చైర్మన్ పీఠం కోసం టీడీపీలో కుమ్ములాటలు
బొబ్బిలి, న్యూస్‌లైన్: బొబ్బిలి తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. స్థానిక మున్సిపల్ చైర్మన్ సీటు పొందేందుకు తగినంత బలం లేకపోయినా పట్టణ నాయకులు ఎవరికి వారు తనదే పదవంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పదవికి పోటీ మరింత పెరిగింది. చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఆ పార్టీకి ఉండే అవకాశాలను ఒకసారి పరిశీలిస్తే.... బొబ్బిలి పురపాలక సంఘంలో 30 వార్డులున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 వార్డులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, 13 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. మున్పిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కనీసం 16 మంది సభ్యులుండాలి.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు కీలకమయ్యారు. బొబ్బిలి నియోజక వర్గంలో ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కలిసి వస్తారనే నమ్మకం పెట్టుకున్నారు టీడీపీ నేతలు. అలా అయితే టీడీపీ సంఖ్యా బలం 15కు చేరుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేకు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు వేయడానికి అవకాశం ఉండగా, టీడీపీకి విజయనగరం ఎంపీ ఓటు వేయడానికి అవకాశం ఉంది. అలాగైనా రెండు పార్టీలకు సమాన బలం ఉంటుంది. దీంతో ఈ పదవిని కట్టబెట్టేందుకు లాటరీ తీయడం ఒక్కటే పరిష్కారంలా కనిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టీ ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఓటుతో మున్సిపాల్టీలో గట్టెక్కాలని ఆ పార్టీనేతలు చూస్తున్నారు.
మొదలైన విభేదాలు
ఇలా అంచనాలు వేసుకుంటున్న టీడీపీ నాయకులు కొందరు చైర్మన్ పీఠంపై కన్నేశారు. ఆ సీటు నాకు కావాలంటే నాకు కావాలంటూ గెలిచిన కౌన్సిలర్లు వారి బలాలను ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సీటు ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఈ సీటు కోసం పట్టణ టీడీపీ అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తూముల అచ్యుతవల్లి, ఇటీవల పార్టీలో చేరిన రెడ్డి ప్రసాద్, చోడిగంజి రమేష్‌నాయుడు తీవ్రంగా పోటీపడుతున్నారు. 2009లో ప్రజారాజ్యంలో పార్టీలో ఉన్న పువ్వల శ్రీనివాసరావును 2010లో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంలో టీడీపీలోకి తీసుకువచ్చారు.
మున్సిపల్ చైర్మన్ స్థానం ఓసీకి కేటాయిస్తే నిన్నే చైర్మన్‌ను చేస్తామంటూ నియోజకవర్గ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఓసీ స్థానం అవడంతో చైర్మన్ పదవిని తనకే ఇవ్వాలని పువ్వల పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో వైపు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ కౌన్సిలర్‌గా గెలిచినందుకు అచ్యుతవల్లికి ఎట్టి పరిస్థితిలోనైనా చైర్‌పర్సన్‌ను చేయాలని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు తూముల భాస్కరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే చెరో రెండున్నర ఏళ్లు పదవుల్లో ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకుందామని సూచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్‌ఆర్‌ఐ రెడ్డి లక్ష్మీప్రసాద్ కూడా చైర్మన్ పోస్టు కోసం పట్టుబడుతున్నారు. సొంతంగా నలుగురు కౌన్సిలర్లను గెలిపించుకొని సత్తా నిరూపించుకున్నానని, నాకే ఆ స్థానం దక్కాలని కరాఖండీగా చెబుతున్నట్లు సమాచారం. అలాగే పాతబొబ్బిలికి చెందిన కౌన్సిలర్ చోడిగంజి రమేష్‌నాయుడు కూడా చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.