tribes development
-
మర్రిచెట్టు తండా అమెరికాకు అలంకరణ
జర్మనీ లేదా అమెరికాలో తయారైన కళాకృతులు, వస్త్రాలు మారుమూల మర్రిచెట్టు తండాలో కనిపించడం విశేషం కాకపోవచ్చు. అయితే మర్రిచెట్టు తండాలో తయారైన కళాకృతులు జర్మనీ, అమెరికాలాంటి ఎన్నో దేశాల్లో కనిపించడం కచ్చితంగా విశేషమే. ‘గిరిజన’ అనే మాటతో ప్రతిధ్వనించే శబ్దం... కళ. ఆ కళ ఆటలు, పాటలు, వస్త్రాలు, కళాకృతుల రూపంలో వారి దైనందిన జీవితంలో భాగం అయింది. ప్రపంచీకరణ ప్రభావంతో ‘అత్యాధునికత’ అనేది పురా సంస్కృతులు, కళలపై కత్తిలా వేలాడుతుంది. ఆ కత్తి వేటు పడకుండా తమ సంప్రదాయ కళలను రక్షించుకోవడమే కాదు... ‘ఇది మా కళ’ అని ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది మర్రిచెట్టు తండా...నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మరిచ్రెట్టు తండా... ఒక కేక వేస్తే తండా మొత్తం వినిపించేంత చిన్న తండా. వ్యవసాయపనులు, బయటి ఊళ్లల్లోకి వెళ్లి కూలిపనులు చేసుకునేవాళ్లే తండాలో ఎక్కువమంది ఉన్నారు.వ్యవసాయం అయినా, కూలిపనులు అయినా శ్రమతో కూడుకున్నవి. ఇంటికి వచ్చిన తరువాత తండాలోని మహిళలకు ఆ శ్రమభారాన్ని తగ్గించేవి కళలు. అందులో ప్రధానమైనవి చేతివృత్తుల కళలు. తాతముత్తాతల నుంచి పరంపరగా వస్తూ తమ చేతికి అందిన ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేస్తున్నాయి.అద్దాలు, దారాలు, గజ్జెలు, పూసలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఇంటికి అవసరమైన అలంకరణ వస్తువులను, గిరిజన సంప్రదాయ దుస్తులను రూపొందిస్తున్నారు. ఈ తండావాసుల హస్తకళలు నాబార్డ్ దృష్టిలో పడడంతో కొత్త ద్వారం తెరుచుకుంది. తండావాసులు తయారు చేసిన కళాకృతులు, దుస్తులను మార్కెటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని నాబార్డ్ ముందుకు వచ్చింది. నాబార్డు నిర్వహించే ఎగ్జిబిషన్లలో మర్రిచెట్టు తండావాసుల స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవాళ్లు.నాబార్డ్ చొరవతో తండాకు మాత్రమే పరిమితమైన కళాకృతులు లోకానికి పరిచయం అయ్యాయి. సంప్రదాయ గిరిజన దుస్తులు, వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేసి రాజస్థాన్, హరియాణా, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మర్రిచెట్టు తండా మహిళలు తయారు చేస్తున్న పన్నెండు రకాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా పురుషులు అలంకరణగా ధరించే ‘విరేనాపాటో’కు మంచి ఆదరణ ఉంది.తమ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా గొప్ప విజయం సాధిస్తే వారిని ఈ ‘విరేనాపాటో’తో సత్కరిస్తారు. దీంతోపాటు దర్వాజా తోరణం, చేతి సంచులు, కోత్లో (పైసలు దాచే సంచి), పులియాగాల (తలపై బుట్ట ధరించేది), గండో(మేరమ్మ అమ్మ వారి ప్రతీక), దాండియా డ్రెస్, కవ్య (పెళ్లయిన గిరిజన మహిళలు ధరించేవి), దడ్ప (ఫ్రిజ్ కవర్లు) మొదలైన వాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.‘మేము తయారు చేస్తున్న వస్తువులతో రాబడి వస్తోందనే సంతోషం కంటే వాటి గురించి ఎక్కడెక్కడి వాళ్లో మెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోంది. బట్టలు కూడుతున్నప్పుడో, బుట్టలు చేస్తున్నప్పుడో పని చేస్తున్నట్లుగా ఉండదు. హుషారుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏ పని లేనప్పుడు ఈ పనులు చేసేవాళ్లం. ఇప్పుడు ఈ పనే మాకు పెద్ద పని అయింది’ అంటుంది నేనావత్ చాంది.‘బయట ఊళ్లకు పోయినప్పుడు మాది మర్రిచెట్టు తండా అని గర్వంగా చెప్తా. పనుల కోసం తండా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు ఇక్కడే ఉండొచ్చు’ అంటూ ఉపాధి కోసం దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లను అమ్మలాంటి తండాకు తిరిగి రావాలని కోరుకుంటుంది బాణావత్ పద్మ. వారికోసం హస్తకళలు ఎదురుచూస్తున్నాయి.‘ఇప్పుడు మేము చేస్తున్నవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటుంది నేనావత్ సుబ్బులు. గిరిజన కళాకృతులలో ఎన్నో మరుగునపడిపోయాయి. వాటి గురించి తెలిసిన వారు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. అలాంటి వారితో మాట్లాడితే తెరమరుగైపోయిన ఎన్నో కళాకృతులు మళ్లీ కొత్త కాంతులతో వెలుగుతాయి.నేనావత్ చాంది, నేనావత్ సుబ్బులు, బాణావత్ పద్మ... వీరు మాత్రమే కాదు మర్రిచెట్టు తండాలోని 150 మంది మహిళలు చేతివృత్తుల కళాకారులే కాదు చరిత్ర చెప్పే ఉపన్యాసకులు కూడా! ‘విరేనాపాటో’ నుంచి ‘గండో’ వరకు వాటి తయారీ గురించి మాత్రమే కాదు వాటి వెనుక చరిత్ర కూడా ఈతరానికి తెలియజేస్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది!– చింతకింది గణేశ్, సాక్షి, నల్లగొండ,కుటుంబానికి ఆసరాగా...తండాలో దాదాపు 150మందికి పైగా మహిళలం చేతి అల్లికల ద్వారా సంప్రదాయ వస్త్రాలు, వస్తువులను తయారు చేస్తున్నాం. ఏ కొంచెం తీరిక దొరికినా ఎవరి ఇండ్లలో వాళ్లం వీటిని తయారు చేస్తుంటాం. ఒక్కో వస్తువు తయారు చేసేందుకు వారం రోజులు పడుతుంది. వీటిని అమ్మగా వచ్చే డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.– బాణావత్ పద్మవిదేశాల నుంచి వస్తున్నారుమేము తయారు చేసే అల్లికలను చూడడం కోసం మా తండాకు విదేశాల నుండి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటూ మా పనులు చేసుకుంటూనే సంప్రదాయ పద్ధతిలో చేతితో అల్లికలు అల్లుతున్నాం. తీజ్ వేడుకల్లో గిరిజనులు ధరించే విరేనాపాటోతో పాటు పులియాగాల(తలపై ధరించేది)వంటి అలంకరణ వస్త్రాలు తయారు చేస్తున్నాం.– నేనావత్ సుబ్బులుసబ్సిడీ ఇవ్వాలిసంప్రదాయ దుస్తులతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే అలంకరణ వస్తువులను 30 ఏళ్లుగా తయారు చేస్తున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లినా తీరిక వేళల్లో వీటిని తయారు చేస్తాం. మేము తయారు చేసిన వాటిని కొనేందుకు పట్టణాల నుంచి చాలామంది వస్తుంటారు. కొనడమే కాదు వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. అల్లికలకు ఉపయోగించే వస్తువులపై సబ్సిడీ ఇవ్వడంతోపాటు, పట్టణాల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ్రపోత్సహించాలి.– నేనావత్ చాంది -
సంచార జాతులకు ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: ఆకర్షించే వింత ఆహార్యం.. రోడ్డు పక్కన ప్రమాద భరితమైన సర్కస్ విన్యాసాలు.. వనమూలికలు, పూసలు అమ్మకం, ఎలుకలు పట్టడం లాంటి వాటి ద్వారా బతుకు నెట్టుకొచ్చే సంచార జాతులకు నవశకం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస బతుకులకు భరోసా ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేరువ చేస్తున్నారు. సంచార జాతుల పిల్లల చదువులు, సంక్షేమ పథకాలకు కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘దేవరవాండ్లు’కు చెందిన నాలుగు సంచార జాతుల కుటుంబాలకు రెవెన్యూ అధికారులు గత బుధవారం కుల ధ్రువీకరణ పత్రాలు (బీసీ –ఏ) జారీ చేయడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల క్రితం 1970లో అనంతరాము కమిషన్ చేసిన సిఫారసులు ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలం నుంచి దుర్భరం.. దేశంలో సుమారు 500 సంచార జాతులను బ్రిటీష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి అణిచివేసింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంచార జాతులను 1952 ఆగస్టు 31న విముక్త జాతులుగా ప్రకటించారు. వీరి అభివృద్ధి కోసం 1947లో క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, 1949లో అనంతశయనం అయ్యంగార్ కమిటీ, 1961–62లో వెన్నెలగంటి రాఘవయ్య ట్రైబల్ ఎంక్వైరీ, 2008లో బాలకృష్ణా రేణికే జాతీయ కమిషన్, 2015లో బిక్కు రామ్‌జీ ఇదాత్జీ కమిషన్లు వేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో 2 లక్షల మందికిపైనే రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. ఒకే చోట నివాసం ఉంటూ కాస్త అభివృద్ధి చెందిన వారిని విముక్తి జాతులుగా వ్యవహరిస్తున్నారు. ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని బతుకుదెరువుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్థ సంచార జాతులుగా పిలుస్తున్నారు. సొంత ఊరు, గూడు లేకుండా ఉపాధి కోసం ఊరూరా తిరిగేవారిని సంచార జాతులుగా విభజించారు. అత్యంత వెనుకబడిన జాతులు రాష్ట్రంలో 32 ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సంచార జాతుల బతుకులు మెరుగుపరుస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేవరవాండ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాలకొల్లు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం తమను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల సంచార జాతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –పెండ్ర వీరన్న, ఏపీ ఎంబీసీ చైర్మన్ అమ్మ ఒడితో బిడ్డను చదివిస్తున్నా వలస బతుకులతో మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలవతో నా బిడ్డ రమేష్ చదువులకు అమ్మ ఒడి ఆసరాగా నిలిచింది. లేదంటే మా మాదిరిగానే కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. నా బిడ్డ చదువుకు అండగా నిలిచిన సీఎం జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. –పి,లక్ష్మీ, సిరిపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా. ‘చేయూత’ అందించారు భిక్షాటనతో జీవనం గడిపే మాకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఇస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. గతంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసుతో మాకు గుర్తింపు వచ్చింది. –వాడపల్లి పెద్దింట్లు, సీతారామపురం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్న సంచార జాతులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పుడు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాలను వర్తింపజేస్తున్నారు. ఉపాధి కోసం ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన, మురికి కాల్వల గట్లుపై, రైల్వే ట్రాక్‌ల వెంట పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సంచార జాతుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్య శకం మొదలైంది. -
గిరిజనులకు అందని పథకాలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల్లో పురోగతి కనిపించటం లేదు. కొంతమంది అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ పథకాల అమలు కాగితాలకే పరిమితమవుతోంది. గిరిజనుల స్వావలంబన కోసం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదు. ఏజెన్సీ పరిధిలో గల 29 మండలాల్లో గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఏటా ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో దీన్ని అమలు చేసే బాధ్యతను ఇందిరాక్రాంతి పథం అధికారులకు అప్పగించారు. 2012-13 సంవత్సరానికి గాను 643 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో వీరపాండియన్ ప్రకటించారు. ఇందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రోత్సాకంగా ఐటీడీఏ ద్వారా రూ.2.75 కోట్ల సబ్సిడీని ఇప్పటికే విడుదల చేశారు. వీటిని ఆయా మండలాల్లో గిరిజనులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకులలో జమచేయించారు. యూనిట్ విలువను బట్టి లబ్ధిదారులకు అవసరమైన నిధులను ఆయా బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పించి పథకాలను గ్రౌండింగ్ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పీవో వీరపాండియన్ ఐకేపీ అధికారులకు సూచించారు. కానీ అర్హులైన గిరిజన లబ్ధిదారులను ఎంపిక చేయటంలో ఐకేపీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం కోసం గిరిజన దర్బార్‌కు ప్రతి సోమవారం వందల సంఖ్యలో గిరిజనులు వస్తున్నారు. కానీ ఐకేపీ అధికారులకు మాత్రం పథకాలను అందజేసేందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయటానికి ఆపసోపాలు పడుతుండటం గమనార్హం. ఇప్పటి వరకూ 380 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లుగా నివేదికల్లో పొందుపరిచారు. అయితే ఏజెన్సీలోని వెనుకబడిన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ఐకేపీ అధికారులు నివేదికల్లో చూపించిన విధంగా యూనిట్లు క్షేత్ర స్థాయిలో కనిపించలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల మెప్పుకోసమేనా : ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా యూనిట్లను గ్రౌండింగ్ చేసే విషయంలో ఐకేపీ అధికారుల నిర్లక్ష్యంపై అనేక సమీక్షల్లో ఐటీడీఏ పీవో వీరపాండియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా పథకాల గ్రౌండింగ్‌లో పురోగతి లేకపోవటంతో నిర్లక్ష్యంగా ఉన్న 25 మండలాల ఏపీపీలకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయాలని కూడా ఆదేశించారు. ఐటీడీఏ పీవో కన్నెర్ర చేయటంతో వేటును తప్పించుకునేందుకు సదరు అధికారులు కొత్తదారులు వెతికారు. క్షేత్ర స్థాయిలో యూనిట్లను గ్రౌండింగ్ చేయకున్నప్పటికీ నివేదికల్లో మాత్రం లబ్ధిదారులకు పథకాలు అందజే సినట్లుగా నివేదికల్లో పొందుపరిచారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో మంజూరు చేసిన యూనిట్లను పరిశీలిస్తే ఇక్కడి అధికారుల నిర్వాకం బట్టబయలయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. కొండరెడ్లపై శ్రద్ధ ఏదీ : చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో నివసిస్తున్న కొండరెడ్డి మహిళలకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీనిలో భాగంగానే ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌లో ఎక్కువ యూనిట్లను ఇక్కడనే మంజూరు చేశారు. ప్రధానంగా కొండరెడ్ల కోసం బేంబో(వెదురుతో బుట్టలు అల్లిక) యూనిట్లను ప్రోత్సహించారు. చింతూరు మండలంలో 37, కూనవరంలో 40, వీఆర్ పురంలో 20 యూనిట్లను మంజూరు చేశారు. కొండరెడ్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వీటిని వెంటనే ప్రాంరంభించాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. కానీ దీనిపై ఐకేపీ అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవటంతో ఐటీడీఏ నుంచి మంజూరైన సబ్సిడీ బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను గిరిజనులు ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు అన్ని పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యతను ఇందిరాక్రాంతి పథం అధికారులకే అప్పగిస్తున్నారు. కానీ టీపీయంయూ పరిధిలో ఐకేపీ కార్యకలాపాల పర్యవేక్షణకు సమర్థవంతమైన అధికారి లేకపోవటంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వీరపాండియన్ ప్రత్యేక దృష్టి సారించి నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప క్షేత్ర స్థాయిలో పథకాల పురోగతి ఉండదని గిరిజన సంఘాల వారు అంటున్నారు.