rajiv vidya deevena scheme
-
రాజీవ్ విద్యా ‘వేదన’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, ఇతర అవసరాల నిమిత్తం ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రాజీవ్ విద్యా దీవెన పథకం జిల్లాలోని విద్యార్థులకు వేదన మిగిలిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం మరో నెలరోజుల్లో ముగియనున్నప్పటికీ నేటికీ దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు కలగానే మిగిలాయి. కఠిన నిబంధనలతో పాటు అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణంగా తెలుస్తోంది. రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని 2012లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట ఎయిడెడ్, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు (డే స్కాలర్స్‌కు) మాత్రమే ఈ పథకాన్ని అమలుచేసింది. ఈ పథకం కింద నోట్ పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాల కోసం విద్యార్థులకు నెలకు 150 రూపాయల చొప్పున 10 నెలల పాటు 1,500 రూపాయలతో పాటు అడ్‌హాక్‌గా 750 రూపాయలు కలిపి ఏడాదికి మొత్తం 2,250 రూపాయలు అందిస్తారు. కాగా, ఈ ఏడాది నుంచి 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు 150 రూపాయల చొప్పున 10 నెలలకు 1,500 రూపాయలు, బాలురకు నెలకు 100 రూపాయల చొప్పున 10 నెలలకు 1,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం లక్ష్యం ఘనంగానే ఉన్నప్పటికీ ఆచరణ మాత్రం శూన్యంగా ఉంది. శాపంగా మారిన నిబంధనలు... రాజీవ్ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే, పాఠశాల స్థాయి విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు సకాలంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే ఆధార్‌కార్డు నిబంధన విద్యార్థులను వేధిస్తోంది. ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేయించుకున్నప్పటికీ కార్డులు రాకపోవడంతో అర్హులైన ఎంతోమంది విద్యార్థులు రాజీవ్ విద్యా దీవెన పథకానికి దూరమవుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో తమకు రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్లు అందుతాయో..లేదోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పరీక్షలపై దృష్టి సారించలేకపోతున్నారు. అధికారుల అలసత్వం వల్లే అవస్థలు... రాజీవ్ విద్యా దీవెన పథకం అమలులో జిల్లా అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అవస్థలకు గురిచేస్తోంది. ఈ పథకంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకంపై సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఉంటే అవసరమైన పత్రాలను వారు సిద్ధం చేసుకుని పథకానికి సకాలంలో దరఖాస్తు చేసుకునేవారు. కానీ, అధికారులు సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ సమయం ఉందనగా హడావిడి చేయడంతో అంతా గందరగోళం నెలకొంది. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. స్కాలర్‌షిప్‌తో విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయకుండానే విద్యా సంవత్సరం ముగుస్తోంది. ప్రభుత్వం, అధికారులు వెంటనే ఈ పథకంపై దృష్టిసాంచి యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటేతప్ప అర్హులైన విద్యార్థులందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. -
రాజీవ్ విద్యా వేదన
సాక్షి, గుంటూరు: 2012 ఆఖరి రోజున కిరణ్ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ప్రీ మెట్రిక్ విద్యార్థులకు వేదనగా మారింది. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకం అమలు చేస్తామని ప్రకటించినా, నిబంధనలతో నానా అగచాట్లు పడుతున్నారు. ఆదాయం మొదలు కుల ధ్రువీకరణ, బ్యాంకుల్లో ఖాతా తెరిచే వరకు ఆంక్షల పర్వం కొనసాగుతోంది. అయితే విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుతున్నా, ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాలేదు. పరిశీలనకు మరికొంత గడువు పట్టే అవకాశం ఉంది. దీంతో పథకం ప్రారంభించిన ఉద్దేశం నీరుగారిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల పేరుతో సంయుక్తంగా బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి విముఖత చూపుతున్నారు. ‘ఆ సర్టిఫికెట్టు.. ఈ సర్టిఫికెట్టు.. అంటూ’ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. 2012 డిసెంబరు 31న కిరణ్ ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెన పథకం ప్రారంభించింది. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు డేస్కాలర్స్‌గా పాఠశాలలకు వెళ్ళేవారికి పుస్తకాల కొనుగోలు తదితర అవసరాలకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ ఏడాది ఐదు నుంచి ఎనిమిదో తరగతి వారికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు నిర్ణయించారు. ఐదు నుంచి ఎనిమిది వరకు విద్యార్థినులకు నెలకు రూ.150 చొప్పున పది నెలలు మొత్తం రూ.1500, విద్యార్థులకు రూ.100 వంతున పది నెలలు మొత్తం రూ.వెయ్యి ఉపకార వేతనంగా అందించాలి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నెలకు రూ.150 వంతున పది నెలలు, దీనితో పాటు అడహక్ రెంట్ కింద మరో రూ.750 కలిపి మొత్తం రూ.2,250 అందించాలి. అయితే అమలులో చిత్తశుద్ధి లోపం కారణంగా జిల్లాలోని వేలాది మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవీ నిబంధనలు... ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఈ రెండు వర్గాల్లో నిరుపేదలు అర్హతకు దూరమవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 4,630 పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు జిల్లాలో 23,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీల్లో కేవలం 700 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బీసీలైతే ఏడాదికి ఆదాయ పరిమితి రూ.45 వేలు ఉండాలి. ఇందుకు సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదు. ఈ నిబంధన కారణంగా జిల్లాలో బీసీలు తక్కువగా కేవలం 3,616 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఎయిడెడ్/జడ్పీ/మునిసిపల్ పాఠశాలల్లో డేస్కాలర్స్‌గా చదివే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. బ్యాంకు ఖాతాలు తెరవడం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో విద్యార్థులే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం, ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు జిల్లాలో జరిగాయి. కిందటి ఏడాది బడ్జెట్ ఈ ఏడాది విడుదల... కిందటి ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు ఈ ఏడాది బడ్జెట్లో విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొమ్మిది, పదో తరగతి ఎస్సీ విద్యార్థులు 8,741 మందికి రూ.1.83 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాదికి సంబంధించి నిధుల విడుదల ఎప్పుడో అధికారులే చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనా బాధ్యతలను ఆయా సంక్షేమ శాఖల వార్డెన్లకు అప్పగించారు.