సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకిచ్చే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధంచేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5)ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు.
అయితే, జేవీకే–4లో మిగిలిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా, ఏప్రిల్ చివరివారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా టెన్త్ పరీక్షలతో పాటు ఏప్రిల్ రెండోవారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో.. అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పి, తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం ‘రెగ్యులర్’గా పరిగణించి వారికి కూడా విద్యాకానుక కిట్లను అందించారు. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, జేవీకే–5 కిట్‌లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జేవీకే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచి్చంచింది.
నూరు శాతం నాణ్యతతో కిట్లు..
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ 2020–21 విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ను అందిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కిట్లను అందించారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు.. విద్యార్థులకిచ్చే ఈ కిట్ల నాణ్యతను ఆయా కంపెనీలు పరిశీలించే సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే.. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది.
Comments
Please login to add a commentAdd a comment