
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న మంత్రి అజయ్‌కుమార్, పక్కన కలెక్టర్ తదితరులు
ఖమ్మం అర్బన్: విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా గురువారం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సర్టిఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు.
పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్‌ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సర్టిఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్‌డీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment