
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎంప్లాయిమెంట్ కార్డు కావాలంటే నిరుద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్ కార్డు పొందవచ్చు. అది కూడా ఒకటి, రెండు రోజుల్లోనే. ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకునేలా ఉపాధి, శిక్షణ శాఖ తాజాగా www. employment.telangana.gov.in వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ వెబ్‌పోర్టల్ ద్వారా ఎంప్లాయిమెంట్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలు ఉండాలి. కొత్తగా నమోదు చేసుకునే నిరుద్యోగి ఫొటో, నివాస, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కాగితంపై సంతకాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్, అదనపు విద్యార్హత వివరాల నమోదు కూడా ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. వీళ్లు గడువులోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పోర్టల్ ద్వారా రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కార్డు పొందితే అది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సకాలంలో రెన్యువల్ చేసుకోలేకపోయిన వారికి ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అదనంగా ఇస్తారు. ఈ సమయంలోనూ రెన్యువల్ చేసుకోకపోతే ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్ జాబితా నుంచి అతడిని శాశ్వతంగా తొలగిస్తారు. ఎంప్లాయిమెంట్ కార్డు నమోదుకు ఒకరికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు. నిరుద్యోగి స్థానిక జిల్లా తరఫునే దరఖాస్తు చేసుకోవాలి. 45 ఏళ్ల లోపున్న నిరుద్యోగులే అర్హులు. ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు మరింత ఉత్తమ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అతను పని చేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment