సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల..
తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్‌లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు..
మహేష్‌రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్‌రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్‌రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు.
► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం..
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్‌రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు.
► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు..
మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్‌రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్‌కు మహేష్‌రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్‌ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు.
► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం..
గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్‌రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది.
► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు
గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్‌రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment