Distribution of kits
-
రూ.1,042.51 కోట్లతో విద్యాకానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకిచ్చే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధంచేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5)ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు. అయితే, జేవీకే–4లో మిగిలిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా, ఏప్రిల్ చివరివారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా టెన్త్ పరీక్షలతో పాటు ఏప్రిల్ రెండోవారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో.. అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పి, తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం ‘రెగ్యులర్’గా పరిగణించి వారికి కూడా విద్యాకానుక కిట్లను అందించారు. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, జేవీకే–5 కిట్‌లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జేవీకే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచి్చంచింది. నూరు శాతం నాణ్యతతో కిట్లు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ 2020–21 విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ను అందిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కిట్లను అందించారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు.. విద్యార్థులకిచ్చే ఈ కిట్ల నాణ్యతను ఆయా కంపెనీలు పరిశీలించే సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే.. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది. -
కేసీఆర్ కిట్ల జాడేదీ..
హన్మకొండచౌరస్తా (వరంగల్): బాలింతల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేసీఆర్ కిట్ల పంపిణీ’ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. ఆరు నెలల పాటు సజావుగానే సాగిన ఈ పథకంలో గత 8 నెలలుగా పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి కేసీఆర్ కిట్ల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఆయా ఆస్పత్రుల్లో ప్రసవం పొందిన బాలింతలను ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తున్నారు. ఈ మేరకు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి కేంద్రం, సీకేంఎం ప్రసూతి ఆస్పత్రి లో ‘సాక్షి’ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కిట్ల కొరత లేనప్పటికీ జిల్లా వైద్యాధికారులు ఇండెంట్ పంపటంలో నిర్లక్ష్యం వహించడం వల్లే సమస్య ఉత్పన్నం అవుతున్నట్లు తెలిసింది. వేధిస్తున్న కిట్ల కొరత.. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో ఈ నెల రెండో వారం మొదటి నాలుగు రోజుల్లో 60 ప్రసవాలు జరిగాయి. ప్రసవం జరిగిన వెంటనే వారికి కేసీఆర్ కిట్ ఇవ్వాలి. అయితే కిట్ల కొరతతో ‘రేపు ఇస్తాం..మాపిస్తాం’ అంటూ కాలయాపన చేసి 7 రోజుల అనంతరం వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు. ఈ కిట్‌తో పాటు గర్బిణీగా నమోదైనప్పటి నుంచి ప్రసవం తర్వాత వరకు తల్లుల ఖాతాలో విడతల వారీగా రూ.12వేలు జమ చేయాల్సి ఉండగా, కొంత మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. సీకేఎం ఆస్పత్రిలో గురువారం నుంచి దాదాపు 80 మంది బాలింతలకు కిట్లు ఇవ్వలేదు. చీరలు లేకుండానే .. ప్రసవించిన రోజే బాలింతకు కేసీఆర్ కిట్ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ కిట్‌లో రూ.2 వేల విలువ చేసే 16 వస్తువులుంటాయి. శిశువుకు ఉపయోగపడేలా రూ.350 విలువ గల దోమ తెర, రూ.90ల విలువైన బేబీ మాకిటోష్, రూ.200 వి లువైన రెండు డ్రెస్‌లు, రూ.100 విలువ చేసే రెం డు టవల్స్, రూ.100 విలువ చేసే బేబీ న్యాప్కిన్స్, జాన్సన్ బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్, ఆట వస్తువులు ఉంటా యి.. బాలింత కోసం రెండు సబ్బులు, రూ .350 విలువ చేసే రెండు చీరలు, రూ.150 విలువైన కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ ఇస్తారు. అయితే ఆరు నెలల పాటు సజావుగానే సాగిన ఈ పథకంలో తరువాత ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి. కిట్లలో 16 వస్తువులకు బదులుగా కొన్నింటిలో చీర, బకెట్ ఇతరత్రా వస్తువులు లేకుండానే పంపిణీ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కిట్లు లేవంటున్నారు.. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈనెల 16న డెలివరీ అయింది. రెండో కాన్పులో పాప పుట్టింది. పాప పుట్టగానే కేసీఆర్ కిట్ ఇస్తారని మా బంధువులు చెబితే సిబ్బందిని అడిగాం. కిట్లు అయిపోయాయి రాగానే ఇస్తామని చెప్పారు. అంతే కాదు పాప పుడితే రూ. 13వేలు అకౌంట్లో వేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. – రమ్య, గాంధీనగర్, ములుగు గణపురం ఎప్పుడు వస్తాయో తెలియదు.. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ కిట్లు అయిపోయాయి. అదే రోజు æ డీఎంహెచ్ఓకు ఇండెంట్ పంపించాం. హైదరాబాద్ నుంచి రావాలని చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో సుమారు 60మందికి కేసీఆర్ కిట్లు అందించాల్సి ఉంది. రాగానే పిలిచి అందజేస్తాం. – డాక్టర్ నిర్మల, సూపరింటెండెంట్, జీఎంహెచ్, హన్మకొండ. డెలివరి అయి వారం రోజులైంది.. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో ఈనెల 10న డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. రెండో కాన్పులో బాబు పుట్టాడు. వారం రోజులు కావడంతో ఈ రోజు డిశ్చార్జి రాశారు. ప్రసవించిన రోజే కేసీఆర్ కిట్ ఇస్తారు కదా అని అడిగితే, ఇప్పుడు లేవు రాగానే ఇస్తామని వారం రోజులుగా చెబుతు వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే అడిగినా.. రాగానే ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. – మౌనిక, గునిపర్తి, కమలాపూర్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లా -
చంద్రన్న కానుకకు పన్ను పోటు
చౌకడిపో డీలర్ల కమీషన్లో కోత నేడు బందరులో సమావేశం జేసీకి సమస్యలు నివేదించేందుకు సిద్ధం విజయవాడ బ్యూరో : చంద్రన్న కానుక కిట్లు పంపిణీ చేసిన డీలర్ల కమీషన్లో పలు రకాల పన్నుల పేరిట కోత విధించడంతో చౌక డిపో డీలర్లు డీలాపడ్డారు. చందన్న కానుకను లబ్ధిదారులకు అందించినందుకు డీలర్లకు ఒక్కో ప్యాకెట్‌కు రూ.5 కమీషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 13 లక్షల 17 వేలకు పైగా రేషన్ కార్డుల్లో 90 శాతానికి పైగా కానుకలు డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇందుకు తమకు కమీషన్ వస్తుందనుకున్న డీలర్ల ఆశలు ఆవిరవుతున్నాయి. వచ్చిన కమీషన్ కంటే ఖర్చులు తడిసిమోపెడయ్యాయంటూ లబోదిబోమంటున్నారు. సరుకులను తరలించేందుకు ఒక్కో షాపునకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కిరాయి, జట్టుకూలీ అయ్యాయని డీలర్లు వాపోతున్నారు. దీనికితోడు క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల్లో త్వరగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో రూ. వెయ్యి ఖర్చుపెట్టి ప్రత్యేకంగా సహాయకుల్ని పెట్టుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వృత్తిపన్ను, ఆదాయపు పన్ను, సర్వీసు ట్యాక్స్ పేరుతో ఒక్కో డీలర్‌కు రూ.500 చొప్పున కోత పెడుతున్నట్టు తెలిసింది. మిగిలిన కమీషన్ మొత్తాన్ని సరుకుల డీడీల్లో తగ్గించి తీసుకునేలా ఈ నెలలో డీలర్లకు అధికారులు చెప్పారు. కమీషన్లో ట్యాక్స్ కోత గురించి అడిగితే అందుకు సరైన సమాధానం లభించక డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లేందుకు సోమవారం మచిలీపట్నంలో జిల్లా స్థాయి డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా డీలర్ల సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.