సాక్షి, ఖమ్మం: స్థానిక నామినేషన్లకు తెర పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కోలాహలంతో నామినేషన్ల పర్వమే ప్రచారాన్ని తలపించింది. చివరి రోజు కావడంతో గురువారం భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారితో పాటు నేతలు, పార్టీ శ్రేణులు రావడంతో నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడాయి. జెడ్పీటీసీ నామినేషన్లకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నిర్ణీత సమయంలోపు వచ్చిన వారిని జెడ్పీలోకి అనుమతించడంతో నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది.
అభ్యర్థుల సందడితో నామినేషన్ కేంద్రాలు జాతరను తలపించాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా కేంద్రాలలో ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు ఒక్కసారే భారీగా తరలిరావడంతో నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు ఇబ్బంది పడ్డారు. పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులు చివరి నిమిషంలో కుల ధ్రువీకరణ, ఇంటి పన్ను, ఇతర అర్హత పత్రాల కోసం హైరానా పడ్డారు. అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవడం, లేని పత్రాల కోసం ఉరుకులు.. పరుగులు పెట్టారు. ఇక జెడ్పీటీసీ నామినేషన్లకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో జెడ్పీ కార్యాలయం జనంతో నిండిపోయింది. అభ్యర్థితో పాటు బలపరచడానికి మరో ఇద్దరిని మాత్రమే లోనికి పంపించారు.
అయితే పలు పార్టీ నేతలు రావడం.. అభ్యర్థుల వెంట తమను లోనికి పంపించాలన్న వాదనలు, నినాదాలతో జెడ్పీలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. మండలాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తరలివచ్చారు. దీంతో ఈ నామినేషన్ల ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. తొలిసారి నామినేషన్ వేసే అభ్యర్థులు నామినేషన్ పత్రం భర్తీ చేయడం రాక , డిపాజిట్ ఎక్కడ చెల్లించాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. కుల ధ్రువీకరణ ఒరిజినల్ పత్రాలు లేని వారు జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ సంతకం కోసం జెడ్పీ కార్యాలయం, ఖమ్మంలో తమకు తెలిసిన అధికారుల వద్దకు పరుగులు పెట్టి మరీ సంతకాలు చేయించుకున్నారు.
కుక్కునూరుకు నామినేషన్లు నిల్..
కుక్కునూరు మండలంలో జెడ్పీటీసీ స్థానంతో పాటు 8 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోలవరం ముంపు నుంచి కుక్కునూరును మినహాయించాలని, అప్పటి వరకు నామినేషన్లు ఎవరు వేసినా అడ్డుకుంటామని అఖిలపక్ష పార్టీలు హెచ్చరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అఖిలపక్ష పార్టీల హెచ్చరికలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నుంచి ఆశావహులు ఎవ్వరూ.. నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు.
జెడ్పీటీసీకి నామినేషన్ వేస్తారేమోనని చివరిరోజు అఖిలపక్ష పార్టీల నేతలు జెడ్పీ కార్యాలయం వద్ద కాపలా కాశారు. చివరకు తమ వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలే దు. దీంతో ఇక ఈ మండలానికి ఇప్పట్లో ఎన్నికలు లేనట్లేనని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. అసలు మండల ఓటర్లు పోలింగ్ బహిష్కరిస్తే ఎన్నికలు ఎలా జరగుతాయన్న వాదన ఉంది.
ఎస్సీ మహిళా స్థానాల్లో వలస నేతలు..
జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో చివరి రోజు ఆయా పార్టీల నేతలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయిన జెడ్పీటీసీ స్థానాల నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థులతో నామినేషన్‌లు వేయించారు. జిల్లాలోని వాజేడు, చర్ల, వెంకటాపురం, పినపాక మండలాలు ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో ఈ మండలాల నుంచి పోటీ చేసి విజయం సాధించాలన్న వ్యూహంతో పలు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇతర మండలాల్లో నేతలుగా ఉన్న ఎస్సీ మహిళలను ఈ మండలాల్లో నామినేషన్లు వేయించడానికి పోటీపడ్డారు. కొత్తగూడెం, అశ్వాపురం, భధ్రాచలం, ఏన్కూరు మండలాలు ఎస్సీ జనరల్ కావడంతో ఇక్కడి నుంచి మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
అంతర్గతంగా స్థానిక పొత్తులు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టం పూర్తయినా పలు నియోజకవర్గాల్లో స్థానిక పొత్తులు కుదరలేదు. కొన్ని చోట్ల పార్టీల నేతలు అంతర్గంతంగా పొత్తులు కుదుర్చుకొని నామినేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా బరిలో నిలిచే నేతలు.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సమయం దొరకక స్థానిక పొత్తులపై దృష్టి పెట్టలేదని నేతలు అభిప్రాయ పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ ఎన్నికలు కీలకమైనా అధినేతలు పట్టించుకోకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం సాధించినా, ఓటమి పాలైనా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరిస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితులతో నామినేషన్ల ఉప సంహరణ నాటికైనా ఇప్పటి వరకు అంతర్గంతగా ఉన్న స్థానిక పొత్తులు బహిర్గతమవుతాయో .. లేదో వేచి చూడాల్సిందే.
నామినేషన్లకు తెర
Published Fri, Mar 21 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement
Advertisement