క్యాంపస్‌ సెలక్షన్స్‌లో టాప్‌ | Top in Campus Selections: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో టాప్‌

Published Fri, May 10 2024 3:50 AM | Last Updated on Fri, May 10 2024 3:50 AM

Top in Campus Selections: Andhra Pradesh

అద్భుత ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నైపుణ్య సంస్కరణలు 

చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధిస్తున్న ఏపీ యువత 

ఇంటర్న్‌షిప్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ రెడీస్‌లోనూ అగ్రగామిగా రాష్ట్రం  

గతేడాది సంప్రదాయ డిగ్రీలో 60 వేల మందికి క్యాంపస్‌ కొలువులు 

సాంకేతిక విద్యలో ఏకంగా 1.20 లక్షల మందికి పైగా ఉద్యోగాలు 

ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులకు జాబ్‌లు 

మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా శిక్షణ 

ఎడెక్స్‌తో కలిసి 2 వేల అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు..

ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్‌ వంటి అంశాల్లో శిక్షణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థినీ గ్లోబల్‌ ఉద్యోగిగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఉద్యోగ నైపుణ్య ఆధారిత విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. విద్యార్థి చదువు సమయంలోనే వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మల్టీ నేషనల్‌ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.

ఇంటర్న్‌షిప్, ఫ్యూచర్‌ స్కిల్స్‌లో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానం­లో నిలిచింది. అత్యధిక ఉద్యోగాలు సాధి­స్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలిచింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇంజనీరింగ్, డిగ్రీలోనే కాకుండా డిప్లొమా విద్యార్థులూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో  పేదింటి బిడ్డల విద్యకు ఆరి్థక భరోసా లభిస్తోంది. ఇందుకోసం సీఎం జగన్‌ ఈ ఐదేళ్లలో రూ.18,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 

పెరిగిన క్యాంపస్‌ కొలువులు 
చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్‌ కొలువులు సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది (2022–23లో) ఏకంగా 1.80 లక్షల మందికి పైగా ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 1.20 లక్షల మందికి పైగా సాంకేతిక విద్యనభ్యసించిన వారు కాగా, సాధారణ డిగ్రీ అభ్యసించి ఉద్యోగాలు పొందిన వారు 60 వేల మంది ఉన్నారు. 

ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్‌ సెలక్షన్స్‌ జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది క్యాంపస్‌ ఎంపికల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులు రూ.8.60 లక్షల వరకు ప్యాకేజీని అందుకున్నారు. 

ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగ నైపుణ్యం
ఉన్నత విద్యలో 30కి పైగా గ్లోబల్‌ సర్విసు ప్రొవైడర్ల ద్వారా వర్చువల్, మరో 27 వేలకు పైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసి ఎక్స్‌పీరియన్స్‌ ఇంటర్న్‌షిప్‌లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో 52.80 శాతం ఐటీ, 13.43 శాతం అకౌంటింగ్, 8.45 శాతం విద్యా, 5.47 శాతం ఫార్మా, 8.68 శాతం మార్కెటింగ్, 4.39 శాతం గవర్నమెంట్‌ సెక్టర్, 2.01 శాతం ఉత్పత్తి, 1.78 శాతం వ్యవసాయం, 1.36 శాతం ఆతిథ్యం, 0.9 శాతం అడ్వరై్టజింగ్, 0.7 శాతం బయోటెక్నాలజీ రంగంలో పేరు గడించిన సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా షార్ట్‌ టర్మ్, లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందించింది. తద్వారా చదువు సమయంలోనే విద్యార్థులు సంపాదనను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్‌ సర్టీఫికేషన్, మరో 1.50 లక్షల మంది ఇతర సర్టిఫికేషన్లు సాధించారు. ఎడెక్స్‌ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టీఫికేషన్‌ కోర్సులు పూర్తి చేసి 1.73 లక్షలకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. వీటన్నింటి ఫలితంగా క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.  

నైపుణ్యాన్ని పెంచే సర్టీఫికేషన్‌
ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌లో భాగంగా డేటా సైన్స్, ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సర్టీఫికేషన్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 37 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ద్వారా ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), పైథాన్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. 

నాస్కామ్‌ ప్యూచర్‌ స్కిల్స్‌ పేరి

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్విసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ఫ్యూచర్‌ స్కిల్స్‌ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్‌ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్‌వీస్, హోండా, మారుతి సుజుకి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బీఎఫ్‌ఎస్‌ఐ అనలిస్ట్‌ తదితర అంశాల్లో శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్‌ ఫౌండేషన్‌ సంస్థతో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అందించింది. 

281మంది ఏయూ విద్యార్థులకు ఉద్యోగాలు 
ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 281 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఏపీఎండీసీలో రూ 8.4 లక్షల వార్షిక వేతనంతో ఐదుగురు, ప్రధాన్‌ ఎన్‌జీఓలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో పదిమంది, శ్రీ చైతన్య కళాశాలల్లో 60 మంది, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌లో 58 మంది, హెటిరో డ్రగ్స్‌లో 109 మంది, సింధు సంస్థలో 39 మంది మొత్తం 281 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కొంతమందికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. విశ్వవిద్యాలయం నుంచి వెళ్లే సమయంలో విద్యార్థి చేతిలో ఉద్యోగ నియామక పత్రం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి  తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ అధికారి వి.ఆర్‌.రెడ్డి పాల్గొన్నారు. 

రూ.16.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది 
మా స్వస్థలం ఒంగోలు. నాన్న రైతు. రాష్ట్రంలో సాంకేతిక విద్య కరిక్యులమ్‌లో తెచ్చిన మార్పులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదువు సమయంలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను క్యాంపస్‌లోనే నేర్చు­కున్నాం. సాధారణ పాఠ్యాంశాలతో విషయ పరిజ్ఞానం వస్తుంది. 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ సంపాదించాం.  కంప్యూటర్‌ సైన్స్‌ చివరి ఏడాదిలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. డారి్వన్‌బాక్స్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌లో రూ.16.30 లక్షల ప్యాకేజీతో లభించింది.        – అల్లాడి సంధ్య, జేఎన్‌టీయూ కాకినాడ  

మా ఫ్యామిలీ ఫుల్‌ ఖుష్‌
మాది విశాఖపట్నం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఇప్పుడు థాట్‌ వర్క్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. అక్కడ ఉద్యోగం చేసేవారికి ఉన్నత చదువులకు ఆ కంపెనీ సహకారం అందిస్తుంది. ప్రత్యేకంగా మార్కెట్‌లో జాబ్‌ ఓరియంటెడ్‌ స్కిల్స్‌పై మాకు తరగతి గదిలోనే నేరి్పంచారు. ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్‌ కోర్సులతో సిలబస్‌ను దాటి చాలా విషయాలు నేర్చు­కున్నాం. గడిచిన రెండేళ్లుగా మా కాలేజీలో క్యాంపస్‌ ఎంపికలు బాగున్నాయి.    – ఆర్‌.అజయ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనకాపల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement