AP: భారీగా పెరిగిన ఉద్యోగులు | good news for unemployees in andhra pradesh | Sakshi
Sakshi News home page

AP: భారీగా పెరిగిన ఉద్యోగులు

Published Fri, Dec 22 2023 6:04 AM | Last Updated on Fri, Dec 22 2023 5:25 PM

good news for unemployees in andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఏటా పెరుగుతున్న కొత్త ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018–19తో పోలిస్తే 2022–23లో రాష్ట్రంలో ఈపీఎఫ్‌ ఖాతాలు 35 శా­తం మేర పెరిగినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. టీడీపీ ప్ర­భుత్వం ఉండగా 2018–19లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్‌ ఖాతాలు ఉండేవి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్య­తలు చేపట్టిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి.

ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరోపక్క ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు. దీంతో 2020–­21లో రాష్ట్రంలో పీఎఫ్‌ ఖాతాల  సంఖ్య 52.39 లక్షలకు పెరిగింది. అంతే సుమారు 5.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2021–22లో వీటి సంఖ్య 56.34 లక్షలకు పెరిగాయి. 2022–23లో 60.73 లక్షలకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో 2018–19లో 22.91 కోట్లుగా ఉన్న పీఎఫ్‌ ఖాతాలు 2022–23 నాటికి 29.88 కోట్లకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 30.38 శాతం ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన జాతీయ స్థాయి కన్నా రాష్ట్రంలోనే పీఎఫ్‌ ఖాతాల పెరుగుదల ఎక్కువ.

తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, తమిళనాడు, పుదుచ్చేరిలో 27 శాతం మేర ఖాతాలు పెరిగాయి. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే,  మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో యువతకు ఉద్యోగాలిచ్చారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా 1,25,110 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరోపక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు.

ఇలా వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ శాశ్వత, కాంట్రాక్టు పద్ధతుల్లో నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. ఈ విషయం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నివేదికల్లోనూ వెల్లడైంది. 2018–19లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 45 మంది, పట్టణాల్లో 73 మంది నిరుద్యోగులు ఉండగా 2022–23లో గ్రామాల్లో 33, పట్టణాల్లో 65కు నిరుద్యోగిత తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement