జర్మనీ లేదా అమెరికాలో తయారైన కళాకృతులు, వస్త్రాలు మారుమూల మర్రిచెట్టు తండాలో కనిపించడం విశేషం కాకపోవచ్చు. అయితే మర్రిచెట్టు తండాలో తయారైన కళాకృతులు జర్మనీ, అమెరికాలాంటి ఎన్నో దేశాల్లో కనిపించడం కచ్చితంగా విశేషమే. ‘గిరిజన’ అనే మాటతో ప్రతిధ్వనించే శబ్దం... కళ. ఆ కళ ఆటలు, పాటలు, వస్త్రాలు, కళాకృతుల రూపంలో వారి దైనందిన జీవితంలో భాగం అయింది. ప్రపంచీకరణ ప్రభావంతో ‘అత్యాధునికత’ అనేది పురా సంస్కృతులు, కళలపై కత్తిలా వేలాడుతుంది. ఆ కత్తి వేటు పడకుండా తమ సంప్రదాయ కళలను రక్షించుకోవడమే కాదు... ‘ఇది మా కళ’ అని ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది మర్రిచెట్టు తండా...
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మరిచ్రెట్టు తండా... ఒక కేక వేస్తే తండా మొత్తం వినిపించేంత చిన్న తండా. వ్యవసాయపనులు, బయటి ఊళ్లల్లోకి వెళ్లి కూలిపనులు చేసుకునేవాళ్లే తండాలో ఎక్కువమంది ఉన్నారు.
వ్యవసాయం అయినా, కూలిపనులు అయినా శ్రమతో కూడుకున్నవి. ఇంటికి వచ్చిన తరువాత తండాలోని మహిళలకు ఆ శ్రమభారాన్ని తగ్గించేవి కళలు. అందులో ప్రధానమైనవి చేతివృత్తుల కళలు. తాతముత్తాతల నుంచి పరంపరగా వస్తూ తమ చేతికి అందిన ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేస్తున్నాయి.
అద్దాలు, దారాలు, గజ్జెలు, పూసలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఇంటికి అవసరమైన అలంకరణ వస్తువులను, గిరిజన సంప్రదాయ దుస్తులను రూపొందిస్తున్నారు. ఈ తండావాసుల హస్తకళలు నాబార్డ్ దృష్టిలో పడడంతో కొత్త ద్వారం తెరుచుకుంది. తండావాసులు తయారు చేసిన కళాకృతులు, దుస్తులను మార్కెటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని నాబార్డ్ ముందుకు వచ్చింది. నాబార్డు నిర్వహించే ఎగ్జిబిషన్‌లలో మర్రిచెట్టు తండావాసుల స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవాళ్లు.
నాబార్డ్ చొరవతో తండాకు మాత్రమే పరిమితమైన కళాకృతులు లోకానికి పరిచయం అయ్యాయి. సంప్రదాయ గిరిజన దుస్తులు, వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేసి రాజస్థాన్, హరియాణా, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మర్రిచెట్టు తండా మహిళలు తయారు చేస్తున్న పన్నెండు రకాల ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా పురుషులు అలంకరణగా ధరించే ‘విరేనాపాటో’కు మంచి ఆదరణ ఉంది.
తమ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా గొప్ప విజయం సాధిస్తే వారిని ఈ ‘విరేనాపాటో’తో సత్కరిస్తారు. దీంతోపాటు దర్వాజా తోరణం, చేతి సంచులు, కోత్లో (పైసలు దాచే సంచి), పులియాగాల (తలపై బుట్ట ధరించేది), గండో(మేరమ్మ అమ్మ వారి ప్రతీక), దాండియా డ్రెస్, కవ్య (పెళ్లయిన గిరిజన మహిళలు ధరించేవి), దడ్ప (ఫ్రిజ్ కవర్లు) మొదలైన వాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
‘మేము తయారు చేస్తున్న వస్తువులతో రాబడి వస్తోందనే సంతోషం కంటే వాటి గురించి ఎక్కడెక్కడి వాళ్లో మెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోంది. బట్టలు కూడుతున్నప్పుడో, బుట్టలు చేస్తున్నప్పుడో పని చేస్తున్నట్లుగా ఉండదు. హుషారుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏ పని లేనప్పుడు ఈ పనులు చేసేవాళ్లం. ఇప్పుడు ఈ పనే మాకు పెద్ద పని అయింది’ అంటుంది నేనావత్ చాంది.
‘బయట ఊళ్లకు పోయినప్పుడు మాది మర్రిచెట్టు తండా అని గర్వంగా చెప్తా. పనుల కోసం తండా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు ఇక్కడే ఉండొచ్చు’ అంటూ ఉపాధి కోసం దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లను అమ్మలాంటి తండాకు తిరిగి రావాలని కోరుకుంటుంది బాణావత్ పద్మ. వారికోసం హస్తకళలు ఎదురుచూస్తున్నాయి.
‘ఇప్పుడు మేము చేస్తున్నవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటుంది నేనావత్ సుబ్బులు. గిరిజన కళాకృతులలో ఎన్నో మరుగునపడిపోయాయి. వాటి గురించి తెలిసిన వారు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. అలాంటి వారితో మాట్లాడితే తెరమరుగైపోయిన ఎన్నో కళాకృతులు మళ్లీ కొత్త కాంతులతో వెలుగుతాయి.
నేనావత్ చాంది, నేనావత్ సుబ్బులు, బాణావత్ పద్మ... వీరు మాత్రమే కాదు మర్రిచెట్టు తండాలోని 150 మంది మహిళలు చేతివృత్తుల కళాకారులే కాదు చరిత్ర చెప్పే ఉపన్యాసకులు కూడా! ‘విరేనాపాటో’ నుంచి ‘గండో’ వరకు వాటి తయారీ గురించి మాత్రమే కాదు వాటి వెనుక చరిత్ర కూడా ఈతరానికి తెలియజేస్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది!
– చింతకింది గణేశ్, సాక్షి, నల్లగొండ,
కుటుంబానికి ఆసరాగా...
తండాలో దాదాపు 150మందికి పైగా మహిళలం చేతి అల్లికల ద్వారా సంప్రదాయ వస్త్రాలు, వస్తువులను తయారు చేస్తున్నాం. ఏ కొంచెం తీరిక దొరికినా ఎవరి ఇండ్లలో వాళ్లం వీటిని తయారు చేస్తుంటాం. ఒక్కో వస్తువు తయారు చేసేందుకు వారం రోజులు పడుతుంది. వీటిని అమ్మగా వచ్చే డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.
– బాణావత్ పద్మ
విదేశాల నుంచి వస్తున్నారు
మేము తయారు చేసే అల్లికలను చూడడం కోసం మా తండాకు విదేశాల నుండి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటూ మా పనులు చేసుకుంటూనే సంప్రదాయ పద్ధతిలో చేతితో అల్లికలు అల్లుతున్నాం. తీజ్ వేడుకల్లో గిరిజనులు ధరించే విరేనాపాటోతో పాటు పులియాగాల(తలపై ధరించేది)వంటి అలంకరణ వస్త్రాలు తయారు చేస్తున్నాం.
– నేనావత్ సుబ్బులు
సబ్సిడీ ఇవ్వాలి
సంప్రదాయ దుస్తులతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే అలంకరణ వస్తువులను 30 ఏళ్లుగా తయారు చేస్తున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లినా తీరిక వేళల్లో వీటిని తయారు చేస్తాం. మేము తయారు చేసిన వాటిని కొనేందుకు పట్టణాల నుంచి చాలామంది వస్తుంటారు. కొనడమే కాదు వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. అల్లికలకు ఉపయోగించే వస్తువులపై సబ్సిడీ ఇవ్వడంతోపాటు, పట్టణాల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ్రపోత్సహించాలి.
– నేనావత్ చాంది
Comments
Please login to add a commentAdd a comment