ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం | Lots Of Jobs In Multinational Companies In Andhra Pradesh, Details Inside - Sakshi
Sakshi News home page

ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం

Published Mon, Jan 29 2024 5:32 AM | Last Updated on Mon, Jan 29 2024 9:44 AM

Lots of jobs in multinational companies In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఓ వైపు పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, మరోవైపు కోర్సుల్లో చేరాక ప్రముఖ సంస్థలతో ఉచితంగా ఇప్పిస్తున్న నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌.. వెరసి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి పే ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది.

ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేలా కార్యాచరణ అమలు చేస్తోంది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్‌ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్‌ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్‌ టర్మ్, లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌లను అందించింది.

వీటికి తోడు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఫ్యూచర్‌ స్కిల్స్‌ అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. నైపుణ్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

 

అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ.. 
రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సర్టీఫికేషన్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. 

ఉద్యోగ నియామకాల్లో గణనీయ ప్రగతి.. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018–­19లో రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య కేవలం 37 వేలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఇందులో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో ఉద్యోగాలు పొందినవారు 60 వేల మంది వరకు ఉన్నారు. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే 12వేలకు పైగా ప్లేస్‌మెంట్లు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. 

గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా.. 
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. సర్టీఫికెట్లను సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడింది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏడాదికి గరిష్టంగా రూ.35వేలలోపు ఇస్తే.. జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థి తల్లులు ఖాతాల్లోనే క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తోంది.

లక్షన్నర మందికి శిక్షణ
నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వి­సెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ఫ్యూచర్‌ స్కిల్స్‌ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్‌ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్‌వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) ఎనలిస్ట్‌ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. ఎడ్యుస్కిల్స్‌ ఫౌండేషన్‌ సంస్థతో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అందించింది.

టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లించి..
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్ట­ల్‌ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం నాలుగున్నరేళ్ల­లోనే 27 లక్షల మంది విద్యా­ర్థులకు ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లి­ంచడం విశేషం. గత ప్రభు­­త్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా జగన్‌ ప్రభుత్వం చెల్లి­ంచింది. బాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌­­మెంట్, వసతికి చెల్లి­ంపులు ఏడాదికి సగటున కేవలం రూ.2,428 కోట్లు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లను చెల్లిస్తో­ంది.

భోజన, వసతి ఖర్చు కింద ఏడాదికి రెండు వాయి­­దాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సు­లు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయా­న్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కేవలం రూ.4 నుంచి రూ.10 వేల వరకే ఇచ్చేది. ఈ పథకం అమ­లు­కు గత ప్రభుత్వం విద్యా­ర్థుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని బీసీ, ఈబీసీ, కాపు, మైనారీ్టలకు రూ.లక్షకు, ఎస్సీ, ఎస్టీ, పీడీబ్ల్యూలకు రూ.2 లక్షల­కు పరిమి­తం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వ­ం అన్ని వర్గాలకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి లబ్ధి చేకూర్చింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆదుకుంది.. 
మాది పేద రైతు కుటుంబం. గతంలో సాగుకే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 2017లో అన్న వరుణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో చేరాడు. అప్పట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగిలిన ఫీజు అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో నేను 2019­లో వడ్లమూడి­లోని విజ్ఞాన్‌ లారాలో బీటెక్‌ సీఎస్‌ఈలో చేరా­ను. జగనన్న సాయంతో ఏటా రూ.85 వేల ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండానే నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు బెంగళూరులోని టీసీఎస్‌­లో రూ.3.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.  – బోరెడ్డి పవన్‌ కుమార్‌రెడ్డి, సొలస గ్రామం, పల్నాడు జిల్లా 

జగనన్న విద్యాదీవెన గొప్ప పథకం.. 
నాన్న హరనాథ్‌ నిర్వహించే ఫ్యాన్సీ షాపు మాకు జీవనాధారం. నన్ను, అన్నయ్యను చదివించడానికి చాలా కష్టపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రావడంతో నేను దిగులు లేకుండా టెక్కలిలో బీటెక్‌ సీఎస్‌సీ పూర్తి చేశాను. ఏడాదికి రూ.80వేల చొప్పు­న కోర్సు నాలుగేళ్లపాటు పూర్తి ఫీజు రీయి­ం­బర్స్‌మెంట్, వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. కాలేజీలో ఉండగానే ఉచితంగా సర్టిఫికేషన్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ అందించడంతో డెలాయిట్‌లో ఉద్యో­గం సాధించగలిగాను. జగనన్న విద్యాదీవెన కచ్చితంగా గొప్ప పథకం.  – సత్యవరపు మహాలక్ష్మి, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా

ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్‌ కోర్సులు 
మా నాన్న నగేశ్‌ సామాన్య కూరగాయల వ్యాపారి. నేను విద్యా దీవెన సాయంతో గతే­డాది బీకామ్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశా. ఉన్నత విద్యా మండలి ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్‌ కోర్సులు అందించింది. ఫలితంగా సాధారణ డిగ్రీ చేసిన నాకు హెచ్‌సీఎల్‌లో రూ.2.40 లక్షల ప్యాకేజీతో ఫైనాన్స్‌ ఎనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి నాలుగు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో సెలక్ట్‌ అయ్యాను. ఎడ్యుటెక్‌ సంస్థలో 6.50 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ చేశారు. కంప్యూటర్స్‌ కెరీర్‌లో ఎదగాలని హెచ్‌సీఎల్‌ను ఎంపిక చేసుకు­న్నా. – ముదిలి నాగకార్తీక్, విజయవాడ

విద్యాదీవెన ఆదుకుంది
మా నాన్న రామచంద్రరావు ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేస్తున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం. నాన్న ఏడాది సంపాదన లెక్కేస్తే మా ఇద్దరి చదువులకే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడంతో నేను బీఎస్సీ (ఐవోటీ) పూర్తి చేశాను. తమ్ముడు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ చేస్తున్నాడు. నాకు మూడేళ్లు రూ.30 వేల చొప్పున పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. – పట్నియక్‌ శ్రీనివాసరావు, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement