాలలకు వెళ్ళేవారికి పుస్తకాల కొనుగోలు తదితర అవసరాలకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వారికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు నిర్ణయించారు. ఐదు నుంచి ఎనిమిది వరకు విద్యార్థినులకు నెలకు రూ.150 చొప్పున పది నెలలు మొత్తం రూ.1500, విద్యార్థులకు రూ.100 వంతున పది నెలలు మొత్తం రూ.వెయ్యి ఉపకార వేతనంగా అందించాలి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నెలకు రూ.150 వంతున పది నెలలు, దీనితో పాటు అడహక్ రెంట్ కింద మరో రూ.750 కలిపి మొత్తం రూ.2,250 అందించాలి. అయితే అమలులో చిత్తశుద్ధి లోపం కారణంగా జిల్లాలోని వేలాది మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవీ నిబంధనలు... ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ రెండు వర్గాల్లో నిరుపేదలు అర్హతకు దూరమవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 4,630 పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు జిల్లాలో 23,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీల్లో కేవలం 700 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బీసీలైతే ఏడాదికి ఆదాయ పరిమితి రూ.45 వేలు ఉండాలి. ఇందుకు సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో బీసీలు తక్కువగా కేవలం 3,616 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఎయిడెడ్/జడ్పీ/మునిసిపల్ పాఠశాలల్లో డేస్కాలర్స్‌గా చదివే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. బ్యాంకు ఖాతాలు తెరవడం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో విద్యార్థులే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం, ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు జిల్లాలో జరిగాయి. కిందటి ఏడాది బడ్జెట్ ఈ ఏడాది విడుదల... కిందటి ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు ఈ ఏడాది బడ్జెట్లో విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొమ్మిది, పదో తరగతి ఎస్సీ విద్యార్థులు 8,741 మందికి రూ.1.83 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాదికి సంబంధించి నిధుల విడుదల ఎప్పుడో అధికారులే చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనా బాధ్యతలను ఆయా సంక్షేమ శాఖల వార్డెన్లకు అప్పగించారు. -
స్కాలర్ తిప్పలు
పిఠాపురం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే స్కాలర్షిప్పులు వస్తాయో లేదో తెలీదు కానీ దానికి దరఖాస్తు చేయడానికి అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో మాత్రం విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు పొందడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేస్తోంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం విద్యార్థులకు నరకం చవిచూపుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు 3,289 ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 482 ఉండగా, ఉన్నత పాఠశాలలు 633 ఉన్నాయి. వాటిలో 1 నుంచి 5 వరకు చదువుతున్న విద్యార్థులు 2,40,526 మంది ఉండగా.. 6 నుంచి 10 వరకూ చదువుతున్నవారు 2,52,420 మంది ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2.80 లక్షల మంది ఉన్నారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థికి ఏడాదికి రూ.1800; తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు రూ.2100 చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్పులు పొందారు. ఇదీ సమస్య స్కాలర్‌షిప్పుల కోసం గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు పొందారు. వీటిల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఆరు నెలలకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. కానీ, సాఫ్ట్వేర్ లోపంతో ఇది ఆన్లైన్లో అప్లోడ్ కాక, రెన్యువల్ కావడం లేదు. ఇలా రెన్యువల్ చేయించుకోవాల్సిన విద్యార్థులు జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది ఉన్నారు. దీంతో ఆ విద్యార్థులు ఆదాయ ధ్రువపత్రం కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేశారు. వారికి ఈసేవ సిబ్బంది డూప్లికేట్ నంబర్‌తో ఆదాయ ధ్రువపత్రం ఇస్తున్నారు. కానీ రెన్యువల్ కాని విద్యార్థుల పేరిట గత ఏడాది జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం అప్పటికే ఆన్లైన్లో ఉంటోంది. అది రెన్యువల్ కాకపోగా, సాఫ్ట్వేర్ లోపంతో కొత్తగా జారీ చేసిన డూప్లికేట్ పత్రం ఆన్లైన్లో అప్లోడ్ కావడం లేదు. అయితే ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 వేల మందికి మాత్రం కొత్త యూనిక్ నంబర్లతో ఒరిజనల్ ధ్రువపత్రం ఇస్తున్నారు. అవి ఆన్లైన్లో అప్లోడ్ అవడంతో, కొత్తవారికి ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వడం సాధ్యమవుతోందని ఈసేవ సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాతవారి ధ్రువపత్రాలను మాత్రమే సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదని వారంటున్నారు. పాఠశాలలతో పాటు కళాశాలల విద్యార్థులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రోజుల తరబడి ఈసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని, ఇప్పుడు వారిచ్చిన డూప్లికేట్ ధ్రువపత్రాలు నిరుపయోగంగా మారాయని, కొత్తగా దరఖాస్తు చేసినా ఫలితం ఉండడం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.