బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్‌లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే..
సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి
చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు.
కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్‌లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది.
నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి..
అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్‌లో కరాటే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వెళ్లి పతకం సాధించాను.
ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్‌కు కోచ్‌గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.
బతికిరావడమూ కష్టమే..
అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను.
అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్‌లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment