భద్రాచలం, న్యూస్‌లైన్ : గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల్లో పురోగతి కనిపించటం లేదు. కొంతమంది అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ పథకాల అమలు కాగితాలకే పరిమితమవుతోంది. గిరిజనుల స్వావలంబన కోసం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదు.
ఏజెన్సీ పరిధిలో గల 29 మండలాల్లో గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఏటా ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో దీన్ని అమలు చేసే బాధ్యతను ఇందిరాక్రాంతి పథం అధికారులకు అప్పగించారు. 2012-13 సంవత్సరానికి గాను 643 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో వీరపాండియన్ ప్రకటించారు. ఇందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు.
ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రోత్సాకంగా ఐటీడీఏ ద్వారా రూ.2.75 కోట్ల సబ్సిడీని ఇప్పటికే విడుదల చేశారు. వీటిని ఆయా మండలాల్లో గిరిజనులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకులలో జమచేయించారు. యూనిట్ విలువను బట్టి లబ్ధిదారులకు అవసరమైన నిధులను ఆయా బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పించి పథకాలను గ్రౌండింగ్ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పీవో వీరపాండియన్ ఐకేపీ అధికారులకు సూచించారు. కానీ అర్హులైన గిరిజన లబ్ధిదారులను ఎంపిక చేయటంలో ఐకేపీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం కోసం గిరిజన దర్బార్‌కు ప్రతి సోమవారం వందల సంఖ్యలో గిరిజనులు వస్తున్నారు. కానీ ఐకేపీ అధికారులకు మాత్రం పథకాలను అందజేసేందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయటానికి ఆపసోపాలు పడుతుండటం గమనార్హం. ఇప్పటి వరకూ 380 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లుగా నివేదికల్లో పొందుపరిచారు. అయితే ఏజెన్సీలోని వెనుకబడిన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ఐకేపీ అధికారులు నివేదికల్లో చూపించిన విధంగా యూనిట్లు క్షేత్ర స్థాయిలో కనిపించలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారుల మెప్పుకోసమేనా :
ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా యూనిట్లను గ్రౌండింగ్ చేసే విషయంలో ఐకేపీ అధికారుల నిర్లక్ష్యంపై అనేక సమీక్షల్లో ఐటీడీఏ పీవో వీరపాండియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా పథకాల గ్రౌండింగ్‌లో పురోగతి లేకపోవటంతో నిర్లక్ష్యంగా ఉన్న 25 మండలాల ఏపీపీలకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయాలని కూడా ఆదేశించారు. ఐటీడీఏ పీవో కన్నెర్ర చేయటంతో వేటును తప్పించుకునేందుకు సదరు అధికారులు కొత్తదారులు వెతికారు. క్షేత్ర స్థాయిలో యూనిట్లను గ్రౌండింగ్ చేయకున్నప్పటికీ నివేదికల్లో మాత్రం లబ్ధిదారులకు పథకాలు అందజే సినట్లుగా నివేదికల్లో పొందుపరిచారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో మంజూరు చేసిన యూనిట్లను పరిశీలిస్తే ఇక్కడి అధికారుల నిర్వాకం బట్టబయలయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
కొండరెడ్లపై శ్రద్ధ ఏదీ :
చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో నివసిస్తున్న కొండరెడ్డి మహిళలకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీనిలో భాగంగానే ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌లో ఎక్కువ యూనిట్లను ఇక్కడనే మంజూరు చేశారు. ప్రధానంగా కొండరెడ్ల కోసం బేంబో(వెదురుతో బుట్టలు అల్లిక) యూనిట్లను ప్రోత్సహించారు. చింతూరు మండలంలో 37, కూనవరంలో 40, వీఆర్ పురంలో 20 యూనిట్లను మంజూరు చేశారు. కొండరెడ్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వీటిని వెంటనే ప్రాంరంభించాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. కానీ దీనిపై ఐకేపీ అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవటంతో ఐటీడీఏ నుంచి మంజూరైన సబ్సిడీ బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను గిరిజనులు ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు అన్ని పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యతను ఇందిరాక్రాంతి పథం అధికారులకే అప్పగిస్తున్నారు. కానీ టీపీయంయూ పరిధిలో ఐకేపీ కార్యకలాపాల పర్యవేక్షణకు సమర్థవంతమైన అధికారి లేకపోవటంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వీరపాండియన్ ప్రత్యేక దృష్టి సారించి నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప క్షేత్ర స్థాయిలో పథకాల పురోగతి ఉండదని గిరిజన సంఘాల వారు అంటున్నారు.
గిరిజనులకు అందని పథకాలు
Published Sun, Sep 1 2013 2:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement