చంద్రన్న కానుకకు పన్ను పోటు
చౌకడిపో డీలర్ల కమీషన్‌లో కోత
నేడు బందరులో సమావేశం
జేసీకి సమస్యలు నివేదించేందుకు సిద్ధం
విజయవాడ బ్యూరో : చంద్రన్న కానుక కిట్లు పంపిణీ చేసిన డీలర్ల కమీషన్‌లో పలు రకాల పన్నుల పేరిట కోత విధించడంతో చౌక డిపో డీలర్లు డీలాపడ్డారు. చందన్న కానుకను లబ్ధిదారులకు అందించినందుకు డీలర్లకు ఒక్కో ప్యాకెట్‌కు రూ.5 కమీషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 13 లక్షల 17 వేలకు పైగా రేషన్ కార్డుల్లో 90 శాతానికి పైగా కానుకలు డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇందుకు తమకు కమీషన్ వస్తుందనుకున్న డీలర్ల ఆశలు ఆవిరవుతున్నాయి. వచ్చిన కమీషన్ కంటే ఖర్చులు తడిసిమోపెడయ్యాయంటూ లబోదిబోమంటున్నారు. సరుకులను తరలించేందుకు ఒక్కో షాపునకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కిరాయి, జట్టుకూలీ అయ్యాయని డీలర్లు వాపోతున్నారు.
దీనికితోడు క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల్లో త్వరగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో రూ. వెయ్యి ఖర్చుపెట్టి ప్రత్యేకంగా సహాయకుల్ని పెట్టుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వృత్తిపన్ను, ఆదాయపు పన్ను, సర్వీసు ట్యాక్స్ పేరుతో ఒక్కో డీలర్‌కు రూ.500 చొప్పున కోత పెడుతున్నట్టు తెలిసింది. మిగిలిన కమీషన్ మొత్తాన్ని సరుకుల డీడీల్లో తగ్గించి తీసుకునేలా ఈ నెలలో డీలర్లకు అధికారులు చెప్పారు. కమీషన్‌లో ట్యాక్స్ కోత గురించి అడిగితే అందుకు సరైన సమాధానం లభించక డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లేందుకు సోమవారం మచిలీపట్నంలో జిల్లా స్థాయి డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా డీలర్ల సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.