సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం..బీసీ కులాల వారు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాశారు. దరఖాస్తుకు గడువు మంగళవారం ముగియనుండటంతో అధిక సంఖ్యలో బీసీలు అక్కడికి వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయం గేటుకు తాళం వేయడంతో సర్టిఫికెట్లు అందనివారు సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు.
విధులు ముగించుకుని వెళ్తున్న తహసీల్దార్ సంజీవరావుకు తమ గోడు చెప్పుకున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే లక్ష సాయం అందకుండా పోతుందని వాపోయారు. చింతల్‌కు చెందిన మంగలి సంగమేశ్వర్ చొక్కా విప్పి గేటు ముందు బైఠాయించారు. ఈ నెల 8న ఆదాయ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తు చేశానని, మూడు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగినా పని అవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్టిఫికెట్ల కోసం ఇక్కడ 12,240 దరఖాస్తులు అందగా కేవలం 4 వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. కాగా సర్వర్ డౌన్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తహసీల్దార్ చెప్పారు. సిబ్బంది పగలు, రాత్రి పనిచేస్తున్నారని వివరించారు. ఒక్క కుత్బుల్లాపూర్ మండలంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా మంగళవారం కూడా సర్టిఫికెట్లు అందలేదు. మరోవైపు సర్టిఫికెట్లు అందినవారు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఇబ్బందులెదురయ్యాయి.
5 లక్షలకు పైగానే దరఖాస్తులు
లక్ష రూపాయల సాయానికి దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగుస్తుండడం, గడువు పెంచేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీసేవా సెంటర్లు, ఇతర కంప్యూటర్ సెంటర్లు దరఖాస్తుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు కుల, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు కనిపించాయి.
సర్టిఫికెట్లు పొందలేని వారు నిరాశతో వెనుదిరిగారు. ఇక దరఖాస్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల దరఖాస్తులు మాత్రమే వస్తాయని ప్రభుత్వం భావించినప్పటికీ, భారీ స్పందన నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకే 5 లక్షల దరఖాస్తులు వ చ్చి నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
అయితే రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు 5 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి జూలై 15 నుంచి దశల వారీగా ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేస్తారు.
దరఖాస్తు గడువు తేదీ పొడిగించాలి
రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గౌడ కులస్తులకు మొన్ననే అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకుందామని మీ సేవా కేంద్రానికి వెళితే సర్వర్ డౌన్ అయిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చా. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలి. లేకపోతే మాలాంటి నిరుపేద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందకుండా పోతుంది. –ముత్తంగి ఇందిర, కొత్లాపూర్, సంగారెడ్డి జిల్లా
వారం క్రితం దరఖాస్తు చేసినా సర్టిఫికెట్లు రాలేదు
లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం. వాటికోసం ఈనెల 14వ తేదీన దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ ఇవ్వలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. మంగళవారం చివరి రోజు కావడంతో నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో, దరఖాస్తు చేస్తానో లేదో తెలియడం లేదు. – బొడ్డుపల్లి నరసింహ, నల్లగొండ టౌన్
Comments
Please login to add a commentAdd a comment