రాజీవ్ విద్యా వేదన | students facing problems with rajiv vidya deevena scheme | Sakshi
Sakshi News home page

రాజీవ్ విద్యా వేదన

Published Sat, Jan 18 2014 2:02 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

students facing problems with rajiv vidya deevena scheme

సాక్షి, గుంటూరు: 2012 ఆఖరి రోజున కిరణ్ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ప్రీ మెట్రిక్ విద్యార్థులకు వేదనగా మారింది. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకం అమలు చేస్తామని ప్రకటించినా, నిబంధనలతో నానా అగచాట్లు పడుతున్నారు. ఆదాయం మొదలు కుల ధ్రువీకరణ, బ్యాంకుల్లో ఖాతా తెరిచే వరకు ఆంక్షల పర్వం కొనసాగుతోంది.

 అయితే విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుతున్నా, ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాలేదు. పరిశీలనకు మరికొంత గడువు పట్టే అవకాశం ఉంది. దీంతో పథకం ప్రారంభించిన ఉద్దేశం నీరుగారిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల పేరుతో సంయుక్తంగా బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి విముఖత చూపుతున్నారు. ‘ఆ సర్టిఫికెట్టు.. ఈ సర్టిఫికెట్టు.. అంటూ’ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు.

2012 డిసెంబరు 31న కిరణ్ ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన పథకం ప్రారంభించింది. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు డేస్కాలర్స్‌గా పాఠశాలలకు వెళ్ళేవారికి పుస్తకాల కొనుగోలు తదితర అవసరాలకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వారికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు నిర్ణయించారు.

 ఐదు నుంచి ఎనిమిది వరకు విద్యార్థినులకు నెలకు రూ.150 చొప్పున పది నెలలు మొత్తం రూ.1500, విద్యార్థులకు రూ.100 వంతున పది నెలలు మొత్తం రూ.వెయ్యి ఉపకార వేతనంగా అందించాలి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నెలకు రూ.150 వంతున పది నెలలు, దీనితో పాటు అడహక్ రెంట్ కింద మరో రూ.750 కలిపి మొత్తం రూ.2,250 అందించాలి. అయితే అమలులో చిత్తశుద్ధి లోపం కారణంగా జిల్లాలోని వేలాది మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.

 ఇవీ నిబంధనలు...
     ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ రెండు వర్గాల్లో నిరుపేదలు అర్హతకు దూరమవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 4,630 పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి  చదివే విద్యార్థులు జిల్లాలో 23,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీల్లో కేవలం 700 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

     బీసీలైతే ఏడాదికి ఆదాయ పరిమితి రూ.45 వేలు ఉండాలి. ఇందుకు సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో బీసీలు తక్కువగా కేవలం 3,616 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

     ఎయిడెడ్/జడ్పీ/మునిసిపల్ పాఠశాలల్లో డేస్కాలర్స్‌గా చదివే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
     బ్యాంకు ఖాతాలు తెరవడం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో విద్యార్థులే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం, ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు జిల్లాలో జరిగాయి.

 కిందటి ఏడాది బడ్జెట్ ఈ ఏడాది విడుదల...
 కిందటి ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు ఈ ఏడాది బడ్జెట్‌లో విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొమ్మిది, పదో తరగతి ఎస్సీ విద్యార్థులు 8,741 మందికి రూ.1.83 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాదికి సంబంధించి నిధుల విడుదల ఎప్పుడో అధికారులే చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనా బాధ్యతలను ఆయా సంక్షేమ శాఖల వార్డెన్లకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement