కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు | Delivery of the new government | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

Published Sun, Jun 15 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

  •   జాబ్ వైపు యువత చూపు
  •    నిన్న ఉద్యమ పాట.. నేడు ఉద్యోగ బాట
  •    ఉపాధి కల్పన కార్యాలయానికి క్యూ కడుతున్న నిరుద్యోగులు
  •    రోజూ భారీగా నమోదవుతున్న  దరఖాస్తులు
  • మెహిదీపట్నం :  తెలంగాణ  రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన యువత.. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. నిన్నటి వరకు ఉద్యమబాటలో నడిచిన యువతరం.. నేడు నవ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి దరఖాస్తులు భారీగా వచ్చిపడుతున్నాయి. ఇంతకాలం ఇక్కడ రోజుకు పది దరఖాస్తులు కూడా వచ్చేవి కావు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది.

    రోజూ వందకు మించి దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. దీన్నిబట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఉపాధి కల్పన కార్యాలయాలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు.

    ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ముందుగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో విద్యార్హతతో పేరు నమోదు తప్పనిసరిగా చేయాలి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికీ యువత తాకిడి పెరిగింది. గతేడాది మొత్తానికి 500 దరఖాస్తులు వస్తే.. ప్రస్తుతం రోజుకు 100 నుంచి 150 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకోని నిరుద్యోగులు సైతం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
     
    మూడింతలు పెరిగిన దరఖాస్తులు
     
    2013-14 సంవత్సరానికి హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 500 దరఖాస్తులు వచ్చాయి. గడిచిన రెండుమూడు నెలల్లోనే సుమారు నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఉపాధి కల్పన కార్యాలయంలో జిల్లాకు సంబంధించి నిరుద్యోగులు చేసుకున్న దరఖాస్తుల సంఖ్య 75వేలకు పైగా ఉంటాయి. వీరంతా ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ అర్హత గల అభ్యర్థులు. డిగ్రీ ఆపై విద్యార్హత గల వారు మరో 25 వేల నుంచి 35 వేల వరకు ఉన్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి అంగద విజయ భోగేశ్వరుడు తెలిపారు.

    జూన్ నెలాఖరుకల్లా మరో రెండువేలకు పైనే వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొంటున్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ కార్యాలయం ద్వారా సుమారు 500 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయమని కొత్త సర్కారు సైతం చెబుతోంది. మరి హైటెక్ నగరిని కేంద్రంగా చేసుకుని ఉద్యోగాల కల్పనకు ఎలా కృషి చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
     
    తెలంగాణ వచ్చింది.. ఉద్యోగమూ వస్తుందని..
    డిగ్రీ పూర్తయింది. ఇప్పటి వరకూ ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడటంతో ప్రభుత్వ ఉద్యోగాలపై కాస్త ఆశలు చిగురించాయి. అందుకే ముందుగా ఎంప్లాయిమెంట్ కార్డుకు దరఖాస్తు చేసుకుందామని వచ్చా. ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషిస్తా.
      - తరుణ్, గ్రాడ్యుయేట్, సికింద్రాబాద్
     
     ఖాళీలు భారీగా ఉంటాయని..
     తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు కదా. అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకుందామని వచ్చాను. తెలంగాణ ఏర్పడటంతో ఖాళీలు భారీగా ఉంటాయని ఉద్య మ సమయంలో చెప్పారు. అంతేకాకుండా ఉద్యమ సమయంలో నాయకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారుగా. నాకు తగిన ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా చేస్తా.     
     - బాలమల్లేష్,  ఎంబీఏ స్టూడెంట్, చార్మినార్
     
     ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటున్నా..  
     ప్రభుత్వ ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఇన్నాళ్లూ నమ్మకం లేదు. అయి నా కొన్నేళ్ల క్రితం ఎంప్లాయిమెం ట్ కార్డు తీసుకున్నాను. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుం దన్న ఉద్దేశంతో ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్ చేసుకునేందుకు వచ్చా. పక్కా అర్హతలుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశ తో ఉన్నాను.     
     - రాజేష్, గ్రాడ్యుయేట్, ఉప్పుగూడ
     
     ఎన్ని దరఖాస్తులు వచ్చినా స్వీకరిస్తున్నాం
     గతంలో రోజుకు పదికి మించి దరఖాస్తులు వచ్చేవి కావు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి వందల సంఖ్యలో నిరుద్యోగులు నిత్యం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము సీనియారిటీ ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం.  
      - అంగద విజయ భోగేశ్వరుడు, హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement