Caste certification
-
విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు
ఖమ్మం అర్బన్: విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా గురువారం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సర్టిఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సర్టిఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్డీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
సంచార జాతులకు ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: ఆకర్షించే వింత ఆహార్యం.. రోడ్డు పక్కన ప్రమాద భరితమైన సర్కస్ విన్యాసాలు.. వనమూలికలు, పూసలు అమ్మకం, ఎలుకలు పట్టడం లాంటి వాటి ద్వారా బతుకు నెట్టుకొచ్చే సంచార జాతులకు నవశకం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస బతుకులకు భరోసా ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేరువ చేస్తున్నారు. సంచార జాతుల పిల్లల చదువులు, సంక్షేమ పథకాలకు కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘దేవరవాండ్లు’కు చెందిన నాలుగు సంచార జాతుల కుటుంబాలకు రెవెన్యూ అధికారులు గత బుధవారం కుల ధ్రువీకరణ పత్రాలు (బీసీ –ఏ) జారీ చేయడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల క్రితం 1970లో అనంతరాము కమిషన్ చేసిన సిఫారసులు ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలం నుంచి దుర్భరం.. దేశంలో సుమారు 500 సంచార జాతులను బ్రిటీష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి అణిచివేసింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంచార జాతులను 1952 ఆగస్టు 31న విముక్త జాతులుగా ప్రకటించారు. వీరి అభివృద్ధి కోసం 1947లో క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, 1949లో అనంతశయనం అయ్యంగార్ కమిటీ, 1961–62లో వెన్నెలగంటి రాఘవయ్య ట్రైబల్ ఎంక్వైరీ, 2008లో బాలకృష్ణా రేణికే జాతీయ కమిషన్, 2015లో బిక్కు రామ్‌జీ ఇదాత్జీ కమిషన్లు వేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో 2 లక్షల మందికిపైనే రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. ఒకే చోట నివాసం ఉంటూ కాస్త అభివృద్ధి చెందిన వారిని విముక్తి జాతులుగా వ్యవహరిస్తున్నారు. ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని బతుకుదెరువుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్థ సంచార జాతులుగా పిలుస్తున్నారు. సొంత ఊరు, గూడు లేకుండా ఉపాధి కోసం ఊరూరా తిరిగేవారిని సంచార జాతులుగా విభజించారు. అత్యంత వెనుకబడిన జాతులు రాష్ట్రంలో 32 ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సంచార జాతుల బతుకులు మెరుగుపరుస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేవరవాండ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాలకొల్లు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం తమను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల సంచార జాతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –పెండ్ర వీరన్న, ఏపీ ఎంబీసీ చైర్మన్ అమ్మ ఒడితో బిడ్డను చదివిస్తున్నా వలస బతుకులతో మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలవతో నా బిడ్డ రమేష్ చదువులకు అమ్మ ఒడి ఆసరాగా నిలిచింది. లేదంటే మా మాదిరిగానే కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. నా బిడ్డ చదువుకు అండగా నిలిచిన సీఎం జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. –పి,లక్ష్మీ, సిరిపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా. ‘చేయూత’ అందించారు భిక్షాటనతో జీవనం గడిపే మాకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఇస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. గతంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసుతో మాకు గుర్తింపు వచ్చింది. –వాడపల్లి పెద్దింట్లు, సీతారామపురం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్న సంచార జాతులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పుడు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాలను వర్తింపజేస్తున్నారు. ఉపాధి కోసం ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన, మురికి కాల్వల గట్లుపై, రైల్వే ట్రాక్‌ల వెంట పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సంచార జాతుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్య శకం మొదలైంది. -
ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ కార్డు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎంప్లాయిమెంట్ కార్డు కావాలంటే నిరుద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్ కార్డు పొందవచ్చు. అది కూడా ఒకటి, రెండు రోజుల్లోనే. ఆన్లైన్ విధానంలో నమోదు చేసుకునేలా ఉపాధి, శిక్షణ శాఖ తాజాగా www. employment.telangana.gov.in వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ వెబ్‌పోర్టల్ ద్వారా ఎంప్లాయిమెంట్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలు ఉండాలి. కొత్తగా నమోదు చేసుకునే నిరుద్యోగి ఫొటో, నివాస, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కాగితంపై సంతకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్, అదనపు విద్యార్హత వివరాల నమోదు కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డున్న వారి వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వీళ్లు గడువులోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పోర్టల్ ద్వారా రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కార్డు పొందితే అది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సకాలంలో రెన్యువల్ చేసుకోలేకపోయిన వారికి ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అదనంగా ఇస్తారు. ఈ సమయంలోనూ రెన్యువల్ చేసుకోకపోతే ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్ జాబితా నుంచి అతడిని శాశ్వతంగా తొలగిస్తారు. ఎంప్లాయిమెంట్ కార్డు నమోదుకు ఒకరికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు. నిరుద్యోగి స్థానిక జిల్లా తరఫునే దరఖాస్తు చేసుకోవాలి. 45 ఏళ్ల లోపున్న నిరుద్యోగులే అర్హులు. ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు మరింత ఉత్తమ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అతను పని చేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాలి. -
శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసులో ఉమ్మడి హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ కుల ధ్రువీకరణ పత్రాలను సాక్ష్యంగా కోర్టు ముందుంచలేదంటూ బాధిత యువకులు చేసిన ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో గురువారం కింది కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు తీర్పును వెలువరించవద్దని కింది కోర్డును హైకోర్టు ఆదేశించింది. బాధిత యువకులు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతోపాటు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.సుజాతకు స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 1997లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముగ్గురు దళిత యువకులకు శిరోముండనం చేయించారు. బాధిత యువకులు కోటి చినరాజు, మరో ఇద్దరు ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 1997 జనవరిలో తోట త్రిమూర్తులుతోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. 2008లో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై విశాఖపట్నం 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది. -
నామినేషన్లకు తెర
సాక్షి, ఖమ్మం: స్థానిక నామినేషన్లకు తెర పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కోలాహలంతో నామినేషన్ల పర్వమే ప్రచారాన్ని తలపించింది. చివరి రోజు కావడంతో గురువారం భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారితో పాటు నేతలు, పార్టీ శ్రేణులు రావడంతో నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడాయి. జెడ్పీటీసీ నామినేషన్లకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నిర్ణీత సమయంలోపు వచ్చిన వారిని జెడ్పీలోకి అనుమతించడంతో నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. అభ్యర్థుల సందడితో నామినేషన్ కేంద్రాలు జాతరను తలపించాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా కేంద్రాలలో ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు ఒక్కసారే భారీగా తరలిరావడంతో నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు ఇబ్బంది పడ్డారు. పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులు చివరి నిమిషంలో కుల ధ్రువీకరణ, ఇంటి పన్ను, ఇతర అర్హత పత్రాల కోసం హైరానా పడ్డారు. అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవడం, లేని పత్రాల కోసం ఉరుకులు.. పరుగులు పెట్టారు. ఇక జెడ్పీటీసీ నామినేషన్లకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో జెడ్పీ కార్యాలయం జనంతో నిండిపోయింది. అభ్యర్థితో పాటు బలపరచడానికి మరో ఇద్దరిని మాత్రమే లోనికి పంపించారు. అయితే పలు పార్టీ నేతలు రావడం.. అభ్యర్థుల వెంట తమను లోనికి పంపించాలన్న వాదనలు, నినాదాలతో జెడ్పీలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. మండలాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తరలివచ్చారు. దీంతో ఈ నామినేషన్ల ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. తొలిసారి నామినేషన్ వేసే అభ్యర్థులు నామినేషన్ పత్రం భర్తీ చేయడం రాక , డిపాజిట్ ఎక్కడ చెల్లించాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. కుల ధ్రువీకరణ ఒరిజినల్ పత్రాలు లేని వారు జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ సంతకం కోసం జెడ్పీ కార్యాలయం, ఖమ్మంలో తమకు తెలిసిన అధికారుల వద్దకు పరుగులు పెట్టి మరీ సంతకాలు చేయించుకున్నారు. కుక్కునూరుకు నామినేషన్లు నిల్.. కుక్కునూరు మండలంలో జెడ్పీటీసీ స్థానంతో పాటు 8 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోలవరం ముంపు నుంచి కుక్కునూరును మినహాయించాలని, అప్పటి వరకు నామినేషన్లు ఎవరు వేసినా అడ్డుకుంటామని అఖిలపక్ష పార్టీలు హెచ్చరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అఖిలపక్ష పార్టీల హెచ్చరికలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నుంచి ఆశావహులు ఎవ్వరూ.. నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. జెడ్పీటీసీకి నామినేషన్ వేస్తారేమోనని చివరిరోజు అఖిలపక్ష పార్టీల నేతలు జెడ్పీ కార్యాలయం వద్ద కాపలా కాశారు. చివరకు తమ వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలే దు. దీంతో ఇక ఈ మండలానికి ఇప్పట్లో ఎన్నికలు లేనట్లేనని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. అసలు మండల ఓటర్లు పోలింగ్ బహిష్కరిస్తే ఎన్నికలు ఎలా జరగుతాయన్న వాదన ఉంది. ఎస్సీ మహిళా స్థానాల్లో వలస నేతలు.. జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో చివరి రోజు ఆయా పార్టీల నేతలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయిన జెడ్పీటీసీ స్థానాల నుంచి చైర్పర్సన్ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. జిల్లాలోని వాజేడు, చర్ల, వెంకటాపురం, పినపాక మండలాలు ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో ఈ మండలాల నుంచి పోటీ చేసి విజయం సాధించాలన్న వ్యూహంతో పలు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇతర మండలాల్లో నేతలుగా ఉన్న ఎస్సీ మహిళలను ఈ మండలాల్లో నామినేషన్లు వేయించడానికి పోటీపడ్డారు. కొత్తగూడెం, అశ్వాపురం, భధ్రాచలం, ఏన్కూరు మండలాలు ఎస్సీ జనరల్ కావడంతో ఇక్కడి నుంచి మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అంతర్గతంగా స్థానిక పొత్తులు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టం పూర్తయినా పలు నియోజకవర్గాల్లో స్థానిక పొత్తులు కుదరలేదు. కొన్ని చోట్ల పార్టీల నేతలు అంతర్గంతంగా పొత్తులు కుదుర్చుకొని నామినేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా బరిలో నిలిచే నేతలు.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సమయం దొరకక స్థానిక పొత్తులపై దృష్టి పెట్టలేదని నేతలు అభిప్రాయ పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ ఎన్నికలు కీలకమైనా అధినేతలు పట్టించుకోకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం సాధించినా, ఓటమి పాలైనా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరిస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితులతో నామినేషన్ల ఉప సంహరణ నాటికైనా ఇప్పటి వరకు అంతర్గంతగా ఉన్న స్థానిక పొత్తులు బహిర్గతమవుతాయో .. లేదో వేచి చూడాల్సిందే.