విశాఖ డాల్ఫిన్ నోస్‌పై ఎన్‌సీసీఆర్ కేంద్రం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.62 కోట్లతో 5.5 ఎకరాల్లో నిర్మాణం
14న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు
రాష్ట్రంలోని 972 కి.మీ. తీర ప్రాంతమంతా పరిశీలించనున్న ఎన్‌సీసీఆర్
తీరంలో విపత్తుల నియంత్రణకు కృషి
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్‌లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది.
తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది.
లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్‌మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్‌నోస్‌లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు.
ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే...
♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది.
♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది.
♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది.
♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్‌లైన్ మేనేజ్‌మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది.
♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment