
ఢిల్లీ: యువ భారత శక్తి సామర్థ్యాలు ఆధునిక పారిశ్రామిక, సేవారంగాల వాస్తవిక అవసరాలను అనుగుణంగా లేవన్న చేదు నిజం మరోసారి నిరూపితమైన ఘటన ఇది. సరైన విద్యార్హతలున్నాసరే ఖాళీలకు మించి నిరుద్యోగులు భారత్‌లో పోగుబడుతున్నారని టెక్నాలజీ సంస్థ అయిన ఆన్‌మ్యాన్‌డ్ డైనమిక్స్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సీఈఓ శ్రీనాథ్ మల్లికార్జునన్ వ్యాఖ్యానించారు. అందుకు తన సంస్థకు వెల్లువెత్తిన ఉద్యోగ దరఖాస్తులను ఆయన సాక్ష్యంగా చూపారు.
తాజాగా శ్రీనాథ్..‘భారత్‌లోని మా కార్యాలయంలో ఇంటర్న్‌షిప్‌ల కోసం కేవలం రెండు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేసేందుకు తగు అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరాం. ఊహించనంతగా ఏకంగా 1,200 దరఖాస్తులు వచ్చాయి. రెండు ఉద్యోగాలకు 1,200 అప్లికేషన్లు అందుకోవడమంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తిష్టవేసిందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఈ 1,200 దరఖాస్తులను పూర్తిగా వడబోసి మేం చివరకు అత్యంత నైపుణ్యవంతులైన అభ్యర్థులకు చెందిన కేవలం 20 దరఖాస్తులను మాత్రమే ఉద్యోగాల కోసం పరిశీలిస్తాం’ అని తన లింక్డ్‌ఇన్ ఖాతాలో శ్రీనాథ్ రాసుకొచ్చారు. ఉద్యోగ విపణిలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిలో చేరేంత సత్తాను సాధించడంతో నేటి యువత వెనకబడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగ వేటలో యువ భారతం ఎందుకు విఫలమవుతోందో ఆయన కొన్ని కారణాలను విశ్లేషించారు.
కారణాలు ఇవే..
జేఈఈ పరీక్ష రాసి ఐఐటీల్లో చదువులు పూర్తిచేసుకున్న చాలా మంది తర్వాతి ఉన్నత విద్య చదివేందుకు ఆసక్తి చూపట్లేదు.
ఐఐటీల్లో చదివినా వీరిలోనూ నేటి పరిశ్రమలు, సేవారంగాల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు కొరవడుతున్నాయి.
ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సమర్థవంతమైన విద్య లభించట్లేదు.
నాలుగేళ్ల డిగ్రీలు పూర్తిచేస్తున్నా వారిలో అభ్యసన సామర్థ్యం వంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ పాళ్లు తగ్గుతున్నాయి.
కాలం చెల్లిన సిలబస్, కఠిన స్థాయి తగ్గిన పరీక్షలు, పూర్తి సమర్థత లేని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది మరో కారణం.
ఎక్కువ మంది విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి కేవలం కాల్ సెంటర్లు, క్లర్క్ వంటి బ్యాక్ ఆఫీస్ క్లరికల్ ఉద్యోగాలకే పరిమితం అవుతోంది.
కృత్రిమ మేథ(ఏఐ) విజృంభిస్తుండటంతో ఇలాంటి ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో కనుమరుగు అవుతాయి.
శ్రీనాథ్ ఇస్తున్న సూచనలు..
కాలేజీ విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ సిలబస్‌ను క్షుణ్ణంగా చదవండి.
మీ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెరి్నంగ్(ఎన్‌పీటీఈఎల్) కోర్సులనూ చదవండి
సొంతంగా చిన్నపాటి ప్రాజెక్టులను మీరే ప్రయత్నించండి. ఇందుకోసం ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోండి. సమయం వృథా చేయకండి.
స్పందించిన నిపుణులు..
శ్రీనాథ్ పోస్ట్‌పై పలు రంగాల నిపుణులు స్పందించారు. సర్టిఫికెట్‌లను సాధించడం కంటే నైపుణ్యాలను సాధించడంపై యువత దృష్టిపెట్టాలని వాళ్లు వ్యాఖ్యానించారు. వృత్తివిద్యా కోర్సులను విస్తృత స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల వరద మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు ఆధునిక కోర్సులను నేర్చుకుంటూ సన్నద్ధం కావాలని మరో నిపుణుడు అన్నారు. అంకుర సంస్థల వంటివి తాత్కాలికంగా ఉపాధి కల్పించినా అది శాశ్వత పరిష్కారం చూపలేవని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment