విద్య, వైద్యానికి ప్రాధాన్యం
పాడేరు: ఏజెన్సీవాసులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తానని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ తెలిపారు. విద్య, వైద్యంపై మరింత దృష్టి సారిస్తామన్నారు. తెలంగాణలో సబ్ కలెక్టర్‌గా పని చేసిన ఈయన రాష్ట్ర విభజనతో ఆంధ్ర రాష్ట్ర సర్వీసులకు నియమితులయ్యారు. ప్రభుత్వం ఐటీడీఏ పీవోగా నియమించింది. సోమవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తాను ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందానన్నారు. ఆ సమయంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన అభివృద్ధి కార్యక్రమాలపై కొంత అవగాహన ఉందన్నారు. అన్నిశాఖల ద్వారా గిరిజన అభివృద్ధికి అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపి మరింత అవగాహన ఏర్పరచుకుంటానని చెప్పారు. ఏజెన్సీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వెనువెంటనే కృషి చేస్తానన్నారు. తాగునీటి సౌకర్యాలు, రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ అడ్డంకితో నిలిచిపోయిన ఏజెన్సీలోని అన్ని రోడ్లకు అనుమతులు తెప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. మన్యంలోని అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని పీవో చెప్పారు. తొలుత ఉదయాన్నే జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్‌ను అందజేసిన పీవో నేరుగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని తన చాంబర్‌లో సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ పని చేసిన వి.వినయ్‌చంద్‌ను ప్రభుత్వం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆయన ఈ నెల 10న రిలీవ్ అయ్యారు. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. కొత్త పీవోగా హరినారాయణన్ విధుల్లో చేరడంతో సబ్ కలె క్టర్ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ ఎం.కమలలు పాల్గొన్నారు.
పేరు : ఎం.హరినారాయణన్
స్వస్థలం : తమిళనాడు రాష్ట్రం, విలుప్పురం
పుట్టిన తేదీ : 26-10-1985
విద్య : ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులు
ఐఏఎస్‌లో ఆల్ ఇండియాలో 27వ స్థానం
తొలిపోస్టింగ్ : 2012లో తెలంగాణ లోని బోధన్ సబ్ కలెక్టర్.
రెండవ పోస్టింగ్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్
మూడో పోస్టింగ్ : పాడేరు ఐటీడీఏ పీవో