సాక్షి, అమరావతి: ఆకర్షించే వింత ఆహార్యం.. రోడ్డు పక్కన ప్రమాద భరితమైన సర్కస్ విన్యాసాలు.. వనమూలికలు, పూసలు అమ్మకం, ఎలుకలు పట్టడం లాంటి వాటి ద్వారా బతుకు నెట్టుకొచ్చే సంచార జాతులకు నవశకం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలస బతుకులకు భరోసా ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేరువ చేస్తున్నారు. సంచార జాతుల పిల్లల చదువులు, సంక్షేమ పథకాలకు కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘దేవరవాండ్లు’కు చెందిన నాలుగు సంచార జాతుల కుటుంబాలకు రెవెన్యూ అధికారులు గత బుధవారం కుల ధ్రువీకరణ పత్రాలు (బీసీ –ఏ) జారీ చేయడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల క్రితం 1970లో అనంతరాము కమిషన్ చేసిన సిఫారసులు ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
బ్రిటీష్ కాలం నుంచి దుర్భరం..
దేశంలో సుమారు 500 సంచార జాతులను బ్రిటీష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి అణిచివేసింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంచార జాతులను 1952 ఆగస్టు 31న విముక్త జాతులుగా ప్రకటించారు. వీరి అభివృద్ధి కోసం 1947లో క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, 1949లో అనంతశయనం అయ్యంగార్ కమిటీ, 1961–62లో వెన్నెలగంటి రాఘవయ్య ట్రైబల్ ఎంక్వైరీ, 2008లో బాలకృష్ణా రేణికే జాతీయ కమిషన్, 2015లో బిక్కు రామ్‌జీ ఇదాత్‌జీ కమిషన్‌లు వేసినా ఫలితం దక్కలేదు.
రాష్ట్రంలో 2 లక్షల మందికిపైనే
రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. ఒకే చోట నివాసం ఉంటూ కాస్త అభివృద్ధి చెందిన వారిని విముక్తి జాతులుగా వ్యవహరిస్తున్నారు. ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని బతుకుదెరువుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్థ సంచార జాతులుగా పిలుస్తున్నారు. సొంత ఊరు, గూడు లేకుండా ఉపాధి కోసం ఊరూరా తిరిగేవారిని సంచార జాతులుగా విభజించారు. అత్యంత వెనుకబడిన జాతులు రాష్ట్రంలో 32 ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
సంచార జాతుల బతుకులు మెరుగుపరుస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేవరవాండ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాలకొల్లు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం తమను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల సంచార జాతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
–పెండ్ర వీరన్న, ఏపీ ఎంబీసీ చైర్మన్
అమ్మ ఒడితో బిడ్డను చదివిస్తున్నా
వలస బతుకులతో మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలవతో నా బిడ్డ రమేష్ చదువులకు అమ్మ ఒడి ఆసరాగా నిలిచింది. లేదంటే మా మాదిరిగానే కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. నా బిడ్డ చదువుకు అండగా నిలిచిన సీఎం జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం.
–పి,లక్ష్మీ, సిరిపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా.
‘చేయూత’ అందించారు
భిక్షాటనతో జీవనం గడిపే మాకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఇస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. గతంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసుతో మాకు గుర్తింపు వచ్చింది.
–వాడపల్లి పెద్దింట్లు, సీతారామపురం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు
అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్న సంచార జాతులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పుడు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాలను వర్తింపజేస్తున్నారు. ఉపాధి కోసం ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన, మురికి కాల్వల గట్లుపై, రైల్వే ట్రాక్‌ల వెంట పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సంచార జాతుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్య శకం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment